శ్రావణ మంగళవారం "మంగళ గౌరీవ్రతం"
పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరమధనం చేసే సమయాన. అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషయం పుట్టుకొచ్చింది.
దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి.. ఇప్పుడు నేనేమి చెయ్యను? అన్నట్లు పార్వతి వైపు చూచాడు.
"మ్రింగెడు వాడు విభుండని మ్రింగెడిది గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనే సర్వమంగళ మంగళ సూత్రమును నెంతమది నమ్మినదో"
ఆ సర్వమంగళ స్వరూపిణియై జగన్మాత, భర్తచూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది. దేవతులైనా, దానవులైనా, మానవులైనా, మనభక్తులే కదా! మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు? అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగల్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసముంచి, లోకవినాశానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవిని "శ్రీ లలితా సహస్రనామ పారాయణ" ప్రారంభంలోనే ఇలా ధ్యానిస్తారు.
"అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్
అణిమాదిభి రావృతాం వయూఖై రహమిత్యేవ విభావయే భవానీమ్."
అట్టి సర్వమంగళ స్వరపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలిమంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్యబాధలు లేకుండా వారీ జీవితాంతం సర్వసౌఖ్యములతో గడుపుతారని పురోహితులు అంటున్నారు.
మరోవైపు.. మంగళగౌరీవ్రతమును ఆచరించే అల్పాయుష్కుడైన తన భర్తను గండముల నుంచి తప్పించి దీర్ఘసుమంగళిగా వర్ధిల్లిందని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత శ్రావణమాసంలో వచ్చే మంగళవారం పూట కొత్తగా పెళ్లైన స్త్రీలు గౌరీమాతను దీక్షతో ప్రార్థిస్తే సర్వమంగళం చేకూరుతుందని విశ్వాసం.
Labels:
పండుగలు