రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

కార్తీక పురాణం - 9



9వ అధ్యాయం

విష్ణుదూతల, యమభటుల వివాదము

ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలం. వైకుంఠమునుండి వచ్చాము. మీ ప్రభువు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మన్నారో తెలిపమని ప్రశ్నించిరి.

దానికి బదులుగా యమదూతలు 'విష్ణుదూతలారా! మానవులు చేయు పాపపుణ్యాలను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనుంజయాది వాయువులు, రాత్రీ పగలూ, సంధ్యాకాలము సాక్షులుగా ప్రతిదినం మా ప్రభువు వద్దకు వచ్చి తెలుపుతారు. మా ప్రభువు వారి కార్యకలాపాలను చిత్రగుప్తునిచే తెలుసుకుని ఆ మానవుని చివరిదశలో మమ్ము పంపించి వారిని రప్పించెదరు. పాలులెటువంటివారో వినండి... వేదోక్త సదాచారములను వీడి, వేదశాస్త్రములను నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపాలను చేసినవారునూ, పరస్త్రీలను కామించినవారు, పరాన్నభుక్కులు, తల్లితండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని చీదరించుకునేవారు, జీవహింస చేయువారు, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను బాధించువారు, శిశుహత్య చేయువారు, శరణన్నవారిని సైతం బాధించేవారు, చేసిన మేలును మరచిపోయేవాడు, పెండిండ్లు, శుభకార్యాలు జరగనివ్వక అడ్డుతగిలే వారూ పాపాత్ములు. వారు మరణించగానే తన వద్దకు తీసుకువచ్చి దండించమని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. '

కాబట్టి అజామిళుడు బ్రాహ్మణుడై పుట్టి చెడు సావాసాలకు లోనై, కులభ్రష్టుడై జీవహింసలు చేస్తూ, కామాంధుడై వావి వరసలు లేని పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎలా తీసుకుపోదురు? అంటూ యమభటులు ప్రశ్నించిరి.

అంతట విష్ణుదూతలు 'ఓ యమకింకరులారా! మీరు ఎంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మాలు తెలియవు. ధర్మ సూక్ష్మాలు ఎటువంటివో చెప్తాను వినండి. మంచివారితో స్నేహము చేయువారు, తులసి మొక్కలను పెంచువారు, బావులు, చెరువులు త్రవ్వించువారు, శివ కేశవులను పూజించేవారు, సదా హరినామాన్ని కీర్తించువారు, మరణ కాలమందు 'నారాయణా' అని శ్రీహరిని గాని, 'శివ శివా' అని పరమేశ్వరుణ్ని గానీ తలచినచో తెలిసిగాని, తెలియకగాని మరే రూపమునగాని శ్రీహరి నామ స్మరణ చెవినబడిన వారు పుణ్యాత్ములు! కాబట్టి అజామిళుడు ఎంత పాపాత్ముడైనా మరణకాలమున 'నారాయణా' అని పలుకుచూ చనిపోయెను. కాబట్టి మేము వైకుంఠానికే తీసుకుని వెళ్తామని పలికెను.

అజామిళుడు విష్ణు, యమదూతల సంభాషణలు విని ఆశ్చర్యం పొంది 'ఓ విష్ణుదూతలారా! పుట్టిన నాటి నుండి చనిపోయేవరకూ నేను శ్రీమన్నారాయణుని పూజగాని, వ్రతములు గాని, ధర్మములు గానీ చేయలేదు. నవమాసములు మోసి కనిపెంచిన తల్లితండ్రులకు కూడా నమస్కారం చేయలేదు. వర్ణాశ్రమాలు విడిచి కులభ్రష్టుడనై, నీచకుల స్త్రీలతో సంసారము చేసి... నా కుమారునిపై ఉన్న ప్రేమతో 'నారాయణా' అని అన్నంత మాత్రమున నన్ను ఘోర నరక బాధలనుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోతున్నారు. ఆహా నేనెంతటి అదృష్టవంతుడ్ని. నా పూర్వ జన్మ సృకృతము. నా తల్లి తండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అంటూ సంతోషముగా విమానెక్కి వైకుంఠమునకు' వెళ్ళెను.

కాబట్టి ఓ జనక చక్రవర్తీ! తెలిసిగానీ, తెలియకగానీ నిప్పును తాకితే బొబ్బలెక్కి ఎంత బాధ కలిగించునో, అటులనే శ్రీహరిని తెలిసీ తెలియకో స్మరించినంతనే సకల పాపాలనుండి విముక్తి పొందుటయే కాక మోక్షాన్ని కూడా పొందుతాము. ఇది ముమ్మాటికీ నిజం.

తొమ్మిదవరోజు తొమ్మిదవ అధ్యాయం సమాప్తం.