అందరూ కలలుగంటారు. అందరూ కష్టపడతారు. అందరూ సంపాదిస్తారు.కానీ కొందరే, సంపన్నులవుతారు. ఎందుకు? ఆర్థిక విజేతల్లో కనిపించే అరుదైన లక్షణాలే అందుకు కారణమంటున్నారు నిపుణులు. వాటిని ఒంటబట్టించుకుంటే ఎవరైనా కావచ్చు... కరోడ్పతి!
‘ఆయన కోటీశ్వరుడు'
...గౌరవంగా చూస్తాం.
‘ఆ కారు ఖరీదు యాభైలక్షలు'
...రెప్పవాల్చడం కూడా మరచిపోతాం.
‘ఆమెకు ఆన్‌లైన్ లాటరీలో కోటిరూపాయలొచ్చాయి'
...కళ్లల్లో నిప్పులు పోసుకుంటాం.
‘అదిగో, వెయ్యి రూపాయల నోటు!'
ఆశగా తలతిప్పుతాం.
అది డబ్బు పవర్. కరెన్సీ ప్రభావం. శ్రీమహాలక్ష్మి మహత్యం.
సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు, డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు కాకపోవచ్చు. కానీ, ఏదో ఒక సందర్భంలో ఆర్థిక సంబంధాలు మానవసంబంధాల్ని ప్రభావితం చేస్తాయి. ఎవరైనా ‘నాకు డబ్బు మీద ఆసక్తిలేదు' అన్నారంటే...సంపాదించడం చేతకాదని ఒప్పేసుకున్నారని అర్థం.
మీరు డబ్బును ప్రేమించే వ్యక్తుల జాబితాలో ఉండవచ్చు. ద్వేషించే వ్యక్తుల జాబితాలోనైనా ఉండవచ్చు. ఏ జాబితాలో ఉన్నా, బతికున్నంతకాలం డబ్బు అవసరాన్ని కాదనలేరు. ఇది నిజం. బతకడానికి సరిపడా ఆక్సిజన్‌లా, అవసరాలకు తగినంత కరెన్సీ ఉండితీరాలి. అలా అని, డబ్బున్నంత మాత్రాన సుఖంగా ఉంటామని ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేరు. కానీ డబ్బులేకపోతే కష్టాలపాలవుతామన్నది మాత్రం అక్షర సత్యం. అందుకే, డబ్బంటే అంత ఆరాటం. తరాలకు సరిపడా సంపాదించుకోవాలన్న తహతహ. ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా బొమ్మలు గీసినా పుస్తకాలు రాసినా...అంతా డబ్బు కోసమే. తృప్తి, ఆనందం, కళాభిమానం...ఎవరెన్ని కారణాలు చెప్పినా అన్నీ కరెన్సీ తర్వాతే.
వందకోట్ల జనాభాలో ఓ పదిమంది ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం సంపాదిస్తారు. ఓ వందమంది దేశంలోని శ్రీమంతుల లిస్టులో ఉంటారు. లక్షమందో, పదిలక్షలమందో కోటీశ్వరులని అనిపించుకుంటారు. మిగతావాళ్లంతా మామూలు మనుషులు. ఒకటో తేదీ ఎప్పుడొస్తుందా అని మిగిలిన ఇరవైతొమ్మిది రోజులూ ఎదురుచూసే సగటు జీవులు.
ఎందుకిలా?
కొంతమందే సంపన్నులు కావడం ఏమిటి, మిగతావాళ్లంతా మధ్యతరగతి జీవులుగానో నిరుపేదలుగానో మిగిలిపోవడం ఏమిటి? అసలు, డబ్బు సంపాదించడానికి అర్హతలేమిటి?
తెలివితేటలా, శ్రమా, అదృష్టమా.
