శుక్లాంబర ధరం విష్ణుం
శశివర్ణం చతురు్భజం
ప్రసన్నవదనం ధ్యాయేత్
సర్వవిఘ్నోప శాంతయే
వినాయకుడంటే ముందుగా గుర్తొచ్చేది ఈ శ్లోకమే. కానీ గణపతి అంటే తెల్లని వస్త్రాలూ చంద్రుని వర్ణం నాలుగు భుజాలూ ప్రసన్న వదనమే కాదు. అరివీరభయంకర వీరగణపతిగానూ సిరిసంపదలనిచ్చే లక్ష్మీగణపతిగానూ... ఇలా విభిన్న ఆహార్యాలతో 32 రూపాలలో కొలువై ఉన్నాడని చెబుతోంది ముద్గల పురాణం. వాటిలోనూ పదహారు రూపాలు మరింత ప్రశస్తమైనవని నమ్మిక. ఆ పదహారు రూపాలనే షోడశగణపతులుగా ఆరాధిస్తారు భక్తులు. తమిళనాడులోని కాల్పాతి ఆలయంలో ఈ షోడశగణపతులనూ ఒక్కచోటే చూడవచ్చు. ఈ గణపతుల్లో ఒక్కొక్క స్వామిని పూజిస్తే ఒక్కొక్క ఫలితం లభిస్తుందని విశ్వసిస్తారు భక్తులు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆయా మూర్తుల రూపాలూ వివరాలూ...
ఉదయించే సూర్యుని రంగులో మెరిసిపోయే స్వామి బాలగణపతి. బాలగణపతి పసిమనస్తత్వానికి గుర్తుగా ఆయన నాలుగు చేతుల్లో... అరటిపండు, మామిడి పండు, చెరకు గడ, పనసపండు కనిపిస్తాయి. ఆయనకు ఇష్టమైన ఉండ్రాయిని తొండంతో పట్టుకుని ఉంటాడు. పేరుకు తగ్గట్టుగా ఈ స్వామి చేతుల్లో ఆయుధాలు లేకపోవడం గమనించాల్సిన విశేషం. బాలగణపతిని భక్తిగా పూజిస్తే శ్రద్ధగా పరిశీలించే శక్తి కలుగుతుందనీ కోరిన కోర్కెలు తీరుతాయనీ నమ్మిక.
అంటే యవ్వన దశలో ఉన్న వినాయకుడు. తరుణ వయస్కులకు సహజమైన రోషం, శౌర్యానికి గుర్తుగా ఈ స్వామి ఎనిమిది చేతుల్లోనూ రెండిట్లో పాశం, అంకుశం కనిపిస్తాయి. మిగతా హస్తాల్లో వెలగపండు, వరికంకులు, దంతం, కుడుము, నేరేడు, చెరకుగడ ఉంటాయి. తరుణగణపతి రుధిరవర్ణంలో ఉంటాడు. దీర్ఘకాల అనారోగ్యాలతో బాధపడేవారు తరుణగణపతిని భక్తితో పూజిస్తే ఆయా రోగాల నుంచి త్వరగా విముక్తి లభిస్తుందని ప్రతీతి. అలాగే ఈ స్వామిని భక్తితో కొలిస్తే చేపట్టిన కార్యాన్ని సాధించితీరాలనే నమ్మకం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
శరత్కాల చంద్రునిలా తెలుపు రంగులో ఉండే స్వామి భక్త గణపతి. ప్రశాంతతకూ నిర్మలత్వానికీ గుర్తు. అందుకు తగ్గట్టుగానే ఈ స్వామి చేతుల్లో కొబ్బరికాయ, మామిడిపండు, అరటిపండు, క్షీరాన్నం ఉంటాయి. ఉపాసన చేసేవారు, మోక్షాన్ని కోరుకునేవారూ సాధారణంగా భక్త గణపతిని పూజిస్తారు.
