రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

ఎంకన్న సొమ్ము.. ఎటెళ్లుతోంది?


98 ధార్మిక సంస్థలకు నిధులు
100 కోట్ల నష్టాల్లో ఎస్వీ ఛానెల్‌
దేనిపైనా నియంత్రణ లేదు
7 ఫౌండేషన్లుగా చక్కదిద్దాలి

ఓ ప్రవహించే నదిలోంచి ఒక్కొక్కరుగా బకెట్లతో నీళ్లు ముంచుకొని వెళుతుంటే... ఎవరెన్ని బకెట్ల నీళ్లు తీసుకెళ్లారనేది ఎలా తెలుస్తుంది? సామర్థ్యం ఉన్న వ్యక్తి నాలుగు బకెట్లు ఎక్కువ తీసుకెళ్లినా నదీ ప్రవాహంలో నీటి లెక్క తెలీదు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లో పరిస్థితి కూడా ఇదే
తితిదేలో ఆదాయ వ్యయాలు అంతు చిక్కవు. ఎంకన్నస్వామికి ఎంత ఆదాయం వస్తుందో లెక్క తేలని పరిస్థితి కాబట్టి ఖర్చుల్ని కూడా అదే రీతిలో చేయాలన్నట్లుంది ప్రస్తుత తితిదేలో పాలనా వ్యవహారం. గత 50 ఏళ్లలో ధార్మిక సంస్థల పేరిట తితిదే అనేక పథకాల్ని చేపట్టింది. ఇప్పటి వరకూ సుమారు 98 అకౌంటింగ్‌ యూనిట్లు తితిదే నుంచి నిధులు పొందుతున్నాయి. ఇన్ని యూనిట్ల వ్యయ పద్దుల్ని సరిచూసేందుకు పటిష్టమైన ఆడిటింగ్‌ విభాగం తితిదేలో లేదు. అన్ని పథకాల అమలు తీరును, నిధులను మంజూరు చేయాల్సిన బాధ్యత కార్యనిర్వహణాధికారి(ఈఓ)పై ఉంది. ఉదాహరణకు... ఆరోగ్యానికి సంబంధించి 16 ప్రాజెక్టులు తితిదే పరిధిలో పనిచేస్తున్నాయి. ఇందులో శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(స్విమ్స్‌) వంటి పెద్ద సంస్థతోపాటు ఆయుర్వేద ఆస్పత్రులు, డిస్పెన్షరీలూ ఉన్నాయి. విద్యాభివృద్ధి కోసం 14 సంస్థలు, ధర్మ ప్రచార పరిషత్తు కోసం 11 సంస్థలు... ఇలా అనేక రకాల ప్రాజెక్టుల కింద మొత్తం 98 యూనిట్లు నిధులు ఖర్చుచేస్తున్నాయి. ఒక సంస్థ పెద్ద ఆసుపత్రికని నిధులు కోరితే, మరొక అధికారి గోసంరక్షణకని తీసుకుంటారు. ఏ పథకం కోసం ఎవరికి ఎప్పుడు నిధులు కావాల్సి వచ్చినా.. నేరుగా పాలక మండలిలో తీర్మానం చేయించుకుంటారు. ఆ మేరకు కార్యనిర్వహణాధికారి నిధుల్ని మంజూరుచేస్తారు. ప్రభుత్వం మారగానే, పాలక మండలి మారుతుంది. కొత్త పాలక మండలి రాగానే మరికొన్ని కొత్త పథకాలను ప్రారంభించడం, వాటికి నిధులు మంజూరు చేయడం.. ఈ క్రమంలోనే అకౌంట్‌ యూనిట్ల సంఖ్య వందకు దగ్గరైంది. దేనిపైనా ఆడిట్‌ లేదు. ఏ పథకంపై ఎంత ఖర్చు పెడుతున్నామనే లెక్క తెలియదు. ఉదాహరణకు స్విమ్స్‌కు ఈ ఏడాది రూ.20 కోట్లు మంజూరు చేశారనుకుంటే... ఆ రూ.20 కోట్లు దేని కోసం ఖర్చుపెట్టారు? దానివల్ల ఫలితం ఎంత? ఎంతమంది ప్రయోజనం పొందారు? వచ్చే ఏడాది ఇంతకంటే ఎక్కువ మంజూరుచేయాలా? అసలు అవసరం లేదా? అనే వివరాలేవీ తితిదే వద్ద లేవు. ఇది ఒక్క సంస్థకు సంబంధించింది కాదు... 98 యూనిట్ల పరిస్థితి ఇంతే! ఇలా కొన్నేళ్లుగా వేల కోట రూపాయలు తితిదే నుంచి మంజూరవుతున్నాయి. ఉదాహరణకు శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్‌ ఒకటి. ఇది ఇప్పటికే దాదాపు రూ.100కోట్లు నష్టాల్ని మూటగట్టుకుంది. ఏటా దీనిపై రూ.30 కోట్లు ఖర్చుపెడుతుంటే... దీని ఆదాయం రూ.3 కోట్లను మించడం లేదు. వీటినన్నింటినీ ఒక్క ఎగ్జిక్యూటివ్‌ అధికారే సమర్థంగా నిర్వహించడం అనేది అసాధ్యమని మాజీ ఐపీఎస్‌ అధికారి సి.ఆంజనేయరెడ్డి తితిదేపై గత ఏడాది ఇచ్చిన నివేదికలో స్పష్టంచేశారు. ఈ భక్తి ఛానెల్‌కు వచ్చే మూడేళ్లలో పైసా ఇవ్వకూడదని, దాని సొంత ఆదాయాన్ని పెంచుకుని నడిపించుకోవాలని, మూడేళ్లలో అలా నిలదొక్కుకోలేకపోతే ఆ ఛానెల్‌ను మూసేయాలని నివేదికలో ఆంజనేయరెడ్డి స్పష్టంచేశారు. ఇలా వివిధ పథకాల కింద 98 అకౌంట్‌ యూనిట్లుగా ఉన్నవాటిని 7 ఫౌండేషన్లుగా విభజించాలని ఆయన సూచించారు. అవి...

