ఆనంద నిలయం- అనంత స్వర్ణమయం
తిరుమలేశుని ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు తితిదే ఛైర్మన్ ఆదికేశవుల నాయుడు ఆధ్వర్యంలో ‘ఆనంద నిలయం- అనంత స్వర్ణమయం' పేరుతో భారీ పథకం చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రధానాలయాన్ని బంగారంతో తాపడం చేయాలన్నది ఈ పథకం ఉద్దేశం. ఇందుకుగాను మొత్తం 200 కిలోల బంగారం అవసరం అవుతుందని అంచనా వేశారు. గత సంవత్సరం అక్టోబరు 1న అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకూ 100 కిలోల బంగారాన్ని సేకరించారు. ఆలయానికి అమర్చేందుకు గాను ముందు రాగి రేకులను సిద్ధం చేసి వాటిని బంగారంతో తాపడం చేసే పని దాదాపు పూర్తి కావచ్చింది. వీటిని ఆలయానికి అమర్చాల్సి ఉంటుంది. ఈ భారీ ప్రాజెక్టులో అక్రమాలు కూడా భారీగానే జరిగాయని అందిన ఫిర్యాదుల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రంగంలోకి దిగింది. పథకానికి అవసరమైన బంగారం అంతా దాతల నుంచే స్వీకరిస్తున్నారు. తితిదే విజ్ఞప్తి చేసిందే మొదలు దాతలు భారీగా విరాళాలు ఇవ్వడం మొదలుపెట్టారు. సామాన్య భక్తుల నుంచి పారిశ్రామిక వేత్తల వరకూ తమకు చేతనైనంత సాయం చేస్తున్నారు.