ఆవకాయ
ఆపదల నాదుకొను కూర ఆవకాయ
అతివ నడుమైన జాడిᄃెు ఆవకాయ
ఆంధ్రమాత సిందూరమ్మె ఆవకాయ
ఆంధ్రదేశమ్మె తానొక్క ఆవకాయ
ఎంత గొప్పగా చెప్పారండీ గరికిపాటివారు!
మామిడికాయ వూరగాయ ఎవరైనా పెట్టుకోగలరు. అదేం బ్రహ్మవిద్య కాదు. నాలుగు కాయలు కోసేసి ఉప్పూకారం కలిపితే చచ్చినట్టు పచ్చడైపోతుంది. ఆంధ్రులు తప్ప, ఎవరైనా ఆపనే చేస్తారు. కానీ తెలుగిళ్లలో ఆవకాయ పెట్టడమంటే ఏ సత్యనారాయణస్వామి వ్రతమో చేసినంత భక్తీశ్రద్ధా. చిన్నరసాలు పట్టుకోడానికి పెద్దప్రయత్నమే చేయాలి. చిన్నావాల కోసం సూపర్‌మార్కెట్లన్నీ గాలించాలి. ఆవపిండికి ఆర్డరివ్వాలి. ఎర్రటి ఎర్రకారం తెప్పించాలి. కల్తీలేని నువ్వుల నూనె ఎక్కడ దొరుకుతుందో అంజనమేసి గాలించాలి. అంతా అయ్యాక, జాగ్రత్తగా జాడీలకెత్తాలి. అందులోనూ స్పెషలైజేషన్. బెల్లమావకాయ, ముక్కావకాయ, పెసరావకాయ, సెనగావకాయ, పులిహోర ఆవకాయ, గుత్తావకాయ, తొణుకావకాయ, నీళ్లావకాయ.ఇవిచాలవన్నట్టు మాగాయ. తియ్యగా వడ్డిద్దామనుకునే తల్లులు తేనె ఆవకాయా పెడతారట!
అరవై అయిదో కళ...ఆవకాయ పెట్టడం. అది ఆంధ్రుల సొత్తు. కాబట్టే, చెన్నై అయ్యరుగారైనా బెంగుళూరు కులకర్ణిగారైనా...పొరుగింటి తెలుగుపిల్ల చిట్టిగిన్నె పట్టుకొచ్చి ‘ఆయ్... ఆవకాయ పెట్టామండీ! కాస్త రుచిచూసి పెట్టండి' అనడక్కపోతుందా అని ఎదురుచూస్తుంటారు. అయినా జిహ్వచాపల్యం తీరకపోతే ‘ఆవకాయ పెట్టడమెలా?' అన్న విషయం మీద స్పెషల్ క్లాసులు పెట్టించుకుని తమిళంలోనో కన్నడంలోనో నోట్సు రాసుకుంటారు.
Labels:
సంగతులు