స్టార్‌నైట్
స్టార్‌నైట్ కలక్షన్ 5కోట్ల 28లక్షల47వేల101రూ.
తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేసిన స్టార్‌నైట్ కార్యక్రమం జనరంజకంగా ఆరంభమైంది. తెలుగు, తమిళ, కన్నడ నటీనటులు, దర్శకనిర్మాతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాంప్రదాయకమైన పంచెకట్టుతో నందమూరి అందగాడు బాలకృష్ణ హీరోలందరినీ వేదిక మీదకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన 5కోట్ల 28లక్షల47వేల101రూపాయలను వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసింది చిత్రసీమ. పలువురు ప్రభుత్వ అధికారులు, మంత్రులు ముందు వరుసలో ఆసీనులై కార్యక్రమాన్ని తిలకించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడి యంలో జరిగిన ఈ స్టార్‌నైట్ కార్యక్రమంలో పీఆర్పీ అధినేత చిరంజీవి, అగ్ర హీరోలు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్‌బాబు, కృష్ణంరాజు, రాజశేఖర్, రాజేంద్రప్ర సాద్, తమిళ హీరోలు రజనీకాంత్, సూర్య జూఎన్టీఆర్, అల్లు అర్జున్, కళ్యాణ్‌రామ్, సిద్దార్ధ, విష్ణువర్ధన్‌బాబు, మనోజ్, నితిన్, రామ్, నవదీప్, శ్రీకాంత్, సుమంత్, ప్రభుదేవా, శ్రీహరి తదితరులు పాలుపంచు కున్నారు.
కేంద్రమంత్రి దగ్గుబాటి పురందీశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర్రావు, రాష్టమ్రంత్రి గీతారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డి హాజర య్యారు.సీనియర్ నటీమణి జమున, రోజా, సుహాసిని, రమ్యకృష్ణ, ఎమ్మేల్యే జయసుధ, ఎం.పి జయప్రదలతోపాటు ఇలియానా, జెనీలియా, కాజల్, ప్రియమణి, హన్సిక తదితర హీరోయిన్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణలో తొలుత నుంచి క్రియాశీలక పాత్ర పోషించిన డాదాసరి నారాయణరావు స్టార్‌నైట్‌కు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించి తనదైన శైలిలో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. సుశీల గానంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకులు కోటి, కీరవాణి, మణిశర్మ, వందేమాతరం, మాధవపెద్ది సురేష్, శ్రీలేఖ, రమణ గోగుల, ఎస్.ఎ.రాజ్ కుమార్, చక్రి, మిక్కి జె.మేయర్, రఘుకుంచె, రాధాకృష్ణ, దేవిశ్రీప్రసాద్‌ల నేతృత్వంలో యస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మనో సునీత, శ్రీకృష్ణ వంటి గాయనీగాయకులు పలు సినిమా గీతాలు ఆలపించారు. అల్లు అర్జున్, సిద్ధార్ధ, జెనీలియా, జయసుధ, ప్రకాష్‌రాజ్, మమతామోహన్‌దాస్, బాలకృష్ణ, డా।। రాజశేఖర్... తదితరులు చేసిన నృత్యాలు అలరించాయి.
ప్రేక్షకులను అలరించిన కార్యక్రమాలు...
హీరో సిద్దార్ధా 'బొమ్మరిల్లు' 'అపుడో ఎపుడో' పాట పాడి అభినయించడమే కాకుండా ఆ సినిమాలో తనతో పాటు నటించిన జెనీలియా, ప్రకాష్‌రాజ్, జయసుధలను కూడా వేదికపైకి ఆహ్వానించి వారితో కూడా స్టెప్పులేయించారు.యంగ్‌టైగర్ ఎన్‌టీఆర్ ప్రదర్శించిన 'యమదొంగ' ఎపిసోడ్, 'లక్స్ పాపా' అంటూ బాలకృష్ణ చేసిన నృత్యం, మోహన్‌బాబు, జయసుధ, రోజా పాల్గొన్న హాస్పిటల్ ఎపిసోడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ముఖ్యంగా వేణుమాధవ్, సుమ తదితరులు ప్రదర్శించిన 'మ్యారేజ్ రిసెప్షన్' హాస్య నాటికకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
దాసరి తెర వెనక నుంచి వ్యాఖ్యానం అందించారు. రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ ఒకేచోట కూర్చోవటం అందరినీ అలరించింది.ఇక చిరంజీవి ఘరానా మొగడులోని బంగారు కోడిపెట్ట పాట ఎస్పీ ఆలపిస్తుంటే బలకృష్ణ దాన్ని హమ్ చేస్తూ కనిపించారు. ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ లోని పుణ్యభూమి నాదేశం పాటను వేదికపై బాలు పాడుతూంటే..ఎన్టీఆర్ ని అనుకరిస్తూ మోహన్ బాబు హావ భావాలు ప్రదర్సించారు.
