రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

కార్తీక పురాణం - 2


2వ అధ్యాయం
జనకా! ఇంతవరకు నీకు కార్తీక మాసమందాచరించివలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసితిని. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యం గలదు. కాన, సోమ వార వ్రత విధానమును, దాని మహిమను గురించి వివరింతును. సావధానుడవై ఆలకించుము.

కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడు గాని, ఏ జాతి వారైనా గాని, రోజంతయు ఉపవాసముండి, నదీ స్నానము చేసి, తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్టతో శివ దేవునకు బిల్వ పత్రాలతో పూజాభిషేకము చేసి, సాయంకాలము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజింపవలయును. ఈ విధముగా నిష్టతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణపఠన మొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి, తిలదానము చేసి, తమ శక్తి కొలదీ పేదలకు అన్నదానమును చేయవలయును.

అటుల చేయలేనివారలు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తౄప్తిగా భోజనము పెట్టి, తాము భుజించవలయును. ఉండగలిగిన వారు సోమవారము నాడు రెండు పూటలా భోజనము గాని, ఏ విధమైన ఫలహారము గాని తీసుకొనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాసప్రాప్తి కలిగించి, శివసన్నిధికి చేర్చును.

భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి. శివపూజ చేసినచో కైలాసప్రాప్తియు, విష్ణుపూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణముగా ఒక యితిహాసము కలదు. దానిని నీకు తెలియపరచెదను. శ్రద్ధగా వినుము.

కార్తీక సోమవార ఫలముచే కుక్కకైలాసమందుట పుర్వ కాలమున కార్తీక దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ వుండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు 'స్వాతంత్ర్య నిష్ఠురీ. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయను సద్బ్రాహ్మణ యువకునకిచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు, శాస్త్రములను అభ్యసించినవాడైనందున సదాచారపరాయణుడై యుండెను. అతడు భూతదయ గల్గినవాడు. నిత్య సత్యవాది. నిరంతరము భగవన్నామస్మరణ చేయువాడును అగుటచే లోకులెల్లరు అతనిని 'అపర బ్రహ్మా అని కూడా చెప్పుకొనుచుండెడి వారు.

ఇటువంటి ఉత్తమ పురుషునకు భార్యయగు నిష్టురి, యవ్వన గర్వముతో, కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచూ అత్తమామలను, భర్తను తిట్టుచు, గొట్టుచు, రక్కుచు, పరపురుష సాంగత్యము గలదై, వ్యభిచారిణియై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు, పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టిరి.

కానీ, శాంతస్వరూపుడగు ఆమె భర్తకు మాత్రం ఆమెయందభిమానము పోక, ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి, ఛీ పోమ్మనక, విడువక, ఆమె తోడనే కాపురము చేయుచుండెను. కాని, చుట్టుప్రక్కల వారా నిష్టూరి గయ్యాళి తనమునకేవగించుకొని ఆమెకు 'కర్కశా అనే యెగతాళి పేరును పెట్టుటచే అది మొదలు అందరూ దానిని కర్కశ అనే పిలుస్తుండే వారు.

ఇట్లు కొంతకాలము జరిగిన పిదప ఆ కర్కశ, ఒక నాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో వున్న సమయము చూసి, మెల్లగా లేచి, తాళి గట్టిన భర్త యన్న విచక్షణ గాని, దయాదాక్షిణ్యాలు గాని లేక, ఒక బండరాతిని తెచ్చి, అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయెను. ఆ మౄతదేహమును ఎవరి సహాయమును అక్కరలేకనే, అతి రహస్యంగా దొడ్డి దారిన గొనిపోయి వూరి చివరనున్న పాడునూతిలో బడవైచి పైన చెత్తచెదారముతో నింపి, యేమియు యెరగని దానివలె ఇంటికి వచ్చెను.

ఇక తనకు ఏ ఆటంకాలు లేవని యిక విచ్చలవిడిగా సంచరించుచు, తన సౌందర్యమును చూపి యెందరినో క్రీగంటనే వశపరచుకొని, వారల వ్రతమును పాడుచేసి నానా జాతి పురుషులతోడను రమించుచు వర్ణసంకరురాలయ్యెను. అంతియే గాక పడుచుకన్యలను, భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను, తన మాటలతో చేరదీసి, వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడుచేసి, విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను.

జనకరాజా! యవ్వన బింకము యెంతోకాలముండదు గదా! కాలమొక్క రీతిగా నడువదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహ వ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణములనుండి చీము, రక్తము రసి కారుట ప్రారంభమయ్యెను. దానికి తోడు శరీరమంతా కుష్టువ్యాధి బయలు దేరి దుర్గంధము వెలువడుచున్నది. దినదినము శరీర పటుత్వము కౄశించి కురూపి అయ్యి భయంకర రోగములతో బాధపడుచున్నది.

ఆమె యవ్వనములో ఉండగా యెన్నో విధాల తౄప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగిచూడరైరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన తమలెటులైనను పలకరించునని, ఆ వీధి మొగమైనను చూడకుండిరి. కర్కశ ఇటుల నరక బాధలను అనుభవించుచూ, పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది.

బ్రతికినన్నాళ్ళు ఒక్క నాడైనా పురాణ శ్రవణమైననూ చేయని పాపిష్ఠురాలు కదా! చనిపోయిన వెంటనే భయంకరులైన యమ భటులు ఆమెను గొనిపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో నుంచగా, యమధర్మ రాజు, చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి 'భటులారా! ఈమె పాప చరిత్ర ఇంతింత కాదు. వెంటనే ఈమెను తీసుకెళ్ళి యెర్రగా కాల్చిన యినుపస్తంభమునకు కట్టిపెట్టుడూ అని ఆజ్ణ్జాపించెను.

విటులతో సుఖించినందులకు గాను యమ భటులామెను యెర్రగా కల్చిన యినుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకుగాను యినుప గదలతో కొట్టిరి. ప్రతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసల కాగు నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు, అత్త మామలకు అపకీర్తి తెచ్చినందులకు సీసము కరిగించి నోటిలోనూ, చెవుల్లోనూ పోసి, ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమను నరకములో వేయగా, అందు యినుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జెఋఋఎలు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు ఏడుతరాల వాళ్ళు, అటు ఏడుతరాలవాళ్ళు నరక బాధలు పడుచుండిరి.

ఈ ప్రకారముగా నరకబాధలు అనుభవించి, కడకు కళింగదేశమున కుక్క జన్మమెత్తి, ఆకలి బాధ పడలేక తిరుగుచుండగా, కర్రలతో కొట్టువారు కొట్టుచూ, తిట్టువారు తిట్టుచూ, తరుము వారు తరుముచూ వుండిరి. ఇట్లుండగా ఒకానొకనాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి, సాయంత్రమున నక్ష్త్ర దర్శనము చేసి, బలియన్నము నరుగుపై పెట్టి, కాళ్ళు, చేతులు కడుగుకొనుటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను.

ఆ రోజు కార్తీక మాస సోమవారమగుటవలనను, కుక్క ఆరోజంతయు ఉపవాసముతో ఉండుటవలననూ, శివపూజా పవిత్రస్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుటవలననూ, ఆ శునకమునకు, జన్మాంతర జ్ణ్జానముద్భవించెను. వెంటనే ఆ శునకము 'విప్రకులోత్తమా! నన్ను కాపాడుమూ అని మొరపెట్టుకొనెను. ఆ మాటలను బ్రాహ్మణుడాలకించి బైటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగెను. మరల 'రక్షింపుము రక్షింపుమూ అని కేకలు వినబడెను. మరల విప్రుడు బైటకు వచ్చి, 'ఎవరు నీవు? ణి వౄత్తాంతమేమి?' అని ప్రశ్నించెను.

అంతనా కుక్క 'మహానుభావ! ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలకు ముందు విప్రకులాంగనను నేను. వ్యభిచారిణినై అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి, వౄద్ధాప్యములో కుష్టురోగినై తనువు చాలించిన తరువాత, యమదూతల వల్ల మహానరకమును అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతము జేసి యిచ్చట వుంచిన బలి అన్నమును తినుటవలన నాకీ జ్ణ్జానోదయము కలిగినది. కావున 'ఓ విప్రోత్తమా! నాకు మహోపకారముగా, మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొకటి యిచ్చి నాకు మోక్షము కలిగించుమని ప్రార్ధించుచున్నానూ అని వేడుకొనెను.

కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి, ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారమునాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికీ వందనము జేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానమెక్కి శివసాన్నిధ్యమునకేగెను.

వింటివా జనక మహారాజా! కావున, నీవును ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి, శివసాన్నిధ్యమును పొందు మని వశిష్టులవారు హితబోధ చేసి, ఇంకనూ యిట్లు చెప్పదొడంగిరి.<ప్ అలిగ్న్=చెంతెర్>

ద్వితీయాధ్యాయం రెండవ రోజు పారాయణము సమాప్తము.