రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

శ్రీవారి నగల వివరాలివ్వండి


తితిదేకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్‌, తిరుపతి, న్యూస్‌టుడే: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఆధ్వర్యంలో ఉన్న అన్ని దేవాలయాల్లోని నగల వివరాలను అందజేయాలని సోమవారం హైకోర్టు తితిదేని ఆదేశించింది. గతంలో ఉన్న జాబితాకు ప్రస్తుతం సేకరించినదానికి తేడాలేమైనా ఉంటే కోర్టు దృష్టికి తీసుకురావాలంది. డాలర్లు అదృశ్యమైన నేపథ్యంలో స్వామివారి ఆభరణాలకు రక్షణ కల్పించాలంటూ నెల్లూరు కాంగ్రెస్‌ నేత బెజవాడ గోవిందరెడ్డి గత ఏడాది ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ గోడా రఘురాం, జస్టిస్‌ రమేష్‌రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. డాలర్ల అదృశ్యం తదితర అంశాలపై విచారణ చేపట్టడానికి ప్రభుత్వం ఇప్పటికే ఏకసభ్య కమిషన్‌ను నియమించిందని, ఈ నేపథ్యంలో పిటిషన్‌పై విచారణను ముగించాలని తితిదే తరఫు న్యాయవాది కోరారు. ఈ వాదనను పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.రామచంద్రరావు విభేదించారు. ఏడాదిగా పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా కమిషన్‌ ఏర్పాటు చేశామంటూ విచారణను ముగించడం సరికాదన్నారు. విజయనగర కాలం నుంచి స్వామివారికి నగలు ఉన్నాయని, ప్రస్తుతం వాటికి భద్రత కొరవడిందని తెలిపారు. స్వామివారి డాలర్లు అదృశ్యమయ్యాయని, మరి నగల పరిస్థితి ఏమిటోనని అనుమానాలు వ్యక్తంచేశారు. ఖజానాకు సంబంధించి తాళాలు రెండూ ఒకరి వద్దే ఉంటున్నాయని చెప్పారు. వాదనలను విన్న హైకోర్టు స్వామివారి నగల వివరాలను తెలియజేయాలని ఆదేశించింది. ప్రతివాదులైన తితిదే, రాష్ట్ర ప్రభుత్వాలను కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను మూడువారాలకు వాయిదా వేసింది.

బంగారు కొండ మరి
వజ్రకిరీటధారి వెంకన్న ఆలయ బొక్కసంలో మూలుగుతున్న ఆభరణాల విలువెంతో ఇప్పటికీ వెలకట్టలేకపోతున్నారు. శ్రీవారికి 12వశతాబ్ధి నుంచే కానుకల వెల్లువ ప్రారంభమైంది. 1509-1530 మధ్య కాలంలో దేవదేవుణ్ని శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు సందర్శించి స్వామివారి భాండాగారాన్ని స్వర్ణమయం చేశాడు. 10.02.1513లో కెంపులు, పచ్చలు, వజ్రాలు, నీలాలు, మాణిక్యాలు, వైఢూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్రకిరీటాన్ని సమర్పించారు. 02.05.1513న నవరత్నఖచిత ఉడుధార, స్వర్ణఖడ్గం, భుజకీర్తులు, 30 తీగల పతకం ఆయన అందించారు. తంజావూరు రాజు పాండ్యన్‌ కిరీటం సమర్పించారు. మైసూరు మహారాజు సహా పలువురు విలువైన కానుకలు అందించారు. ఇందులో 108 బంగారు పుష్పాలు, 32 కిలోల సహస్రనామహారం, నాలుగు కిలోల చతురు్భజ లక్ష్మీహారం, 7 కిలోల రత్నాల మకరకంఠి, 13.6 కిలోల నవరత్న కిరీటం ఉన్నాయి. దీంతోపాటు 500 గ్రాముల అరుదైన గరుడమేరు పచ్చ ఆభరణం ఉంది. మొత్తం మీద మూలవిరాట్‌కు ఎనిమిది కిరీటాలు, ఉత్సవ విగ్రహాలకు ఏడు కిరీటాలున్నాయి. దీంతోపాటు రతన్‌టాటా, అంబానీలు, విజయ్‌మాల్యా, గోయెంకా తదితర ప్రముఖులతో పాటు అజ్ఞాత భక్తులు సమర్పించే కానుకలకు అంతేలేదు. వెంకన్నకు 1940లో వజ్రకిరీటం, 1954లో వజ్రాలహారం, 1972లో వజ్రాల శంఖు, చక్రాలు, కర్ణపత్రాలు, 1974లో కఠిహస్తం, 1986లో రూ.5 కోట్ల విలువైన వజ్రాల కిరీటాన్ని తితిదే తయారు చేయించింది.

అమూల్య విలువకు గోప్యత
శ్రీవారి ఆభరణాలకు తితిదే 19 రికార్డులు నిర్వహిస్తున్నా, వీటి ఆధారంగా మదింపు చేసేందుకు నిపుణులు వెనకడుగు వేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా వీటి విషయం గోప్యంగా ఉంచుతూ వస్తున్నారు. అయితే గత ఏడాది నిర్వహించిన అమృతోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆభరణాల విలువ రూ.32 వేల కోట్లు అంటూ వెల్లడైంది. కానీ, విశ్లేషకుల అంచనా ప్రకారం దేవదేవుని ఆభరణాల బరువు మొత్తం 11.5 టన్నులు. వీటి విలువ రూ.50 వేల కోట్లకు పైగా ఉన్నట్లు తేల్చుతున్నారు. ఇలా ఎవరికి వారు విలువ నిర్ధరించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఇప్పటివరకు ఏనాడూ తితిదే వీటి విలువ గణించకపోవడంపై వివాదం నెలకొంది. కోర్టు ఆదేశాల మేరకు తాము ఆభరణాల జాబితా నివేదికను గడువులోగా ఇస్తామని తితిదే ఛైర్మన్‌ ఆదికేశవులునాయుడు చెప్పారు.