రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

పెళ్ళిచూపులు

పెళ్ళిచూపులకోసమని అబ్బాయివాళ్ళు అమ్మాయివాళ్ళ ఇంటికి వచ్చారు.పెళ్ళిచూపులు ఇంటర్యూలతో మొదలయ్యాయి.పరిచయాలు గట్రా అయ్యాక, అబ్బాయి తల్లితండ్రులు అమ్మాయినీ అమ్మాయి తల్లితండ్రులు అబ్బాయినీ ఇంటర్వూ చెయ్యడం మొదలెట్టారు.

అబ్బాయి వాళ్ళు అమ్మాయితో: నిన్ను ఎవరైన ఫాలో అవుతున్నారా? ఐతే ఎంతమంది ఫాలో అవుతున్నారు?

అమ్మాయి: గత సంవత్సరం నుండి ఫాలో అవుతున్నారు, మొదట్లో తక్కువమందే అయ్యేవారు కాని రాను రాను ఆ సంఖ్య పెరిగింది.ఇప్పటికి 25 మంది దాకా ఫాలో అవుతున్నారు.

అబ్బాయి తల్లి (చిన్నగా):ఒక సంవత్సరంలోనే 25మంది అంటే పర్వాలేదు ఏమంటారు?

అబ్బాయి తండ్రి: నిజమే కాని మనవాడికి ఆ మాత్రం కూడా ఫాలోయింగ్ లేదని తెలిస్తే వీళ్ళు ఒప్పుకుంటారంటావ? సర్లె చూద్దాం...

అబ్బాయి వాళ్ళు: అందరూ మనదేశం వాళ్ళేనా?

అమ్మాయి: లేదండి వేరే దేశాల వారు కూడా ఉన్నారు.వాళ్ళూ మనవాళ్ళె..

అబ్బాయి వాళ్ళు: సుమారుగా ఎంతమంది కామెంటు చేసారో చెప్పగలవా?

అమ్మాయి: సరిగ్గా గుర్తులేదు కాని సుమారుగా ఓ 200మంది ఉండుంటారండి.

అబ్బాయి వాళ్ళు: అబ్బో మనవాడికంటే నయమే ..


ఇక అమ్మాయి వాళ్ళు కూడా అబ్బాయిని ఇవే ప్రశ్నలు అడగటం అయ్యింది.అబ్బాయి ఇచ్చిన సమాధానలకు సంతృప్తి చెందని వాళ్ళు, అమ్మాయికి ఆ విషయం చెప్పారు. ఇక అమ్మాయి ఇష్టం అన్నట్టుగా తేల్చారు.అబ్బాయి అందంగానే ఉంటాడు కాని ఈ లోకపు కనీస అర్హతలు లేకపొతే ఎలా?అమ్మాయికి వచ్చినన్ని కామెంట్లు లేవు,ఫాలోవర్సు లేరు!! ఇలా వారి సంభాషన వింటున్న అబ్బాయి చటుక్కున లేచి మాట్లాడసాగాడు.

అబ్బాయి: కేవలం నా టపాలకు కామెంట్లు రానంత మాత్రాన, నా బ్లాగులో ఫాలోవర్లు లేనంత మాత్రాన మీకు మీరే ఒక నిర్ణాయానికి రావడం ఎంతవరకు సమంజసం?బ్లాగు రాయటమంటే అంత సులభమనుకున్నారా నా బ్లాగులో ఒక్క తప్పు చూపించండి ఇప్పటికిప్పుడే ఇక్కడినుండి వెళ్ళిపోతాను (తెచ్చిన స్వీట్లు తినకుండానే వెళ్తాడంటావా? మళ్ళీ రేపొస్తాడేమో అని చిన్నగా అన్నాడు అమ్మాయి తండ్రి)

లేఖినిలో ఇంగ్లీషులో టైపు చేసుకుంటూ ఒక్క తప్పు పోకుండా చూసుకుంటూ ఎప్పుడు పబ్లిష్ చేస్తే ఎక్కువమంది చూస్తారా అని ఆగి మరీ సమయంకోసం ఎదురుచూసి పబ్లిష్ చేసి చూస్తే నా టపా అసలు ముందు పేజీలోనే లేదు.ఎక్కడికి పోయిందా అని వెతికేసరికి అసలు విషయం అర్ధం అయ్యింది.టపా సేవ్ చేసిన టైం కే పబ్లిష్ అయ్యిందని,మరి మనం రాసింది పొద్దున్న ఆరింటికి పబ్లిష్ చేసింది సాయంత్రం ఆరింటికాయె.ఇక ఇలా కాదు ఈ సారి లెఖినిలో రాసి అక్కడే ఉంచి సేవ్ చేసుకోకుండా మంచి టైంకి పోస్ట్ చేద్దామని అనుకొని చాలా పెద్ద టపా నే రాసా.ఇంకేముంది నా సిస్టం హాంగ్ అయ్యింది దాంతో నేను రాసిన నా మొదటి పేద్ద టపా టపా కట్టేసింది.ఇక విసుగెత్తేసింది అయినా పట్టువదలకుండా రాస్తూనే ఉన్నాను.ఇంత పట్టు వదలని విక్రమార్కుడినా మీరు పరాభవమాడేది?(అమ్మాయి తండ్రి మనసులో: ఈ విక్రమార్కుడు మనల్ని ఇప్పట్లో వదిలేలాలేడు)

అయినా "కేవలం పుస్తకం పైన ఉన్న కవరును చూసి పుస్తకం మొత్తం తెలుసుకున్నామనుకోవడం" మీ భ్రమ(అమ్మాయి తండ్రి చిన్నగా: అన్నం ఉడికిందని తెలియడానికి ఒక్క మెతుకు చాలదా ఏంటి? అమ్మాయి తల్లి: మీరు కాస్త ఊరుకుందురూ).


చివరిగా నేను చెప్పదలచుకున్నది ఒక్కటే టపాకి వచ్చిన కామెంట్లు ఎన్ని? ఫాలోవర్లు ఎంతమంది ? అని కాదు టపాని చూడండి, ఆపైన మీఇష్టం అని కూర్చున్నాడు.

అబ్బాయి వాళ్ళు షాక్లోనుండి తేరుకుంటూ: ఏమంటారు బావగారు?

అమ్మాయి తండ్రి: మాదేముందన్నట్టుగా అమ్మాయి వైపు చూసాడు.


అమ్మాయి కి తెగ నచ్చేసాడు అబ్బాయి, అమ్మాయి ఓకె చెప్పేసింది.కధ సుఖాంతం :-)

ఈ ఆనందం తట్టుకోలేక "యాహూ హుర్రే" అని అబ్బాయి అరవడం మొదలెట్టాడు. ఈ అరుపులు విని తండ్రి గదిలోకొచ్చి "ఏంట్రా ఆ అరుపులు? పగటికలలు మాని తొందరగా తయారవ్వు,అసలే నీ పెళ్ళిచూపులకు వెళ్ళాలి ......(తండ్రి మనసులో: ఈసారైనా సంబంధం ఖాయం అవుతుందో లేదో !!)