తెలివైనవాళ్లు మాత్రమే బాగా డబ్బు సంపాదిస్తారనడానికి ఎలాంటి ఆధారాల్లేవు. సంపన్నులంతా మేధావులు కారు. మేధావులంతా సంపన్నులు కారు.కష్టపడేగుణముంటే, కోటీశ్వరులు కావచ్చనీ బల్లగుద్ది చెప్పలేం. చెమటే కొలమానమైతే, కరెన్సీ మున్ముందుగా శ్రమజీవుల్నే వరించాలి. అలాంటి దాఖలాలేం లేవు. అదృష్టానికీ డబ్బుకూ కూడా ముడిపెట్టలేం. బిల్‌గేట్స్, వారెన్ బఫెట్, నారాయణమూర్తి... వీళ్లెవర్నీ సిరిసంపదలు అయాచితంగా వరించలేదు. రాత్రికిరాత్రే ఎవరూ సంపన్నులైపోలేదు. అంటే...పూర్తిగా తెలివితేటలే కాదు. పూర్తిగా శ్రమే కాదు. పూర్తిగా అదృష్టమూ కాదు. ఇంకేవో లక్షణాలున్నాయి. అవే కుబేరుల్ని తయారుచేస్తాయి. అవి, కన్నవారో గురువులో ఒంటబట్టించినవి కావచ్చు, ఎవరికివారే తీర్చిదిద్దుకున్నవీ కావచ్చు. ఆర్థిక వికాస సాహిత్యాన్ని ఓ మలుపుతిప్పిన రాబర్ట్ కియోసాకీ కూడా ఈ మాట నిజమేనంటున్నారు.
బాల్యమే పునాది...
‘నాన్నా! నాకు కంప్యూటర్ కావాలి'
‘మనదగ్గర అంత డబ్బు లేదమ్మా. మనం మధ్యతరగతి మనుషులం. పెద్దపెద్ద కోరికలు ఉండకూడదు'...తెలిసోతెలియకో పిల్లల ఆశల్ని బలవంతంగా చిదిమేస్తాం. అలా కాకుండా ఆ కంప్యూటర్ ధర ఎంతో, తమ సంపాదన ఎంతో, దాన్ని కొనాలంటే అదనంగా ఇంకెంత సంపాదించాలో వివరంగా చెబితే...పిల్లలు తప్పకుండా అర్థంచేసుకుంటారు. ప్రతి సమస్యనీ ప్రతి అవసరాన్నీ ఆర్థిక కోణం నుంచి చూడటం నేర్చుకుంటారు.
ఆర్థిక అక్షరాస్యత అనేది బాల్యం నుంచే మొదలుకావాలంటారు రాబర్ట్ కియోసాకీ తన ‘రిచ్‌డాడ్-పూర్‌డాడ్' పుస్తకంలో. ఆ కథలో ఓ కుర్రాడికి బాగా డబ్బు సంపాదించాలని కోరికగా ఉంటుంది. తండ్రేమో ఎప్పుడూ, ‘కష్టపడి చదువుకో. ర్యాంకు తెచ్చుకో. మంచి కంపెనీలో ఉద్యోగం తెచ్చుకో. అస్సలు రిస్క్ తీసుకోవద్దు' అని పోరుతుంటాడు. తండ్రి చెప్పినట్టే నడుచుకుంటే తాను అప్పుల్లో మునిగితేలే మధ్యతరగతి మనిషిగానే మిగిలిపోతానని ఆ కుర్రాడికి అర్థమైపోతుంది. తనకెలాంటి నాన్న కావాలని కోరుకుంటున్నాడో సరిగ్గా అలాంటి లక్షణాలున్న నాన్న, స్నేహితుడి తండ్రిలో కనిపిస్తాడు. అందుకే అతన్ని తండ్రిలా గౌరవిస్తాడు. ‘రిచ్‌డాడ్' అని వ్యవహరిస్తాడు. ఆయన దగ్గర శిష్యరికం చేస్తాడు. డబ్బు సంపాదించే మెలకువలు నేర్చుకుంటాడు. జీవితంలో గొప్ప స్థానానికి చేరుకుంటాడు. ఈ పుస్తకం లక్షల కాపీలు అమ్ముడుపోయింది. దాదాపుగా ప్రపంచ భాషలన్నిట్లోకీ అనువాదమైంది.
