ఈ అపరాధం దేవస్థానందే
అన్నదానం ట్రస్టు నిధుల మళ్లింపు
మూలధనమూ కదిలించారు
ఇక నిర్వహణ భారమే!
తిరుమల, న్యూస్‌టుడే: అలనాడు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారి పరిణయం సందర్భంగా కుబేరుడి వద్ద తీసుకున్న అప్పు నేటికీ తీరలేదు. భక్తులు చెల్లించే కానుకల ద్వారా వడ్డీ మాత్రమే చెల్లిస్తున్నాడు. అందుకే గోవిందుడుకి వడ్డీకాసులవాడనే పేరొచ్చింది. ఆ అప్పు సంగతి అలా ఉంటే.. తితిదే పాలక పెద్దలు స్వామి నెత్తిన మరో అప్పుల భారం మోపారు. భక్తులు ఏనాడూ కోరకపోయినా శ్రీ వారి నిత్య అన్నదానం పథకం కింద ముద్దపప్పు, నెయ్యి వడ్డింపును అదనంగా చేర్చారు. పాలకమండలి మాజీ సభ్యుడొకరు కందిపప్పు, నెయ్యి సరఫరా చేస్తున్నారు. ఆయన కోసమే ఈ పథకాన్ని చేర్చారనే విమర్శలు వచ్చాయి. దీంతో నిత్య అన్నదానం ట్రస్టుకు నెలా వారీ వ్యయం రూ.కోటి నుంచి రూ.1.50 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో తితిదే విద్యాలయాల వసతిగృహాల్లో క్యాంటిన్లను అన్నదానం ట్రస్టు కింద నిర్వహించాలనే తీర్మానం పాలకమండలి చేసింది. దేవస్థానం ఉన్నతాధికారులూ మారు మాట్లాడకుండా అంగీకరించారు. ఈ తీర్మానాన్ని అన్నదానం ట్రస్టు తీవ్రంగా వ్యతిరేకించింది. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదానం చేయడానికే దాతలు విరాళాలు ఇచ్చారు తప్ప క్యాంటిన్లకు కాదని తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంపై వారు న్యాయస్థానానికి వెళితే సమస్య తీవ్రమవుతుందని ట్రస్టు హెచ్చరించింది. విరాళాలు అందించే దాతలకు ఆదాయపు పన్ను రాయితీ వర్తింపు రద్దవుతుందని కూడా సూచించింది. అయినా తితిదే పెడచెవిన పెట్టి వసతి గృహాలకు అన్నదానం పథకం విస్తరించింది. విధిలేని పరిస్థితిలో అన్నదానం ట్రస్టు వసతి గృహాల్లోనూ క్యాంటిన్ల నిర్వహణ భారం ఎత్తుకుంది. దీంతో ట్రస్టు రుణ భారం రూ.17,47,67,057 మేరకు పెరిగింది. భక్తులు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మూలధనం నుంచి నిబంధనలు అతిక్రమించి రూ.రెండు కోట్లు (31-3-2008 నాటికి) తీసి ఖర్చు పెట్టారు. భక్తులిచ్చే డిపాజిట్లపై తితిదేకు ఎలాంటి అధికారంలేదు. ఆ డిపాజిట్లను రద్దు చేయడం, ఆ నిధుల్ని నేరుగా వినియోగించుకోవడం చట్టరీత్యా నేరం. పెరిగిపోయిన రుణ భారంపై ఆందోళన చెందిన నిత్య అన్నదానం ట్రస్టు తితిదేకు హెచ్చరిక చేస్తూ ఇటీవల నివేదిక అందచేసింది. నివేదికలోని అంశాలు...
* అన్నదానం ట్రస్టు కింద డిపాజిట్లు రూ.168,14,54,776. ఈ మొత్తంపై ఏడాదికి వచ్చే వడ్డీ మొత్తం రూ.27,20,40,447గా అంచనా.
* తిరుమలలో నిత్య అన్నదానంతో పాటు వైకుంఠం-2, పీఏసీ-2, తిరుచానూరులో అన్నదానంకు ఏడాదికి రూ.22,25,37,196 ఖర్చు. తితిదే విద్యాసంస్థల వసతిగృహాల్లో క్యాంటిన్ల నిర్వహణకు రూ.11,49,46,141 ఖర్చు.
* ఏడాది ఖర్చు రూ.33,74,83,337 కాగా వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం 27,20,40,447 మాత్రమే. ఆదాయానికి, ఖర్చు మధ్య ఉన్న వ్యత్యాసం రూ.ఐదు కోట్లు ఏవిధంగా భరించాలని నివేదికలో తితిదేను ప్రశ్నించింది.
* గత ఏడాదిలో అప్పుల భారం రూ.17,47,67,057గా తేల్చింది. ఈ భారం ఏ విధంగా పూడ్చుకోవాలో అర్థం కాక అన్నదానం ట్రస్టు నిర్వాహకులు తలపట్టుకున్నారు. ఈ పరిస్థితిపై పలుమార్లు నివేదిక ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదు.