మచిలీపట్నం, న్యూస్‌టుడే: న్యాయవాదులు, తల్లిదండ్రుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్న మగధీర చిత్రం ప్రదర్శనను తక్షణమే నిలిపివేయాలంటూ కృష్ణా జిల్లా మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్ష్యుడు లంకిశెట్టి బాలాజీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. చిత్ర కథానాయకుడు కొణిదెల రాంచరణ్‌తేజ, దర్శకుడు రాజమౌళి, నిర్మాత అల్లు అరవింద్, స్థానికంగా చిత్ర ప్రదర్శన చేస్తున్న రెండు సినిమా హాళ్ల యజమానులను ఆయన ప్రతివాదులుగా పేర్కొన్నారు. వృత్తిధర్మం ప్రకారం కేసు వాదించడానికి అంగీకరించిన న్యాయవాదిని కిరాతకంగా చంపడాన్ని చూపిస్తున్నందున న్యాయవాదుల జీవితాలకు అభద్రత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. అలాగే ప్రియురాలి కోసం కన్న తండ్రినే కొడుకు కర్కశంగా హతమార్చడం కూడా నేటి యువతరానికి చెడు సందేశాన్ని ఇచ్చేలా ఉందని అభిప్రాయపడ్డారు. తమ పిటిషన్ను న్యాయసేవాధికార సంస్థ ఈ నెల 18కి వాయిదా వేసిందని ఆయన తెలిపారు.
ఇది ఇలా వుండగా ఈ చిత్రం మరోమారు వార్తలకెక్కింది. ఇప్పటికే సంచలన విజయంతో తెలుగు చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్‌గా ఈ చిత్రం మారింది. అయితే, ఈ చిత్రంలోని ఒక పాట ప్రస్తుతం వివాదాస్పదమైంది.
తన అనుమతి లేకుండా ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’ అనే పాటను వాడుకున్నారని ప్రముఖ రచయిత, ప్రజా గాయకుడు వంగపండు ఆరోపించారు.
ఈ పాట ఎంతోమందిని ఉద్యమబాటవైపు నడిపించిందని గుర్తు చేశారు. ఓ మంచి ఉద్యమ స్ఫూర్తి కలిగిన పాటను అసభ్యకరమైన దృశ్యాలను చూపిస్తూ పాటకు ఉన్న విలువను గంగలో కలిపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాటను చిత్ర సన్నివేశంలో చూసిన ఓ కుర్రాడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మంచి సందేశంలో ఉపయోగించకుండా అశ్లీల దృశ్యాలు చూపిస్తూ ఉపయోగించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీనిపై క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వంగపండు హెచ్చరించారు. ఆ పాటను ఆ సన్నివేశం నుంచి తక్షణం తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.