ఆంధ్రుల అమృతాంజనం
ఒకప్పుడు ‘ముక్కోటి ఆంధ్రుల'మని కాలరెగరేసి చెప్పుకునేవాళ్లం. ఆ మాటల్లో ‘మేం ముక్కోటి దేవుళ్లకు సరిసమానమండోయ్!' అన్న అతిశయమూ వినిపించేది. అయినా ఆ దేవుళ్లు, తెలుగువాళ్లకంటే ఎందులో గొప్ప! ఇన్నేళ్లలో దేవతల జనాభా పెరిగిన దాఖలాల్లేవు. మరి మనమో, పదికోట్లు దాటిపోయాం. వాళ్లు అమృతం సృష్టిస్తే, మనం అంతకంటే రెండక్షరాలు ఎక్కువున్న అమృతాంజనం సృష్టించాం. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి హృదయసాగర మథనంలోంచి పుట్టిందా దివ్యాంజనం. దేవుళ్లు తమ్ముళ్లను నొప్పించి అమృతం లాగేసుకుంటే, మనం తోటివాళ్ల నొప్పులు తగ్గించడానికి అమృతాంజనాన్ని దేశమంతా విస్తరించాం. ఇప్పుడది ఖండాంతరాలకు పాకిపోయింది. యూరప్ దాకా వెళ్లింది. అమెరికాలోనూ దొరుకుతోంది. మధ్యప్రాచ్యంలో బోలెడంత గిరాకీ ఉందట.
అటూఇటుగా అమెరికాలో ‘విక్స్ వెపొరబ్' పుట్టినప్పుడే ఆంధ్రదేశంలో అమృతాంజనం పుట్టింది. 1893లో ప్రాంతంలో పంతులుగారు బొంబాయి కేంద్రంగా వ్యాపారం ప్రారంభించారు. కొద్దిరోజుల్లోనే ఉత్తరదక్షిణాలన్న తేడాలేనంతగా గిరాకీ పెరిగింది. నాగేశ్వరరావు పంతులుగారు అమృతాంజనం వ్యాపారంలో లక్షలు గడించారు. కానీ నయాపైసా దాచుకోలేదు. ఉన్నదంతా దేశం కోసమే ఖర్చుచేశారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించిన ‘ఆంధ్రపత్రిక' ఆ డబ్బుతోనే నడిచింది. తొలిరోజుల్లో బ్రిటిష్
వ్యతిరేక సభల్లో, హర్తాళ్లలో అమృతాంజనం సీసాలు ఉచితంగా పంచేవారట. అలా...తలనొప్పినే కాదు, తెల్లవాళ్లనూ తరిమేసింది తెలుగువారి అమృతాంజనం.
Labels:
సంగతులు