స్లిమ్ బ్యూటీస్..
సన్నగా కనబడడానికి చాలామంది టీనేజ్ మహిళలు పడరాని పాట్లు పడుతున్నారు. జిమ్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యూటీషియన్లకు వేలకు వేలు సమర్పించుకుంటున్నారు. ఇన్ని తిప్పలు పడినా ఫలితం ఆవగింజలో అరభాగం కూడా వుండడంలేదు. వీరి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.
స్లిమ్‌గా మారేందుకు రోజుల తరబడి కడుపు మాడ్చుకోవడం వలన జీర్ణక్రియ దెబ్బతింటుంది. దీని ప్రభావం కండరాల మీద పడుతుంది. చిన్న వయసులోనే కీళ్ళనొప్పులు, ఎక్కువ దూరం నడవలేకపోవడం వంటివి బాధిస్తాయి.
శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా తమ పని తాము చేసుకుపోవాలంటే అందుకు అవసరమైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. రోజంతా చురుకుగా పనిచేయాలంటే కేలరీలు తప్పనిసరి. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే కేలరీలు పొందడం సాధ్యమవుతుంది. కొన్ని రోజుల పాటు ఉపవాసాలు చేసి, ఆ తరువాత కేలరీల వినియోగం గణనీయంగా తగ్గిపోతుంది. కేలరీలు వినియోగం తగ్గినప్పుడు కొవ్వు వచ్చి చేరుతుంది.
ఎక్కువ తింటున్నాం కాబట్టి ఎక్కువసేపు వ్యాయామం చేయాలనుకోవటం పొరబాటని నిపుణులు అంటున్నారు. కొద్దిపాటి వ్యాయామాలతో అందంగా ఆరోగ్యంగా వుండడం సాధ్యమవుతుంది. కింద సూచించిన విధంగా మీ ఆహారపు అలవాట్లని మార్చుకున్నట్లయితే అందాన్ని పదికాలల పాటు కాపాడుకోవచ్చు.
ప్రతి మూడు లేదా నాలుగు గంటలకొకసారి ఆహారం తీసుకుంటూ వుండాలి (నిద్రపోయే సమయంలో తప్ప). కడుపును ఖాళీగా వుంచితే గ్యాస్ చేరే అవకాశం వుంది. కాబట్టి మూడు నాలుగు గంటలకు మించి కడుపును ఖాళీగా వుంచుకోకండి.
ఆహారంలో ఎక్కువ భాగం గింజలు వుండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. తీసుకొనే ఆహారాన్నే మూడు లేదా నాలుగు భాగాలుగా విభజించుకోవాలి.
ప్రొటీన్లు తీసుకోవడం తప్పనిసరి, ప్రొటీన్లు మిమ్మల్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా వుంచుతాయి. గంటల తరబడి పనిచేసినా నీరసం రాకుండా ప్రొటీన్లు కాపాడతాయి.
తృణధాన్యాలు తీసుకొనేటప్పుడు ఫైబర్ అధికంగా వున్నవాటినే తీసుకోవాలి. దీనితోబాటు చక్కెర తక్కువ వున్నవాటినే ఎంపిక చేసుకోవాలి.
రోజుకు కనీసం ఐదు రకాల పండ్లన్నా తీసుకోవాలి. తాజా పండ్లు కూరగాయలలో విటమిన్లు, ఫైబర్ అధికంగా లభిస్తాయి.
60 నుంచి 70 శాతం ఆహారం తీసుకొని మిగతా 30 నుంచి 40 శాతం నీటిని తాగాలి. అంటే రోజుకి 12 గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి.
బేకరీ ఉత్పత్తులకు పూర్తిగా దూరం కాకుండా తీసుకొనే పరిమాణాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది. బేకరీ ఉత్పత్తులతో పాటు పళ్ళు కూరగాయలు తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్లు, పోషకాలు అందుతాయి.
శరీరాన్ని కష్టపెట్టే వ్యాయామాల కన్నా రోజూ కొంత సేపు నడిస్తే మంచిది. కనీసం అరగంటకి తక్కువ కాకుండా నడవడం అలవాటు చేసుకోవాలి. రోజు మొత్తంలో ఏ సమయంలోనైనా నడవచ్చు. అయితే తెల్లవారుజామున నడిస్తే ఫలితాలు మరింత మెరుగ్గా వుంటాయి.
మీ డైట్ ప్లాన్‌ను తరచూ మార్చకుండా కొన్ని వారాల పాటు కొనసాగించాలి. మూడు నాలుగు వారాలకొకసారి మాత్రమే డైట్ ప్లాన్‌ను మార్చాలి.
Labels:
మీకు తెలుసా