* విద్య
* ఆరోగ్యం
* ధర్మ ప్రచార పరిషత్‌
* అన్నదానం ట్రస్ట్‌
* చారిత్రక, సాంస్కృతికం
* సాంఘిక సంక్షేమం
* గోసంరక్షణ

ఒక్కో గ్రూపు కిందికి సంబంధిత యూనిట్లను తీసుకురావాలి. ఇలా ఏడు ఫౌండేషన్లను స్థాపించి, వాటి ద్వారా సంబంధిత విభాగాలకు నిధులు ఖర్చు చేయాలి. ఈ ఏడు ఫౌండేషన్లు కూడా వేటికవే స్వతంత్ర సంస్థలుగా రూపొందించాలి. వాటికి మూల ధనమిచ్చి ఆర్థికంగా సహకరించాలే గానీ తితిదే ఆధ్వర్యంలో నడిపించకూడదు. రామకృష్ణ మిషన్‌, భారతీయ విద్యా భవన్‌... వంటి లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలి. ప్రతి ఫౌండేషన్‌ను ఒక ట్రస్ట్‌గా ఏర్పాటుచేయాలి. ముగ్గురు సభ్యులుగా ఉండే ఆ ట్రస్టీలో తితిదే పాలకమండలి సభ్యుడు ఒకరు, సంబంధిత విభాగంలో నిపుణులు ఇద్దరు సభ్యులుగా ఉండాలి. తితిదే ఇచ్చిన నిధులను వారే పర్యవేక్షిస్తారు. ఎంత ఖర్చు పెడుతున్నారు? ఎవరెవరికి ఖర్చుపెడుతున్నారు? ఏవిధంగా ఖర్చుపెడుతున్నారు? అనే లెక్కల్ని సరిచూస్తారు. వార్షిక నివేదికలు అందజేస్తారు. దీనివల్ల తితిదేకు నియంత్రణ వస్తుంది. మొత్తంగా ఎవరెవరికి ఎంత ఖర్చుపెడుతున్నామో తెలుస్తుంది.