రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

మహాప్రసాదం!


ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారికి పదవీగండం ఉందని ప్రచారం జరిగింది. దీంతో ఆ ఖాకీబాసు తిరుపతి లడ్డూలు పట్టుకుని ఓ కీలకనేత దర్శనానికెళ్లారు. అనుకున్నట్టే, రెండ్రోజుల్లో దొరగారి పదవి వూడింది. కానీ, బొత్తిగా పన్లేని సీట్లో కూర్చోబెట్టకుండా, కాస్త గౌరవప్రదమైన బాధ్యతే కట్టబెట్టారు. తిరుపతి లడ్డూ రాయబారం పనిచేసిందన్నమాట!
తిరుపతి లడ్డూలు చేతిలో ఉంటే తిరుగే ఉండదు. సీఎం పేషీకెళ్లినా ప్రైమ్‌మినిస్టర్‌ ఆఫీసుకెళ్లినా పనులు చకచకా జరిగిపోతాయి. ఇక అమెరికాకెళ్తే, సాక్షాత్తు శ్రీవేంకటేశుడే వచ్చినంత సంబరపడిపోతారు ప్రవాస సోదరులు. అంత కమ్మగా ఉంటాయి కాబట్టే శ్రీనివాసుడు ఏరికోరి వండించుకుంటున్నాడో, శ్రీనివాసుడికి నివేదించడంవల్లే ఆ కమ్మదనం వచ్చిందో తెలియదు కానీ...లడ్డూలంటే తిరుపతి లడ్డూలే! ఆ రుచి నాలుకని తాకగానే అప్రయత్నంగా కళ్లుమూసుకుంటాం. అది భక్తి కావచ్చు, తీపంటే అనురక్తీ కావచ్చు. ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే తిరుపతి లడ్డూ!

1940 ప్రాంతంలో కల్యాణోత్సవాలు మొదలైనప్పుడే...లడ్డూ ప్రసాదం పుట్టింది. తిరుపతి లడ్డూ తయారీకి కచ్చితమైన పద్ధతంటూ ఉంది. ఏయే దినుసుల్ని ఎంతెంత పరిమాణంలో వాడాలో తెలియజేసే ‘దిట్టం' ఉంది. కాలానికితగినట్టు దానికీ మార్పులు చేస్తున్నారు. తొలిరోజుల్లో కట్టెల పొయ్యిమీద ప్రసాదం తయారు చేసేవారు. మెల్లగా యంత్రాలు ప్రవేశించాయి. రుచిలోనూ నాణ్యతలోనూ ఎంతోకొంత తేడా వచ్చింది. అయినా, తిరుపతి లడ్డూలకు తిరుగులేదు. పేటెంటు పుణ్యమాని ఆ విశిష్టత రికార్డులకెక్కింది.