వర్మ "అడవి" హోర్డింగుపై ఉరి వేసుకుని
ముంబయిలోని జార్గాన్ ఫ్లై ఓవర్ వద్ద సోమవారం అడవి చిత్రం హోర్డింగును చూసిన జనం ఠారెత్తిపోయారు. ఆ హోర్డింగుపై రక్తపు మరకలతో ఉరితో వేలాడుతున్న మానవ శరీరాన్ని చూసి బెంబేలెత్తిపోయారు. ఈ వార్త ముంబయిలో దావానంలా వ్యాపించడంతో ఆ హోర్డింగు వద్ద భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. పోలీసు కంట్రోలు రూముకు ఫోను చేసి, విషయాన్ని చేరవేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి శరీరాన్ని కిందికి దింపి చూస్తే.. అసలు నిజం ఏమిటో బయటపడింది. వివరాలలోకి వెళితే...
అడవి చిత్రం విడుదల తేదీ దగ్గరయ్యేకొద్దీ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రేక్షకులలో ఉత్కంఠను రేకిత్తించే మార్గాలను అనుసరిస్తున్నారు. మొన్నటికి మొన్న "రణ్" చిత్రంలో జనగణమన "రణ్" అధినాయక జయహే అంటూ జాతీయగీతంలో పలు వివాదస్పద పదాలను చొప్పించిన వర్మ తాజాగా ముంబయిలో మరో అలజడిని సృష్టించారు.
అడవి పబ్లిసిటీని వెరైటీగా చేయాలనుకున్న వర్మ ముంబయిలోని జార్గాన్ ఫ్లై ఓవర్ వద్ద చిత్రం తాలూకు పెద్ద హోర్గింగ్‌ను ఏర్పాటు చేశారు. సహజంగా తన సినీ ప్రమోషన్లలో హాట్ డ్రెస్సుల్లో ఉన్న హీరోయిన్ల శరీర ప్రదర్శను ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా హోర్డింగ్‌పై మనిషి డమ్మీ శరీరాన్ని ఉరి వేసుకున్నట్లుగా వేలాడదీయించాడు. ఆదివారం బాగా పొద్దుపోయిన తర్వాత ఈ పబ్లిసిటీ తాలూకు కార్యక్రమాన్ని ముగించాడు.
ఉదయాన్నే ఆ దారినే ఆఫీసుకు వెళ్లేవారు, ఇతర వ్యాపారులు, ప్రజలు హోర్డింగుకు ఉరివేసుకుని వేలాడుతున్నది నిజమైన మనిషేమోనని ఆందోళన చెందారు. హోర్డింగుపై ఉరితో వేలాడుతున్న మనిషి, అతని శరీరంపై ఉన్న రక్తపు మరకలు చూసి భయభ్రాంతులయ్యారు. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేసి అడవి హోర్డింగుపై వేలాడుతున్న సదరు శరీరాన్ని కిందకు దింపి పరీక్షగా చూస్తే.. అది డమ్మీ మనిషని తేలింది. పోలీసులు ఆ డమ్మీ మనిషిని స్టేషనుకు తీసుకెళ్లారు. వర్మ అడవికి కావలసిన పబ్లిసిటీ వచ్చేసింది.
Labels:
సినిమా