మనలో చాలామంది పెద్దపెద్ద చదువులు చదువుకుని ఉండొచ్చు. కానీ, ఆర్థిక విషయాలకు వచ్చేసరికి తొంభైశాతం మంది నిరక్షరాస్యులే. డబ్బు ఎలా సంపాదించాలో తెలియదు, సంపాదించిన డబ్బును ఎలా రెట్టింపుచేసుకోవాలో తెలియదు. ఎల్‌కేజీ నుంచి పీజీ దాకా ఎక్కడా ‘డబ్బు సంపాదించడం ఎలా' అన్న పాఠం ఉండదు. కన్నవారూ ఆ ప్రయత్నం చేయరు. పిల్లలే చొరవ తీసుకుని ప్రస్తావించినా ‘పసివాడివి, నీకెందుకురా డబ్బు ఆలోచనలు? బాగా చదువుకో' అని మందలిస్తారు. డబ్బు గురించి తెలుసుకోవడం కూడా ఓ చదువే అని గుర్తించరు. ఎవర్నని ఏం లాభం? మన చదువులే అలా ఉన్నాయి. తండ్రులైనా, తండ్రుల తండ్రులైనా అక్షరాలు దిద్దుకుంది ఆ బళ్లోనేగా.
చాలా సందర్భాల్లో పెద్దపెద్ద వ్యాపార సామ్రాజ్యాలు పేకమేడల్లా కూలిపోడానికి కూడా పిల్లల పెంపకంలోని లోపాలే ప్రధాన కారణం. అంతంతమాత్రం చదువులతో అంతంతమాత్రం ఆర్థిక స్థోమతతో డొక్కు సైకిలు మీద జీవితాన్ని ప్రారంభించే తండ్రి..స్కూటరు స్థాయికి, ఆతర్వాత కారు స్థాయికి, ఇంకాపైకెళ్లి చార్టర్డ్ ఫెk్లట్ స్థాయికి చేరుకుంటాడు. పిల్లల్ని ఖరీదైన బోర్డింగ్ స్కూళ్లలో, పెద్దపెద్ద కాలేజీల్లో చదివిస్తాడు. అక్కడ ఎవరూ డబ్బు గురించి వాస్తవాలు బోధించరు. ఎలా సంపాదించాలో, ఎలా కాపాడుకోవాలిో, ఎలా వృద్ధిచేసుకోవాలో చెప్పరు. కన్నతండ్రి కూడా ఎప్పుడూ ఆ ప్రయత్నం చేయడు. బహుశా, క్యాంపస్‌లోనే తన కొడుకు చాలా విషయాలు నేర్చుకున్నాడన్న భ్రమ కావచ్చు. ఆ పట్టాల్ని నమ్మి వ్యాపారం అప్పగిస్తే, కుప్పకూలిపోవడం ఖాయం. కొన్ని కూలిపోయాయి కూడా. ఆ ప్రమాదం రాకూడదనే, విజ్ఞత ఉన్న వ్యాపారవేత్తలు పిల్లలకు ఒక్కసారిగా మొత్తం బాధ్యతలు అప్పగించరు.ప్రాథమిక స్థాయి నుంచి ఒక్కోమెట్టూ ఎక్కి పైకొచ్చేలా జాగ్రత్త పడతారు. ఉక్కు దిగ్గజం లక్ష్మీనివాస్ మిట్టల్ తన కొడుకు ఆదిత్యను పెంచిన తీరే అందుకు ఉదాహరణ. ఆదిత్య హైస్కూలు చదువుల దశలోనే శని, ఆదివారాలు తండ్రి స్టీల్‌ప్లాంట్‌లోని ‘మెల్ట్ షాప్'లో పనిచేసేవాడు. అక్కడ విపరీతమైన వేడి. చెవులు చిట్లిపోయేంత రణగొణ ధ్వనులుంటాయి. సాధారణ కార్మికులు కూడా ఆ విభాగంలిో డ్యూటీ చేయడానికి భయపడతారు. ఆదిత్యకు ఇప్పటికీ ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్‌లో కూర్చోవడం కన్నా, మెల్ట్‌షాప్‌లో గడపడమంటేనే ఇష్టమట. అంటే, మిట్టల్ కంపెనీ షేర్‌హోల్డర్లు ఇంకోతరం దాకా ధైర్యంగా ఉండొచ్చన్నమాట.
ఒకప్పటి ప్రపంచ కుబేరుడు, హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్‌అలీఖాన్ వారసుడు ప్రిన్స్ ముకరంజా ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకుని, ఆస్ట్రేలియాలో సాధారణ జీవితం గడుపుతున్నాడు. లెక్కలేనంత సంపదను వారసత్వంగా ఇచ్చిన ఉస్మాన్ అలీఖాన్, దాన్నెలా కాపాడుకోవాలో అతనికెప్పుడూ చెప్పుండకపోవచ్చు. తండ్రో తాతో ఆర్థిక గురువైతే, ఏ బిడ్డకీ ఇలాంటి పరిస్థితి రాదు.
అనుభవాలే పాఠాలు
కుబేరులెప్పుడూ డబ్బు గురించే ఆలోచిస్తూ ఉంటారనీ నిద్రలోనూ శ్రీమహాలక్ష్మిని కలవరిస్తారనీ చాలామంది భావిస్తారు. అది తప్పు. ధీరూభాయ్ అంబానీ పెద్దపెద్ద కలలు కన్నాడు. వాటిలో ఎక్కడా డబ్బు ప్రస్తావన లేదు. రతన్‌టాటా వాటాదారుల సమావేశంలో లాభనష్టాల వివరాల్ని ఒకటిరెండు మాటల్లో క్లుప్తంగా చెప్పేసి, మిగిలిన సమయమంతా విలువల గురించి వ్యాపారంలో నైతికత గురించే మాట్లాడతారు.ఈ ఇద్దరే కాదు, కోట్లరూపాయల సంపాదనతో కుబేరులైపోయిన వారెవరూ ‘బాగా డబ్బు సంపాదించాలి' అన్న కోరికతో జీవితాల్ని ప్రారంభించలేదు. వాళ్లంతా లక్ష్యాల గురించి ఆలోచించారు. విజయాల గురించి ఆలోచించారు. సవాళ్ల గురించి ఆలోచించారు. ఆ సవాళ్లు నేర్పించే పాఠాల గురించి ఆలోచించారు. ‘సిరితావచ్చిన వచ్చును...' అన్నట్టు సంపదలు, పేరుప్రతిష్ఠలు, పురస్కారాలు వాటంతట అవే పరిగెత్తుకొచ్చాయి. కియోసాకీ పుస్తకంలో ‘రిచ్‌డాడ్' ఓ గొప్ప మాట చెబుతాడు, ‘జీవితాన్ని మించిన గురువు లేడు. ఆ గురువు ఎప్పుడూ మనతో మాట్లాడడు. నీతులు బోధించడు. కానీ అనుభవాల బెత్తం దెబ్బలు వేస్తుంటాడు. ఆ గాయాల నుంచి మనం కొత్త విషయాలు నేర్చుకోవాలి'. ఆర్థిక విజేతలంతా అలాంటి దెబ్బలుతిని రాటుదేలినవారే.
