తితిదే చేపట్టిన ‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం' పథకంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ జరపాలని నిర్ణయించడంతో దేవస్థానం అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ భక్తుడు రూ.ఐదు కోట్లు విలువ చేసే 25 కిలోల బంగారం ఇవ్వడానికి వచ్చి వెనక్కు తీసుకువెళ్లిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఓ భక్తుడు 25 కిలోల బంగారంతో పాటు తితిదేలోని ఓ అధికారిని కలుసుకున్నారు. తాను ‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం' పథకానికి వితరణ చేయడానికి వచ్చినట్లు తెలిపారు. పూర్తి వివరాలు రాసుకుని వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆలయానికి బంగారం తీసుకురావాల్సిందిగా అధికారి దాతకు సూచించారు. చట్టపరంగా ఉన్న ఇబ్బందులు కారణంగా తాను చిరునామా వివరాలు ఇవ్వలేనని, బంగారం తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. సిబ్బంది నిరాకరించడంతో భక్తుడు అసంతృప్తితో బంగారం తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.