పేరులోనే వీరత్వం ఉట్టిపడే వీరగణపతిని శత్రుసంహారకుడిగా పూజిస్తారు భక్తులు. ఎరుపురంగు శరీరం. పదహారు చేతులు, అన్ని హస్తాల్లోనూ ఆయుధాలే. ధనుస్సు, బాణం, చక్రం, త్రిశూలం, భేతాళం, పరశువు, ఖడ్గం, గద, పాశం, అంకుశం, ఈటె, సుత్తి, పాము, పలుగు, గండ్రగొడ్డలి, శక్తి... భీకర రూపుడిగా కనిపిస్తాడు వీరవినాయకుడు. ఈ స్వామిని నిత్యం భక్తితో కొలిస్తే శత్రువులపై సులభంగా విజయాన్ని సాధించే శక్తినీ ధైర్యాన్నీ ఇస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
సూర్యాస్తమయ సమయాన ఆదిత్యుడిలాగా జేగురు రంగులో మెరిసే ఈ స్వామి ఎడమ తొడపై అమ్మవారిని(శక్తి)ని కూర్చుండబెట్టుకుని ఉంటాడు. కనుకనే ఈయనను శక్తి గణపతిగా వ్యవహరిస్తారు. శక్తివినాయకుడి నాలుగు హస్తాల్లో అంకుశం, పూలదండ ఉంటాయి. మరో హస్తం అభయమిస్తున్నట్టుగా అభయముద్రలో ఉంటుంది. తాంత్రిక ఉపాసనలు చేసేవారు ఎక్కువగా ఈ శక్తిగణపతిని ఆరాధిస్తారు. ఈస్వామిని మనసారా ధ్యానిస్తే అన్ని భయాలూ తొలగిపోతాయని నమ్మిక.
బంగారురంగు కలిసిన పసుపు వర్ణంలో భక్తుల పూజలందుకునే స్వామి సిద్ధిగణపతి. మామిడిపండు, పూలగుత్తి, చెరుకుగడ, గొడ్డలి చేపట్టి ఉంటాడు. సిద్ధిగణపతిని ఆరాధిస్తే మంత్రసిద్ధి కలుగుతుందని ప్రతీతి. ఈయన భక్తుల కోరికలను తీర్చి మోక్షాన్నీ అన్నింటా విజయాన్నీ ప్రసాదించే స్వామి అని నమ్మిక.
వినాయకుడి తాంత్రిక స్వరూపమే ఈ రూపు. నీలివర్ణంలో ‘శక్తి'సమేతుడై కొలువుండే ఉచ్చిష్టగణపతి హస్తాల్లో నీలి రంగు కలువ, దానిమ్మ పండు, వరికంకులు, వీణ, జపమాల ఉంటాయి. స్థిరాస్తి, ఇతర వ్యాపార రంగాల్లో ఎదురయ్యే కష్టాలను తొలగించుకోవడానికి ఉచ్చిష్టగణపతిని పూజిస్తారు. న్యాయం తమవైపు ఉండీ కోర్టుకేసుల్లో కాలజాప్యం అవుతున్నప్పుడు ఈస్వామిని కొలిస్తే ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఉచ్చిష్ట గణపతి ఆరాధనలో ఏమాత్రం తేడావచ్చినా దుష్ఫలితాలు కలుగుతాయని ఉపాసకులు అంటారు.
సర్వవిఘ్నాలనూ రూపుమాపే స్వామి విఘ్నగణపతి. బంగారు రంగులో ఉండే ఈ స్వామికి ఎనిమిది చేతులు. ‘శుక్లాంబరధరం విష్ణుం...' శ్లోకంలో చెప్పినట్టు ఈ వినాయకుడు విష్ణురూపుడు. అంటే ఆ శ్రీహరి లాగా ఈ స్వామి చేతుల్లో శంఖచక్రాదులు కనిపిస్తాయి. ఇంకా చెరుకుగడతో చేసిన విల్లు, బాణం, పాశం, గొడ్డలి, పూలదండ ఉంటాయి. ఈయననే నిర్విఘ్న గణపతి, విఘ్నరాజ గణపతి, భువనేశ గణపతి అని కూడా అంటారు. ఈస్వామిని పూజిస్తే శత్రువుల నుంచి రక్షణ లభిస్తుందనీ అన్నింటా విజయం లభిస్తుందనీ నమ్మిక.
కోరిన కోర్కెలు త్వరగా నెరవేరాలనుకునేవారు మందారపువ్వు రంగులో మనోహరంగా ఉండే క్షిప్రగణపతిని పూజిస్తారు. ఈ స్వామి చేతుల్లో విరిగిన దంతం(ఆయనదే), కల్పవృక్ష శాఖ(కోర్కెలు తీర్చేందుకు గుర్తుగా), పాశం, అంకుశం ఉంటాయి. తొండంతో రత్నఖచిత కలశాన్ని పట్టుకుని ఉంటాడు. నమ్మి కొలిచిన భక్తులపై తన కరుణాకటాక్షాలతో పాటు సిరిసంపదలనూ కురిపించే స్వామి ఈ క్షిప్రగణపతి అని ప్రతీతి.
