రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

లాఫర్స్ క్లబ్

'రాత్రింబవళ్ళు వేధించే ఒత్తిళ్ళ మధ్య రోజూ కాసేపైనా నవ్వలేకపోతే నేను ఎప్పుడో మరణించి ఉండేవాణ్ణి ' అన్నారు అబ్రహాం లింకన్. ఇది సత్యం. ఈ సత్యాన్ని వంటపట్టించుకున్న మనిషి డాక్టర్ మదన్ కటారియా. తానే కాదు తన నగర ప్రజలకు... కాదు.. రాష్ట్ర ప్రజలకు... కాదు.. కాదు.. ఈ దేశ ప్రజలకు... ఊహు! కాదు... కాదు... ప్రపంచానికే నవ్వుల టానిక్ ని పంచాడీ డాక్టర్. 1995 మార్చి 13 న తెల్లవారు ఝామునే లేచిన ఆయనకు ఎందుకో నవ్వు వచ్చింది. దాని గురించి ఆలోచిస్తుండగా ఆయనకు అమెరికాకు చెందిన నార్మన్ కజిన్స్ అనే ఆయన రాసిన 'అనాటమీ ఆఫ్ ఏన్ ఇల్ నెస్' అనే పుస్తకం గుర్తుకొచ్చింది. అందులో తన వెన్నుముకకు వచ్చిన వ్యాధి నవ్వుతో ఎలా నయమయిందో కజిన్స్ వివరంగా రాశాడు. కాలిఫోర్నియా లిండా యూనివర్శిటీకి చెందిన డాక్టర్ లీ.ఎస్.బెర్క్ శరీరానికి వత్తిడికి కలిగించే హార్మోన్లను కట్టడిచేసి వ్యాధి నిరోధకశక్తిని పెరగడానికి నవ్వు సరైన మందుగా తన పరిశోధనలలో వెల్లడయిందని పేర్కొంటూ ఒక పరిశోధన గ్రంథం రాశాడు.

ఈ విషయాలన్నీ తన 'మేరా డాక్టర్' అన్న పత్రికలో రాస్తే పాఠకులు నవ్వు గొప్పదనాన్ని తెలుసుకుంటారనిపించింది డాక్టర్ మదన్ కి. కానీ ఆ వెంటనే తన పత్ర్రిక ఎంతమంది చదువుతారు? చదివినా తన వ్యాసం ఎవరు చదువుతారు? చదివినా ఎంతమంది దీన్ని ఆచరణలో పెడతారని... ఇలా చాలా సందేహాలొచ్చాయి. అలా ఆలోచిస్తూనే ఆయన రోజూ వెళ్ళే ఉదయపు వ్యాహ్యాళికి అదేనండి! మార్నింగ్ వాక్ కి బయిలుదేరాడు. అలవాటుగా వెళ్ళే లోఖండ్ వాలా కాంప్లెక్స్ లోని పబ్లిక్ గార్డెన్స్ కి వెళ్ళాడు. అక్కడ ఇంకా ఆయన లాంటి వాళ్ళు చాలామంది చేరారు. వాళ్ళందరినీ పిలిచి తనకొచ్చిన ఆలోచనలన్నీ వివరంగా చెప్పి రోజూ కొంతసేపైనా తనివి తీరా హాయిగా నవ్వుకుంటే ఆరోగ్యం దివ్యంగా ఉంటుందని మందులతో పని ఉండదని చెప్పాడు. ఇదంతా నవ్వులాటగా తీసుకున్న కొందరు వెళ్ళిపోగా, చెప్పేది డాక్టర్ కదా ఇదేమిటో చూద్దాం అని కొంతమందే మిగిలారు.

వాళ్ళకు మదన్ ఒక జోక్ చెప్పాడు. అందరూ హాయిగా వవ్వారు. ఒకటి తర్వాత మరొకటిగా జోకులు పేల్చాడు. అందరికీ నవ్వనే ఔషధం పంచి, ఇక ఇంటికెళ్ళండి. ఈ రోజంతా మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని పిస్క్రిప్షన్ రాసిచ్చినంత ధీమాగా హామీ ఇచ్చేశాడు. అందులోని నిజాన్ని అనుభవించిన వాళ్ళందరూ మర్నాటి నుంచి తాము కూడా జోకులు చెప్పి అందర్నీ నవ్వించడమే పనిగా పెట్టుకున్నారు. ఆరోగ్య ఫలితాలు అనుభవించారు.

అలా ముంబయిలోని అంధేరీ ప్రాంతంలో 1995 మార్చి 13 న లాఫర్స్ క్లబ్ ఏర్పడింది. తరవాత్తరవాత కేవలం జోకులే కాకుండా నవ్వును ఒక యోగ ప్రక్రియలా సాధన చెయ్యడం ప్రారంభించారు. నెమ్మదిగా ఈ క్లబ్ కి ముంబయి నగరమంతా, రాష్ట్రమంతా, దేశమంతా శాఖలు ఏర్పడ్డాయి. మానసిక, శారీరిక రుగ్మతలకు దివ్యౌషధమైన నవ్వు విశిష్టతను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఈ లాఫర్స్ క్లబ్ సభ్యులు. మనం కూడా హాయిగా, మనసారా నవ్వుకుందాం! రోగాలను దూరం చేద్దాం!

