రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

తపస్సు చేసిందిక్కడే


ప్రకృతి రమణీయ దృశ్యాలు, భక్తి పారవశ్య ప్రదేశాలు, ఎటుచూసినా అభయారణ్యాలు... కొండలమీద నుంచి జాలువారే జలపాతాలు.. విజ్ఞానం, వినోదం.... ఇవన్నీ వింటుంటే ఏదో దేశంలోనే, రాష్ట్రంలోనో అని అనుకున్నట్లయితే మీరు పప్పులో కాలేసినట్లే..! ఎందుకంటే, ఇవన్నీ ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల ప్రాంతంలోనే ఉన్నాయి కాబట్టి. అందమైన సుందర దృశ్యాలనే కాదు.. తన చెట్ల పొదల మాటున తుపాకీ పట్టుకున్న మావోయిస్టులను, లోకం పోకడ తెలియని అమాయక చెంచు ప్రజలను కూడా దాచుకున్నదీ కీకారణ్యమే...!

నల్లమల తూర్పు కనుమలలో ఒక భాగం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, మహబూబ్ నగర్, గుంటూరు, ప్రకాశం, మరియు కడప జిల్లా జిల్లాలలో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇవి కృష్ణానది మరియు పెన్నానదులకు మధ్యన ఉత్తర-దక్షిణ దిశగా దాదాపు 150 కి.మీ. వరకు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాన్నే "నల్లమల అడవులు"గా వ్యవహరిస్తారు.

నల్లమలలో దర్శనీయ స్థలాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది "ఉమామహేశ్వరం". క్రీస్తు శకం 1232లో కాకతీయులు నిర్మించిన ఈ దేవాలయం హైదరాబాద్ నగరానికి 66 కిలోమీటర్ దూరంలోనూ, మహబూబ్ నగర్‌కు 91, అచ్చంపేటకు 14 కిలోమీటర్ల దూరంలోనూ నెలవై ఉంది. శ్రీశైలం ఉత్తర ముఖ ద్వారంగా, రెండవ శ్రీశైలంగా భాసిల్లుతోన్న ఈ క్షేత్రంలో పూర్వం పార్వతిదేవి శివుడి కోసం తపస్సు చేసిందట.

అలాగే చాలామంది మహర్షులు అనేక వందల సంవత్సరాలపాటు శివుడి కోసం తపస్సు చేసిన ప్రాంతమే ఉమామహేశ్వరమని స్కంద పురాణాల ద్వారా కూడా తెలుస్తోంది. ఇక్కడి కొండపై వెలసిన పిల్లల మామిడి చెట్టు కిందన శివుడు కొలువై ఉన్నాడు. శివుడి కొప్పులో అర్ధచంద్రాకాంర ఉన్నట్లుగా.. కొండ మొత్తం కూడా అర్థ చంద్రాకారంలో ఉంటుంది. దీని పక్కనే ఉన్న పాపనాశిని నుంచి నిరంతరం ఐదు ధారలుగా ఒకేచోట ఏర్పడి నీరు ప్రవహిస్తూ ఉంటుంది.

కొండ కింది ప్రాంతాన్ని "భోగ మహేశ్వరం" అని అంటారు. అమ్మవారికి, స్వామివారికి ఐదు గుడులలో ఐదు లింగాలు ఉంటాయి. పంచలింగాలు, జంట లింగాల దేవాలయాలు కూడా ఉన్నాయి. ప్రతి మకర సంక్రాంతికి ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. పరమపవిత్రమైన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే 600 మెట్లు ఎక్కాల్సిందే...!

నల్లమలలో మరో పర్యాటక ప్రాంతం... "మద్దిమడుగు". ఇక్కడ భక్తులు పిలిస్తే పలికే దైవంగా "మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి" భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. నల్లమల లోతట్టు, అటవీ ప్రాంతంలో స్వామివారు స్వయంగా వెలసినట్లు ప్రతీతి. చైత్ర శుద్ధ పౌర్ణమి, కార్తీక మాసాలలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.

ఈ సందర్భంగా హనుమద్గాయత్రి యజ్ఞం చేస్తారు. శని, మంగళవారాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. బెల్లం, గోధుమ రొట్టెలతో చేసిన ప్రత్యేక ప్రసాదాన్ని భక్తులు స్వామివారికి నైవేధ్యంగా సమర్పిస్తుంటారు. ఈ ప్రాంతం హైదరాబాదుకు 186, మహబూబ్‌నగర్‌కు 147, అచ్చంపేటకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.