సింటెక్స్' అనగానే నల్లగా నిగనిగలాడే నీటినిల్వ ట్యాంకులే గుర్తుకొస్తాయి. ఏ బ్రాండు ట్యాంకునైనా ‘సింటెక్స్ ట్యాంక్' అని పిలుచుకునేంతగా అవి ప్రజాదరణ పొందాయి. నిజానికి, ఆ సంస్థ యాజమాన్యం ఇలాంటి ట్యాంకుల్ని ఉత్పత్తి చేయాల్సివస్తుందని ఎప్పుడూ వూహించలేదు. మొదట్లో, పారిశ్రామిక అవసరాల కోసం ప్లాస్టిక్ కంటెయినర్లు తయారుచేసే వ్యాపారం వాళ్లది. అందులో తీవ్ర నష్టాలొచ్చాయి. మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లక్షలుపెట్టి కొన్న యంత్రాల్ని ఏం చేసుకోవాలి? అప్పుడే, ఐఐఎమ్ నుంచి పట్టాపుచ్చుకుని ఉద్యోగంలో చేరిన డంగాయచ్ అనే కుర్రాడు యాజమాన్యానికి నీటి ట్యాంకుల ఆలోచన చెప్పాడు. ఆరోజుల్లో అంతా సిమెంటుతో ట్యాంకులు కట్టించుకునేవారు. ఇంజినీర్లు కూడా వాటినే సిఫార్సుచేసేవారు. ప్రారంభంలో కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. చిల్లులుపడతాయనో, నీళ్లు ఖరాబైపోతాయనో ...ఏవో అపోహలు. పాతికేళ్లలో ఆ పరిస్థితుల్ని అధిగమించి సింటెక్స్ నంబర్‌వన్ స్థాయికి ఎదిగింది. డంగాయచ్ ఇప్పుడు ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి. దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న సీర¬వోల్లో ఆయనా ఒకరు.
వారెన్ బఫెట్-
సాధారణ కుటుంబంలో పుట్టాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కోట్లకు పడగలెత్తాడు. ఆస్తిలో చాలా భాగాన్ని గేట్స్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చాడు. దీనివల్ల ప్రపంచ కుబేరులి జాబితాలో ఆయన స్థానం కాస్త మారింది. అయినా, మునుపటికంటే సంతృప్తికరమైన జీవితం గడుపుతున్నాడు.
రామలింగరాజు-
సాధారణ కుటుంబంలో పుట్టాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. సాఫ్ట్‌వేర్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వేల ఎకరాల భూములు సంపాదించాడు. అయినా తృప్తిచెందలేదు. ఇంకా సంపాదించే ప్రయత్నంలో దారితప్పాడు.
డబ్బు అమ్మాయి లాంటిది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేవాళ్లనే ఇష్టపడుతుంది. దొడ్డిదార్లో దగ్గరవ్వాలని ప్రయత్నించేవాళ్లను అసహ్యించుకుంటుంది.
కసితోనో మేడలుకట్టాలన్న కోరికతోనో అడ్డదార్లు తొక్కేవారి బీరువాలోంచి ఎప్పుడు బయటపడతానా అని డబ్బు ఎదురుచూస్తూ ఉంటుంది. అవకాశం దొరగ్గానే, బయటికొచ్చేస్తుంది. సంపదను ఒక బాధ్యతగా, నలుగురి కోసం ఉపయోగపడే సాధనంగా భావించే వ్యక్తుల నట్టింట్లో సిరిదేవి బాసింపట్టు వేసుకుని కూర్చుంటుంది.
డబ్బాట!
పర్వతారోహకుడు ఎవరెస్ట్ శిఖరానికి ప్రయాణం కట్టినట్టు, గజ ఈతగాడు సముద్రాన్ని ఈదినట్టు...సంపాదననీ ఓ ఆటలా భావించేవారే ఆర్థికంగా గొప్ప విజయాలు సాధిస్తారని చెబుతుంది ‘బీ రిచ్ అండ్ హ్యాపీ' పుస్తకం. ఆటన్నాక గెలుపూ ఓటమీ ఉంటాయి. గెలిచినప్పుడు ఎవరైనా మురిసిపోతారు. ఓడిపోతే? మరో ప్రయత్నంలో అయినా గెలిచితీరాలని పట్టుదలగా ప్రయత్నిస్తారు. టెన్నిస్‌లోనో ఇంకో ఆటలోనో పరాజితుడు విజేతతో కరచాలనం చేసి మైదానం నుంచి బయటికి వస్తాడు చూడండి...అంత హుందాగా వైఫల్యాల్ని ఒప్పుకోవాలి. ఓటమికి దూరంగా ఉన్నామంటే, గెలుపుకూ దూరంగా ఉన్నట్టే!
