రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

ప్రేమవివాహాలకు పెద్దదిక్కు


మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ ప్రేమవివాహం సికింద్రాబాద్‌లోని న్యూ బోయిన్‌పల్లిలోగల ఆర్యసమాజ్ మందిరంలో జరిగింది. టాలీవుడ్ హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ పెద్దల అంగీకారంతో తను ప్రేమించిన ప్రవాస భారతీయుడు ఉజ్వల్ కుమార్‌ను హైదరాబాద్‌, రాణీగంజ్‌లోని ఆర్యసమాజ్ మందిరంలో పరిణయమాడారు. బుల్లి తెర యాంకర్ జాహ్నవి సైతం మనసుకు నచ్చిన వాడిని ఆర్యసమాజ్ మందిరంలో మనువాడారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్యసమాజ్ మందిరంలో జరిగిన ప్రేమవివాహాల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. కుల, మత, జాతి వివక్షకు తావులేకుండా వివాహాలు జరిపించడం ద్వారా నిజమైన ప్రేమకు ఆర్య సమాజం పట్టం కడుతోంది. భారతీయ రాజ్యాంగాన్ని అనుసరించి వివాహ వయోపరిమితిని దాటిన యువతీ యువకులకు వివాహం జరిపిస్తోంది ఆర్య సమాజం. అదే సమయంలో తమ వయస్సును ధృవీకరించే తగు పత్రాలను చూపిన సందర్భంలో మాత్రమే ఇక్కడ వివాహాలు జరుగుతాయి.

ఆర్య సమాజంలో వివాహం జరిగే తీరు
ఆడంబరాలకు పోకుండా నిరాడంబరంగా వివాహం చేసుకోవాలనుకునే వారు ఆర్యసమాజాన్ని ఆశ్రయిస్తుంటారు. ఆర్యసమాజాన్ని స్వామీ దయానంద సరస్వతి స్థాపించిన సంగతి తెలిసిందే. సమాజం సిద్ధాంతాలను అనుసరించి కేవలం హిందువులకు మాత్రమే వేద మంత్రాల సాక్షిగా ఇక్కడ వివాహాలు జరుగుతుంటాయి. హిందూయేతరులు సైతం ఇక్కడ వివాహాలు చేసుకోవచ్చు.

కాకపోతే అందుకుగాను ఆర్యసమాజం నిర్వహించే 'శుద్ధి' కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వివాహాలు చేయిస్తారు. స్వతహాగా ఆర్యసమాజం విగ్రహారాధనను వ్యతిరేకిస్తుంది. తదనుగుణంగా వివాహ తంతులో పంచభూతాల సాక్షిగా అగ్నిగుండం ఎదుటు వధూవరులను కూర్చుండబెట్టి వివాహం జరిపిస్తారు. మొత్తం వివాహ కార్యక్రమం గంట సేపట్లోనే ముగిసిపోతుంది. దీంతో వివాహానికి పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు.