రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

అల్లం వెల్లుల్లిలతో పుదీనా రైస్

పుదీనా జీర్ణశక్తిని పెంచే ఔషధం మాత్రమే కాకుండా, చక్కటి ఆరోగ్య ప్రదాయిని అన్న సంగతి అందరికీ తెలిసిందే. అల్లం, వెల్లుల్లిపాయలు కూడా జీర్ణశక్తికి మంచిగా తోడ్పడుతాయి. కొంతమందికి పుదీనా వాసన అంటేనే గిట్టదు. వంటలో వేసినప్పటికీ వాటిని తీసి పక్కన పెట్టేస్తుంటారు కూడా. అందుకే అలాంటివారికి పుదీనాను డైరెక్ట్‌గా పచ్చడిలాగా కాకుండా, అన్నంలో కలిపి వెరైటీగా చేసి పెట్టండి... లొట్టలేసుకుంటూ తినేయపోతే ఒట్టు.

కావలసిన పదార్థాలు :
బియ్యం... అర కేజీ
పుదీనా... ఎనిమిది కట్టలు
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్... మూడు టీస్పూన్లు
దాల్చిన చెక్క... చిన్నవి రెండు
లవంగాలు... ఆరు
నూనె... ఐదు టీస్పూన్లు
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
ముందుగా అరకేజీ బియ్యాన్ని బాగా కడిగి పొడి, పొడిగా అన్నం వార్చుకుని పక్కన ఉంచుకోవాలి. పుదీనా ఆకులను శుభ్రంగ కడిగి, మిక్సీలో వేసి పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి.. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, చెక్క, లవంగాలు, పుదీనా పేస్ట్ వేసి దగ్గరయ్యేదాకా వేయించాలి.

ఇప్పుడు వార్చి పక్కన పెట్టుకున్న అన్నాన్ని ఓ వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని పొడిపొడిగా కలపాలి. తరువాత అందులో పైన తయారు చేసుకున్న పుదీనా మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. చివర్లో సరిపడా ఉప్పును వేసి, మళ్లీ ఒకసారి కలుపుకోవాలి. అంతే కమ్మటి వాసనతో అదిరిపోయే అల్లం వెల్లుల్లిలతో పుదీనా రైస్ తయారైనట్లే...! దీన్ని ఉల్లిపాయలు, టమోటోలతో కలిపి తయారు చేసిన పెరుగు పచ్చడితో కలిపి తింటే చాలా బాగుంటుంది.