బ్లాగూర్ : ఇవిగోండయ్యా, ఈ నెలలో అత్యధిక కామెంట్లు వచ్చిన బ్లాగుల టపాలు.బ్లాగరి : అదేంటి? నా టపాకి 269 కామెంట్లు వస్తే, 41 వచ్చాయని లెక్కకట్టావ్? ఇది అన్యాయం.
బ్లాగూర్ : అన్యాయమా? చూడు బాబూ. ఈ బ్లాగులోకంలో ఉన్న బ్లాగులు 150000. అందులో భారతీయ భాషా బ్లాగులు 15000. అందులో తెలుగు బ్లాగులు 1500. అందులో యాక్టివ్ బ్లాగులు 750. అందులో కామెంట్లు రాసే అలవాటు ఉన్నవాళ్ళు 500. అందులో హాస్యబ్లాగుల్లో మాత్రమే కామెంటు పెట్టేవాళ్ళు 250. ఆ మిగతా 250 లో నీ బ్లాగంటే పడిచావనోళ్ళు 220. ఆ పడిసచ్చిన 30 మందిలో ప్రతి ఒక్కడూ నీకు కామెంటినా కూడా ఇంక లెక్కతేలని 11 కామెంట్లు ఉన్నాయి. ఇవి "ఎవడు" రాసాడో అర్ధమైచావక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నీకే ఇచ్చా. ఇంకా ఇందులో లెక్కతేలటానికేముంది? ఇవి చాలా? ఇంకా డిటేల్స్ కావాలా?
బ్లాగరి : వద్దు సార్...చాలు
******
జడ్జి : భగవద్గీత మీద ప్రమాణం చెయ్యవయ్యా బ్లాగూర్బ్లాగూర్ : గీతలో ఆ కృష్ణుడు చెప్పిందే నేను చేస్తున్నాను సార్. ఈ ABCFకి కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే. ఇంక గీత మీద ప్రమాణం ఎందుకు సార్.జడ్జి : సరే, అయితే మనస్సాక్షి మీద చెయ్యి.
బ్లాగూర్ : అలాగే చేస్తున్నాన్సార్.జడ్జి : బ్లాగూర్ గారు, మీకు ఒక కొత్త బ్లాగింగ్ కమ్యూనిటీ తయారుచేసే నెట్వర్క్ ఉందని పోలీసువారంటున్నారు. మరి ఈ మార్గాన్నెందుకెంచుకున్నారు?
బ్లాగూర్ : రెండేళ్ళ క్రితం ఇంటర్నెట్లో తెలుగు బ్లాగులు చూసి, ముచ్చటపడిన మీ అమ్మాయి కూడా ఓ బ్లాగు ఓపెన్ చేసుకుని తెలుగులో టపాలు రాసుకున్న రెండు నెలలకే ఈ బ్లాగులోకంలో భయాందోళనలు కలిగిస్తున్న దుర్మార్గులకు భయపడి బ్లాగు మూసుకుంది. మీ అమ్మాయికి కలిగిన కష్టం మరెవరికీ కలగకూడదనే ఈ మార్గం ఎంచుకున్నాను సార్.
జడ్జి : ఆ... ఆ సంగతి మీకెలా తెలుసు?
లాయర్ : మీరే అన్నారు కద్సార్, ఈయనకి సొంతంగా కొత్త బ్లాగ్ కమ్యూనిటీ సృష్టించే తెలివుందని. కానీ ఇన్ని తెలిసిన మిస్టర్ బ్లాగూర్, మీకు జనాల్ని భయపెట్టటం కంటే ఆ భయపెట్టేవాళ్ళని బ్లాగింగ్ నుంచి బహిష్కరించటం ఇంకా పెద్ద నేరమని తెలియదా?
బ్లాగూర్ : బ్లాగర్లని భయపెట్టటం మీ దృష్టిలో పెద్ద నేరం కాకపోవచ్చు, కానీ రకరకాల భాషల్లో బ్లాగుల్ని ఓపెన్ చేసుకుని పిచ్చికూతలు కూస్తూ, జనాల్ని భయపెడుతూ, సొంత కామెంట్లు వేరే పేర్లతో కొట్టుకుంటూ సిగ్గు లేకుండా ఉన్న మీకు భయం అంటే ఏమిటో ఎలా తెలుస్తుంది లాయర్ గారూ.
లాయర్ : మీరొక లాయరుతో మాట్లాడుతున్నారని గుర్తుపెట్టుకోండి.
బ్లాగూర్ : నేను లాయరుతో కాదు, అమాయకుల్ని భయపెట్టే ఓ శాడిస్టుతో మాట్లాడుతున్నాను. ఎక్కువగా మాట్లాడితే నీ బ్లాగులోక చరిత్ర జడ్జిగారి ముందు పెట్టాల్సుంటుంది.లాయర్ : యువరానర్, విషయం సైడ్ ట్రాక్ చేస్తున్నాడు.