క్యాప్సికమ్ పకోడి


కావలసిన పదార్థాలు :

క్యాప్సికమ్ : రెండు

ఉల్లిపాయలు : రెండు

కొత్తిమీర : చిన్న కట్ట

అల్లం వెల్లులి ఫేస్ట్ : పావు స్పూన్

శనగపిండి : ఒక కప్పు

బియ్యపు పిండి : అర కప్పు

తినే సోడా : పావు స్పూన్

ఉప్పు : రుచికి సరిపడా

కారం : టీ స్పూన్

నూనె : పావు కిలో

తయారు చేయువిధానం : క్యాప్సికమ్, ఉల్లిపాయలు, కొత్తిమీర ను కట్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత శనగపిండి, బియ్యపిండిలో కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయ, కొత్తిమీరను జత చేస్తూ, అల్లం, వెల్లుల్లి, సోడాఉప్పు, ఉప్పు, కారం వేసి పకోడి పిండిలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి నూనె కాగిన తర్వాత పకోడి వేసి వేయించుకొని తింటే క్యాప్సికమ్ పకోడి చాలా రుచిగా ఉంటుంది.

అమావాస్య రోజున హనుమంతుడు


ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున హనుమంతునిని ప్రార్థిస్తే.. సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడిని సింధూరంతో అర్చించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి.


ముఖ్యంగా హనుమంతుని జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు వైభవంగా జరుపుకుంటారు. శ్రీరామనవమితో పాటు కొందరు హనుమంత జయంతిని జరుపుకుంటారు.


ఈ పండుగను జరుపుకోలేని వారు ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున నిష్టతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం.


అందుచేత అమావాస్య సాయంత్రం పూట మహిళలు, పురుషులు ఆంజనేయ స్వామికి నేతితో దీపమెలిగించి.. హనుమంతుడి ఆలయాన్ని 18 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా మనోధైర్యం, సకలసంపదలు, ఉన్నత పదవులు లభిస్తాయని పండితులు అంటున్నారు.


ఇంకా...

"అసాధ్య సాధక స్వామిన్

అసాధ్యమ్ తవకిన్ వధ

రామదూత కృపా సింథో

మత్‌కార్యమ్ సాధయ ప్రభో"- అనే మంత్రాన్ని 9 సార్లు పఠించి.. కర్పూర హారతులు సమర్పించుకున్న వారికి ఈతిబాధలు, గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు

ప్రేమకు కారణాలు ఉండవు


బుజ్జి ....నాలో ఏం చూసి ప్రేమించావు నువ్వు?' గోముగా అడిగింది భారతి.


‘బుజ్జి....' అనేది మాటవరసకు పెట్టిన పేరేగానీ... ఆ స్థానంలో ఉండే ప్రతి ప్రేమికుడికీ ఏదో ఒక దశలో ఎదురయ్యే ప్రశ్నే ఇది. ప్రేమని మాటల్లో వర్ణించడమే కష్టం అనుకుంటే ‘నన్నెందుకు ప్రేమించావు' అని అవతలి వ్యక్తి అడిగితే ఠక్కున సమాధానం చెప్పడం మరీ కష్టం.

కృష్ణశాస్త్రి అంతటివాడే...

సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?

చంద్రికలనేల వెదజల్లు చందమామ?

ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?

ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?

...అంటూ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక చేతులెత్తేశాడు. ఇక, మామూలు మనుషుల సంగతి చెప్పేదేముంది. ప్రేమ ఎప్పుడు ఎవరిమీద ఎందుకు కలుగుతుందో ఎవరూ చెప్పలేరు. అందం, తెలివి, డబ్బు, కులం, హోదా... వేటితోనూ దానికి పని ఉండదు. మనసైన మనిషి కనపడగానే హృదయస్పందన పెరుగుతుంది. ఎదలోతుల్లో ఏదో తీయని భావం అలజడి రేపుతుంది. ఒకరికొకరు సన్నిహితంగా ఉండాలనే తహతహ పెరుగుతుంది. ప్రియురాలిని/ప్రియుడిని విడిచిపెట్టి వెళ్లాలంటే ప్రాణంపోయినంత బాధ కలుగుతుంది.

ఎందుకిలా అవుతుందంటే... ‘అప్పుడు శరీరంలో అనేక రసాయనమార్పులు జరుగుతాయి. అడ్రినలిన్‌, ఆక్సిటోసిన్‌ హార్మోన్లు స్రవిస్తాయి...' అంటూ సైంటిస్టులు రకరకాల కబుర్లు చెప్పొచ్చుగాక! కానీ అవన్నీ ప్రత్యేకంగా ఒకరిని చూసినప్పుడు మాత్రమే ఎందుకు కలుగుతాయి, అందరికీ సాధారణంగా కనిపించే వ్యక్తి ఒకరికి మాత్రమే అంత ప్రత్యేకంగా ఎందుకు కన్పిస్తారూ... అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం ఉండదు. ప్రేమికులు మాత్రం ఇట్టే చెప్పేస్తారు... ‘ప్రేమకు కారణాలు ఉండవు' అని!