బలహీనులను సదా కాపాడే స్వామి సింహవాహనుడైన హేరంబగణపతి అని భక్తుల విశ్వాసం. ఐదుముఖాలతో హరితవర్ణంలో ఉండే ఈ స్వామి చేతులు అభయ, వరద ముద్రల్లో ఉంటాయి. మిగతా చేతుల్లో పాశం, దంతం, జపమాల, పూలదండ, గొడ్డలి, సుత్తి, ఉండ్రాయి, తీపికుడుము, పండు ఉంటాయి. అత్యంత కష్టసాధ్యమైన కార్యాన్ని సాధించాల్సి వచ్చినా ప్రయాణాల్లో ప్రమాదాలు కలగకూడదన్నా హేరంబగణపతిని ధ్యానిస్తే చాలంటారు భక్తులు.
ఎడమ తొడపై ‘శక్తి'ని కూర్చుండబెట్టుకుని ఉండే మహాగణపతి తాంత్రిక స్వరూపుడు. గోధుమ వర్ణంలో ఉండే ఈ స్వామి మూడుకన్నులూ... తలపై నెలవంకతో తన తండ్రి అయిన శివుణ్ని స్ఫురింపజేస్తాడు. చేతుల్లో దానిమ్మపండు, చెరకుగడ, కమలం, విల్లు, చక్రం, పద్మం, పాశం ఉంటాయి. కోరినకోర్కెలనన్నిటినీ తీరుస్తాడనీ సిరిసంపదలూ ఆయురారోగ్యాలూ కలగజేస్తాడనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఏలిననాటి శని ఉన్న సమయాల్లో చేపట్టిన పనుల్లోనూ విఘ్నాలు కలగకుండా కాపాడే స్వామి అని నమ్మిక.
నాలుగుముఖాలతో ఉండే స్వామి ద్విజగణపతి. పేరుకు తగినట్టుగానే ఈయన ఆహార్యం బ్రాహ్మణుని స్ఫురించే విధంగా ఉంటుంది. శ్వేతవర్ణంలో ఉండే ఈ స్వామి చేతిలో దండ, కమండలాలూ తాళపత్రగ్రంథాలూ ఉంటాయి. ద్విజగణపతిని ఆరాధిస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. ఈ మూర్తిని ధ్యానించే విద్యార్థుల ఆలోచనా శక్తి పెరిగి చదువులో మంచి ప్రతిభాపాటవాలు చూపుతారని ప్రతీతి.
లక్ష్మీగణపతి అంటే ఇప్పుడు చాలాచోట్ల కనిపిస్తున్నట్లు ఒడిలో లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకున్న వినాయకుడు కాదు. సిద్ధి, బుద్ధి సమేతంగా కొలువైన విఫే్నుశ్వరుడే అసలైన లక్ష్మీగణపతి. రెండుచేతులా ఇరువురు అమ్మవార్లనూ దగ్గరకు తీసుకున్నట్టుగా ఉంటాడు. ఒకచేయి వరదముద్రలో ఉంటుంది. మిగతా చేతుల్లో పాశం, అంకుశం, చిలుక, కల్పవృక్ష శాఖ, కమండలం, కత్తి, దానిమ్మ పండు ఉంటాయి. ఈయన రంగు శ్వేత వర్ణం. వృత్తివ్యాపారాల్లో వృద్ధినిచ్చే స్వామి ఈ లక్ష్మీగణపతి అని నమ్మిక.
ఎనిమిది చేతులతో బంగారు మేనిఛాయలో ఒడిలో హరితవర్ణంలో ఉండే శక్తిని కూర్చుండబెట్టుకుని ఉండే స్వామి వూర్ధ్వగణపతి. ఈయన కూడా తాంత్రిక స్వరూపుడేనని కొందరి విశ్వాసం. నీలిరంగు పుష్పాలు, వరికంకి, తామరపువ్వు, చెరకువిల్లు, బాణం, దంతం ధరించి ఉండే వూర్ధ్వగణపతిని పూజిస్తే భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుందని నమ్మిక. వూర్ధ్వగణపతిని భక్తితో పూజిస్తే తెలిసి చేసిన పాపాలు కూడా పోతాయంటారు భక్తులు.
సాధారణంగా అందరూ పూజించే స్వామి విజయగణపతి. నాలుగు చేతుల్లో పాశం, అంకుశం, దంతం, మామిడిపండుతో... ప్రసన్నవదనంతో కనిపించే మూషికవాహనుడు. పేరులోనే ఉన్నట్టుగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారం... ఇలా ఏ రంగంలోనైనా అన్ని అడ్డంకులనూ తొలగించి శాశ్వత విజయాన్ని సిద్ధింపజేసే స్వామి విజయగణపతి అని ప్రతీతి.
బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఆనందతాండవంచేసే మూర్తి నృత్యగణపతి. ముఖంలో ఆనందానికి భిన్నంగా చేతుల్లో పాశం, అంకుశం, గొడ్డలి, దంతం వంటి ఆయుధాలు ఉంటాయి. అట్టే సమయంలేని దశలో... తక్షణమే తీరాల్సిన కోరికలేవైనా ఉంటే అలాంటివారు నృత్యగణపతి ఆరాధన చేస్తే వెంటనే ఫలితం లభిస్తుందనీ... తృప్తి, మనశ్శాంతి లభిస్తాయని నమ్మిక.
ఈ షోడశగణపతులే కాదు... ఏకాక్షర, వర, త్యక్షర, హరిద్రా, క్షిప్రప్రసాద, ఏకదంత, సృష్టి, ఉద్దండ, రుణమోచన, డూండి, ద్విముఖ, త్రిముఖ, సింహ, యోగ, సంకటహర, దుర్గ గణపతి... ఇలా పార్వతీ తనయుని మరో పదహారు రూపాలను కూడా విశదంగా వివరిస్తోంది ముద్గల పురాణం. ఏకాక్షర గణపతి భయాలను తొలగించి అభయమిస్తే ఏకదంత గణపతి అజ్ఞానాన్ని పారద్రోలతాడనీ... త్రినేత్రుడైన వర గణపతి, కల్పవృక్షచా్ఛయలో ఆసీనుడైన క్షిప్రప్రసాద గణపతి సిరిసంపదలను ఒసగే స్వాములు కాగా ద్విముఖ గణపతి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని నమ్మిక. విద్యలో పురోగతి ఆశించేవారు త్యక్షర గణపతినీ మానసిక సుఖశాంతులకు హరిద్రాగణపతినీ ఆరాధిస్తారు(హరిద్రా గణపతి అంటే పసుపుముద్ద వినాయకుడు. సాధారణంగా ఇంట్లో ఏ శుభకార్యం అయినా గణపతిపూజ పేరిట పసుపుతో చేసిన విఫే్నుశ్వరుడికే తొలిపూజ చేస్తారు. హరిద్రా గణపతికి నైవేద్యం పెట్టి ఉద్వాసన పలికాకే అసలు పూజ మొదలవుతుంది). ఇక, ప్రశాంత చిత్తం కోరుకునేవారు త్రిముఖ గణపతినీ దుఃఖాల్లో కూరుకుపోయినవారు ఆ బాధ నుంచి విముక్తి కోసం సృష్టిగణపతినీ భూతప్రేతపిశాచాది భయాలతో బాధపడేవారు ఆ భయాలను తొలగించుకోవడానికి ఉద్దండ గణపతినీ పూజిస్తారు. రుణబాధల నుంచి విముక్తి పొందడానికి రుణమోచన గణపతినీ అఖండ ఆయురారోగ్యాల కోసం డూండి గణపతినీ ఆరాధించే ఆచారం ఉంది. సింహవాహనుడై, సింహముఖుడై విరాజిల్లే సింహగణపతిని పూజిస్తే ఎలాంటి భయమైనా తొలగిపోతుందని ప్రతీతి. బ్రహ్మజ్ఞానానికీ యోగతత్వానికీ ప్రతీక అయిన యోగ గణపతిని ఆరాధించినవారికి ఏకాగ్ర చిత్తం అలవడుతుందని చెబుతారు. దుర్గ గణపతిని ఆరాధించిన వారికి అపజయం అన్నదే ఉండదని పురాణప్రవచనం. ఇక ముప్ఫైరెండు మూర్తుల్లో ఆఖరి రూపు సంకటహర గణపతి. ఈ స్వామిని ఆరాధిస్తే అన్ని అడ్డంకులూ కష్టాలూ ఇబ్బందులూ బాధలూ సమస్యలూ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.