రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

ట్వింకిల్‌ ట్వింకిల్‌ లిటిల్‌ స్టార్‌



ఆంగ్లచిత్రంలో అన్నాచెల్లెళ్లు ఓ అన్న, ఓ చెల్లి.. ఇద్దరూ బాల నటులే.. ఇప్పుడు వీళ్లిద్దరూ.. ఓ ఇంగ్లిషు సినిమాలో నటిస్తున్నారు! ఇంతకీ వీరెవరో తెలుసా? దర్శకుడు పూరీజగన్నాథ్ పిల్లలు..
మాస్టర్‌ ఆకాశ్‌, బేబీ పవిత్ర తెలుసా అంటే గబుక్కున గుర్తు రాకపోవచ్చు. కానీ ‘బుజ్జిగాడు'లో హీరో ప్రభాస్‌, హీరోయిన్‌ త్రిషల చిన్ననాటి పాత్రల్లో నటించిన వారంటే చటుక్కున తెలిసిపోతుంది. ఈ అన్నాచెల్లెళ్లు ఇప్పుడు ‘లోటస్‌ పాండ్‌' అనే ఇంగ్లిషు సినిమాలో నటిస్తున్నారు. ఇదొక బాలల సినిమా అన్నమాట. ఇందులో హీరో ఆకాశే. ఇక పవిత్ర కూడా ఓ స్కూలు అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ కులూలో మంచు కొండల మధ్య జరుగుతోంది. దీని కథ భలేగా ఉంటుంది. స్కూలు టీచర్‌ ఓసారి ఓ తామర కొలను గురించి చెబితే దాన్ని వెతుక్కుంటూ పిల్లలు బయల్దేరుతారన్నమాట. మంచు కొండలపై 14 వేల అడుగుల ఎత్తున ఉన్న అక్కడికి వెళ్లడంలో వారెలాంటి సాహసాలు చేశారనేదే కథ. దీనికి పీజీ విందా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ఇతర దేశాల్లో కూడా విడుదల చేస్తార్ట. మన తెలుగులో కూడా వస్తుంది.
ఆరో తరగతి చదువుతున్న ఆకాశ్‌ ఇంతవరకూ మూడు సినిమాల్లో నటించాడు. ఆ మూడూ కూడా వాళ్ల నాన్న పూరీ తీసినవే. ‘చిరుత'లో హీరో రామ్‌చరణ్‌తేజ చిన్నప్పటి పాత్రలో కనిపించేది ఇతడే. అలాగే ‘ఏక్‌నిరంజన్‌'లో హీరోయిన్‌ పక్కన ఉండే పిల్లల్లో ఒకడిగా పెద్ద పెద్ద డైలాగులు చెబుతూ కనిపిస్తాడు. అన్నట్టు.. పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే ‘హీరో' అంటున్నాడు తడుముకోకుండా. దర్శకుడు విజయేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో రాబోయే మరో సినిమాలో కూడా నటించబోతున్నాడు. ఇక ఈతకొట్టడం, ఫుట్‌బాల్‌, క్రికెట్‌ ఆడటం ఆకాశ్‌కి భలే ఇష్టం.

ఆకాశ్‌ చెల్లెలు పవిత్ర 5వ తరగతి చదువుతోంది. ‘బుజ్జిగాడు'లో నటించేప్పుడు కాళ్ళు వణికిపోయాయిట. తర్వాత ధైర్యంగా చేసేసింది. పెద్దయ్యాక నటివవుతావా అని అడిగితే కానంటుంది ఈ పాప. బాగా చదువుకుని డాక్టర్‌ అవుతుందిట. పవిత్ర కూచిపూడి నేర్చుకుంటోంది. స్కూల్లో ప్రదర్శనలు కూడా ఇచ్చింది.