రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

బగ్గువద్గీత

కలియుగాంతం ఆసన్నమయింది, బ్రహ్మ తర్వాత యుగానికి శ్రీకారం చుట్టడానికి ఈ సారి వెరైటీగా కంప్యూటర్ లో సృష్టి మొదలు పెడదాం అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ప్రాక్టీస్ కోసం ఏదైనా సాప్ట్ వేర్ కంపనీ లో చేరదాం అని నిర్ణయించుకొన్నాడు. తనతో పాటు ఇంకొంత మంది దేవుళ్ళని కూడా ప్రాక్టీస్ కి అహ్వానించాడు.

బ్రహ్మ సాప్ట్ వేర్ డెవలపర్ గా జాయిన్ అయ్యాడు. సాప్ట్ వేర్ ని సృష్టించటం బ్రహ్మ పని. బ్రహ్మండంగా కోడింగ్ మొదలుపెట్టాడు. కాని అప్పుడప్పుడు అలవాటులో పొరపాటు గా బగ్గులు కూడా వచ్చేవి.బ్రహ్మ సృష్టించిన బగ్గుల వల్ల ప్రాజెక్ట్ కేమి సమస్యలు రాకుండ కాపాడడం, స్థితి కారకుడైన విష్ణువు పని కాబట్టి విష్ణు మూర్తి బ్రహ్మ కి టీం లీడర్ గా జాయిన్ అయిపోయాడు.

లయ కారకుడైన మహేశ్వరుడు కూడా టెక్నికల్ డైరెక్టర్ లాగా జాయిన్ అయ్యి బ్రహ్మ, విష్ణువులు సృష్టించి, కాపాడుతూన్న (మెయింటైన్ చేస్తున్న ) ప్రాజెక్ట్ లన్ని లయం(స్క్రాప్) చేస్తూ ఉండెవాడు. పొద్దున్న "C" లో చేసిన ప్రాజెక్ట్ ని స్క్రాప్ చేసి సాయంత్రం "C++" లో చేయమనే వాడు. తర్వాత రోజు దానిని స్క్రాప్ చేసి "java" లో చేయమంటూ తన ధర్మాన్ని నిర్వర్తించేవాడు.

ఈ రకం గా ప్రాజెక్ట్ లన్నీ స్క్రాప్ అవడం తో విసుగు చెందిన విష్ణు మూర్తి, బాగా ఆలోచించి ఇంకా కొంతమందిని టీం లో పెట్టుకుని ఒక్కక్కరి చేత ఒక్కో టెక్నాలజీ లో ప్రాజెక్ట్ డెవలప్ చేయించి ఈ సారి అయినా ప్రాజెక్ట్ "OK" చేయించుకోవలని అనుకున్నాడు. వెంటనే కృష్ణావతారం లో తన అనుంగు మితృడైన అర్జునుడిని, అర్జునుడి కన్నా ప్రతిభా పాటవాలు కల ఏకలవ్యుడిని టీం లో జాయిన్ చేసుకున్నాడు.

ఏకలవ్యుడు ఏ పని ఇచ్చినా తన శక్తి సామర్ధ్యాలతో వెంటనే పూర్తి చేసేసేవాడు. ఒక వేళ తనకి ఆ టెక్నాలజీ రాకున్నా, ఆ టెక్నాలజీని గురు ముఖంగా నేర్చుకోకపొయినా మనసులో గురువు గారిని ధ్యానించుకొని, గూగుల్ లో సెర్చ్ కొట్టి ప్రాక్టీస్ చేసి నేర్చేసుకొనేవాడు(కాపీ పేస్ట్ చేసేవాడు). కాని పాపం అర్జునుడు అలా కాదు. గురు ముఖంగా విననిదే ఏ టెక్నాలజీ నేర్చుకొలేకపోయెవాడు.

ఒక సారి అర్జునుడు చేసిన కోడ్ లో కుప్పలు తెప్పలు గా బగ్గులు వచ్చాయి. సాయంత్రానికి అన్ని బగ్గులు ఫిక్స్ చేయాలని విష్ణు మూర్తి డెడ్ లైన్ ఇచ్చి వెళ్ళాడు. అర్జునుడు మహా భారత యుధ్ధం లో కౌరవ సేన లా ఉన్న బగ్గులని చూసాడు. భయపడ్డాడు, విలపించాడు. అస్త్ర సన్యాసం (రాజీనామా) చేస్తున్నాని ప్రకటించాడు.

అర్జునుడి మాటలు విన్న విష్ణు మూర్తి వెంటనే కృష్ణావతారం లోకి మారిపోయి"అర్జునా !

బగ్గు సృష్టించేది ఎవరు, ఫిక్స్ చేసేది ఎవరు, ఇదంతా మిధ్య నాయనా!

బగ్గు ఒక్కటె శాశ్వతము, నిత్యము, సత్యము. అది అగ్నిచే కాల్చబడదు. నీటిచే తడుపడదు. కోడు చే ఫిక్స్ చేయబడదు.!

మానవుడు ఒక వస్త్రాన్ని వదలి వేరొక వస్త్రాన్ని ధరించినట్టు బగ్గు ఒక రూపాన్ని వదలి వేరొక రూపాన్ని ధరిస్తుంది.

నువ్వు ఏం బగ్గు సృష్టించావని నీవు బాధ పడుతున్నావు. ఈ రోజు నీకు అసైన్ చేసిన బగ్గు నిన్న వేరొకరికి అసైన్ కాలేదా, రేపు వేరొకరికి అసైన్ కాదా?"

అని సాప్ట్ వేర్ జీవిత (లైఫ్ సైకిల్) పరమార్ధాన్ని వివరించ గానే దుఃఖాన్ని విడచి కార్యొన్ముఖుడై బగ్గులన్ని ఫిక్స్ చేసాడు.

అప్పటి నుంచి సాప్ట్ వేర్ ఉద్యోగులందరు తమ తమ స్థానాలలో త్రిమూర్తులు, అర్జునుడు, ఏకలవ్యుడు ఏర్పరిచిన సాంప్రదాయాలని పాటిస్తూ బగ్గులని ఒక రూపం నుంచి మరొక రూపానికి మారుస్తునే ఉన్నారు.

ఈ కథ పది సార్లు పారాయణ చేసిన వారికి పది బగ్గులు తక్కువ వస్తాయి !!!