బ్లాగూర్ : హ.. విషయం నీదాకా వస్తే సైడ్ ట్రాకా? కాదు ఇదే మెయిన్ ట్రాక్. సార్, ఈ బ్లాగులోకంలో మెయిన్ ప్రాబ్లం భయం రేకెత్తించటం. ఈ భయం అన్నది సగటు భారతీయుడి సమస్య సార్. తెలుగులో బ్లాగులు 1500 అదే తమిళంలో 50. 50 బ్లాగుల్లో ఒక్క తుంబురన్ ఉంటే, 1500 బ్లాగుల్లో ఎందరు తుంబురన్లు ఉండాల్సార్. కానీ ఒక్కడు ...ఒక్కడు కూడా పుట్టలేదంటే కారణం...భయం...భయం.. అందుకే తెలుగులో రాయటం వచ్చిన బ్లాగర్లు కూడా తెలుగు బ్లాగులు వదిలేసి వేరే భాషలు నేర్చుకుని మరీ ఆ భాషల్లో బ్లాగులు రాయటం మొదలుపెడుతున్నార్సార్.చెప్పులు కుట్టుకునే తుంబురన్ బ్లాగులు రాసి తమిళనాడులో తమిళ బ్లాగుల పుణ్యమా అని గొప్ప వ్యక్తి అయ్యాడ్సార్. కానీ తెలుగులో బ్లాగులు మొదలెట్టి భయపడి మానేసిన మన తెలుగు అప్పారావు మాత్రం ఇంకా అమీరుపేటలో పల్లీలు అమ్ముకుంటూనే ఉన్నాడ్సార్. దీనికి కారణం భయం..భయంతెలుగు బ్లాగులోకంలో బ్లాగు ఓపెన్ చెయ్యాలంటే భయం, టపా రాయాలంటే భయం, రాసింది పోస్ట్ చెయ్యాలంటే భయం. దేవుడి మీద రాయాలంటే భయం, దయ్యం మీద రాయాలంటే భయం. హిందువు మీద రాయాలంటే భయం, ముస్లిం మీద రాయాలంటే భయం...ఆడ పేరుతో రాయాలంటే భయం, భయం..భయం...భయం. ఇలా భయపడుతూ ఉంటూ ఎలా బ్లాగులోకంలో బ్రతుకీడుస్తార్ సార్.
జడ్జి : అయితే భయం లేకుండా బ్లాగులోకంలో ఏ పనీ జరగదనా మీ ఉద్ధేశ్యం?
బ్లాగూర్ : జరగదు సార్. ముదురు బ్లాగరుకి భయం, తాను ఏం రాసినా పోటుగాడు అని పేరు పెడతాడని. ఆడ బ్లాగరుకి భయం, తననెక్కడ అవమానిస్తారో అని. ముసలి బ్లాగరుకి భయం, నీక్కూడా బ్లాగెందుకురా ముసలోడా అని వెక్కిరిస్తారని. లేత బ్లాగరుకు భయం, ఎక్కడ తప్పులు వెతుకుతారో అని. ఆఖరికి రామ రామ అంటూ బ్లాగులో భజన చేసుకునే భక్తి బ్లాగరుకి కూడా భయమే సార్, దేవుణ్ణి ఎందుకు పూజిస్తున్నావ్ అని భయపెడతారని.ఇలాంటి వాళ్ళందరూ బ్లాగులు రాయగలరా? రాయలేరు. వీళ్ళని చూసే నా గుండె రగిలిపోయింది. అందుకే ABCF (Anti Blog Corruption Force) స్థాపించాను. ఎక్కడెక్కడ ఇలా బ్లాగర్లని భయపెట్టి ఆనందించే శాడిస్టులని చూసానో, వాళ్ళ బ్లాగుల్ని నా ఆగిగేటర్లలో నుంచి నిర్దాక్షిణ్యంగా పీకి పారేసాను. ఆగ్రిగేటర్లలో లేని వాళ్ళ బ్లాగు బ్రతుకు కుక్కబతుకే అని వాళ్ళకి తెలిసేలా చేసాను.ఒక్కసారి ఆ విశ్వబ్లాగర్ ఠాగూర్ మాటలు గుర్తుకుతెచ్చుకోండి. ఏ బ్లాగు సమాజంలోనయితే మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ సాటి బ్లాగరు సగర్వంగా తలెత్తుకు తిరగగలడో, ఎక్కడ బ్లాగులోకం లింగం, కులం, మతం, జాతుల పేర్లతో ముక్కలుముక్కలైపోదో, ఎక్కడ మన బ్లాగర్ల చదువు, సంస్కారం, విజ్ణానం వెర్రితలలు వేయదో, ఎక్కడ ఓ బ్లాగర్ సాటి బ్లాగర్ని భయపెట్టడో అక్కడ...అక్కడ నిజమైన బ్లాగులోకం పరిమళిస్తుంది.
*****
ఈ బ్లాగులోకంలో నాకు నచ్చని ఒకే ఒక్క విషయం జనాలు తెగ "ఫీలైపోవటం". మనిషి ఎదురుగా ఉండి మాట్లాడితేనే తుడుచుకుపోయే జనాలున్న ఈ రోజుల్లో ఎక్కడో ఎవడో ఎదవ ఏదో అన్నాడనీ, కూసాడనీ "ఫీలైపోవడం" ఏమన్నా బాగుందా? ఫీలు అవాల్సింది ఆ ఎదవలు. ఈ బ్లాగూర్ మీతో ఉన్నాడు.