డా।। బ్రహ్మానందం, సునీల్ "స్టార్ నైట్''లో చేసిన కామెడీ స్కిడ్ ప్రొగ్రామ్ మధ్యలో స్టార్ అయి చివరివరకూ ఈ కార్యక్రమం చుట్టూ తిరుగుతూనే వుంటుంది. ఇంతకి వీరు చేసిన ప్రొగ్రామ్ ఏమిటంటే... భీమవరం వెళ్ళడానికి బస్‌స్టాండ్ వద్దకు వస్తాడు సునీల్, అదే బస్‌స్టాండ్‌కి అత్తిలి వెళ్ళడానికి వస్తాడు బ్రహ్మానందం. ఇక్కడ వీరిద్దరి పరిచయం మొదలవుతుంది. మాటల మధ్యలో నేను లెక్కల్లో కింగ్‌ని అంటాడు బ్రహ్మానందం. ఇంకేముందు సునీల్ ఉరుకోటా... వెంటనే ఒక ఫజిల్ వేస్తాడు... ఒక షాప్‌కి ముగ్గురు వ్యక్తులు వస్తారు.. వారు మూడు కర్చీఫ్‌లు కొని 30రూపాయలు షాప్ ఓనర్‌కి ఇస్తారు. వెంటనే షాప్ ఓనర్ వెంటనే వారికి 5రూపాయలు తిరిగి ఇస్తాడు. ఆ ముగ్గురు వ్యక్తులు వెళ్ళుతూ వెళ్ళుతూ బయటవున్న ఒక వ్యక్తికి 2రూపాయలు ఇస్తారు. ఇప్పుడు ఒక్కొక్క కర్చీఫ్ విలువ ఎంతపడింది? అంటాడు. బ్రహ్మనందం సింపుల్ అంటూ ''మూడు కర్చీఫ్‌ల విలువ మూడుతొమ్ముదులు 27అంటూ వ్యక్తికి ఇచ్చిన రెండురూపాయలు కలిపితే 29 అవుతుంది'' అనగానే సునీల్ మిగతా 1రూపాయ్ ఎక్కడా? అంటాడు. ఇలా ఈ 1రూపాయ్ "స్టార్‌నైట్'' కార్యక్రమం చుట్టూ తిరుగుతూనే వుంటుంది.
"మల్లన్న'' చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఎక్స్ క్యూజ్ మీ మిస్టర్ మల్లన్న పాటను నటి సుహాసిని దేవీతో కలిసి ఆలపించారు. మధ్యలో శ్రియ వచ్చి డాన్స్ చేసారు. ఇక మమతామోహన్ దాస్ తో కలిసి ఆకలేస్తే అన్నం పెడతా, రాఖీ..రాఖీ పాటలను దేవీ డాన్స్ చేసారు. ఇంకా ఈ కార్యక్రమలో రాజశేఖర్, నవీన్, విష్ణు, నవదీప్, వరుణ్ సందేశ్, రోహిత్, నాని, తనీష్, రాజా, శ్రియ, వేదిక, నవనీత్ కౌర్, కామ్న జెఠ్మలానీ, కావేరి ఝా, సంగీత, పూనంకౌర్ , ప్రియమణి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో దాసరి నారాయణరావు మాట్లాడుతూ... ''ఇంత పెద్ద కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. మీ ఉన్నతికి, మా ఈ స్థాయికి కారకులైన ప్రజల ఋణం తీర్చుకోవడానికి మీ వెన్నంటే మేం ఉన్నామని ధైర్యం చెప్పడానికి "స్పందన'' కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన టివి9 మూడున్నర కోట్ల రూపాయలను ఇచ్చింది అది నిజంగా అభినందనీయం. అలాగే, విరాళాలిచ్చినవారికి, ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి సహకరించనవారికి కృతజ్ఞతలు'' తెలియజేశారు.
రజనీకాంత్ మాట్లాడుతూ.. నేను "రోబో'' షూటింగ్‌లో వుండగా దాసరిగారు ఫోన్‌చేసి స్టార్‌నైట్ ప్రోగ్రామ్ ఉంది.. అన్నారు.. వస్తావా? లేదా? అని కూడా అడగకుండా ఫోన్ పెట్టేశారాయన. నేను ఈ రోజు ఇంత బిజీగా వున్నాను అంటే దానికి కారణం ప్రేక్షకులే. అదే ప్రేక్షకులు కష్టాల్లో వున్నప్పుడు వారి కష్టాలను తీర్చడానికి జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నడం నా బాధ్యత అని భావించి వచ్చాను'' అన్నారు.
బాలకృష్ణ మాట్లాడుతూ... "ఈ కార్యక్రమం బాగా జరగడానికి ఎంతోమంది నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం ఉంది. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి రోశయ్యగారు ఈ నిధిని సరైన రీతిలో వినియోగించాలని కోరుకుంటున్నాను. అప్పుడే మేం పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది'' అన్నారు.
Labels:
సినిమా