పదిహేనేళ్ల కాలంలో అమితాబ్ బచ్చన్ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది! ఏబీసీ (అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్) నష్టాలపాలైంది. అప్పులు పెరిగాయి. అవకాశాలు తగ్గిపోయాయి. దాదాపు దివాలా పరిస్థితి. డబ్బు జబ్బే ఉంటే, ఎవరైనా ఆ స్థితిలో కుప్పకూలిపోతారు. ఏ పక్షవాతమో గుండెపోటో మింగేస్తుంది. కానీ అమితాబ్ భయపడలేదు. సంపాదనని ఓ ఆటగా తీసుకున్నాడు. మళ్లీ సున్నా స్కోరు నుంచి మొదలుపెట్టాడు. ‘కౌన్‌బనేగా కరోడ్పతి' గేమ్‌షోకు యాంకర్‌గా చేయడానికి అంగీకరించాడు. అదు్భతమైన స్పందన వచ్చింది. మళ్లీ విజయాలు వెతుక్కుంటూ వచ్చాయి. కొడుకూ అందొచ్చాడు. కోడలేమో ప్రపంచ సుందరి. ఇప్పుడు, బచ్చన్ కుటుంబం బ్రాండ్విలువ అక్షరాలా వేయికోట్లని అంచనా.
ఆలోచనలే ప్రాణం-
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి వందేళ్ల క్రితమే ఓ గొప్ప వ్యక్తిత్వవికాస రచన చేశారు. ఆ నవల పేరు ‘మార్గదర్శి'. ఇద్దరు స్నేహితులు జాతరకెళ్తారు. ఒకడి జేబులో ఎంతోకొంత చిల్లర ఉంటుంది. దారిపొడుగునా ఆ కుర్రాడు ఆ డబ్బు ఎలా ఖర్చు చేయాలా అనే ఆలోచిస్తుంటాడు. మరో కుర్రాడి దగ్గర చిల్లిగవ్వకూడా ఉండదు. కానీ ఆలోచనంతా డబ్బు సంపాదన మీదే.తిరిగొచ్చేసమయానికి మొదటి కుర్రాడి జేబులు ఖాళీ అయిపోతాయి. రెండోవాడి జేబులు నాణాలతో నిండిపోతాయి.
తేడా ఎక్కడుంది? ఆలోచనలో.
ఏం ఆలోచించాలన్నదీ మనమే నిర్ణయించుకుంటే, చెత్తాచదారమంతా బుర్రలో తిష్టవేసే ప్రమాదమే ఉండదు.చాలా సందర్భాల్లో తాత్కాలిక లక్ష్యాలు, తాత్కాలిక అవసరాలు .. దారితప్పించే ప్రయత్నం చేస్తుంటాయి. ఆ వలలోంచి బయటపడితేనే, దీర్ఘకాలిక లక్ష్యాల్ని నిర్ణయించుకోగలం. సాధించాలనుకున్నది సాధించగలం. రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అధినేత అంజిరెడ్డి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో...రోజూ ప్రఖ్యాత మందుల కంపెనీ ‘ఫైజర్' కార్యాలయం ముందు నుంచి వెళ్లేవారు. ఆ బోర్డువైపు ఆరాధనగా చూస్తూ ‘ఏదో ఒకరోజు నేనూ ఇలాంటి సంస్థను స్థాపిస్తాను' అనుకునేవారు. ఆ ఆలోచనే అయనను దేశంలోనే రెండో అతిపెద్ద ఫార్మా కంపెనీకి అధినేతను చేసింది. ‘ఏదో ఒకరోజు ఈ సంస్థలో ఉద్యోగం చేయాలి' అనుకుని ఉంటే, ఫలితం మరోలా ఉండేది. అంజిరెడ్డి మహాఅయితే ఎగువ మధ్యతరగతి మనిషిగా మిగిలిపోయేవారు.
మార్కెటింగ్ మంత్రం-
మనదేశంలో కూడా పుస్తకాలు అమ్ముకుని కోట్లు సంపాదించుకోవచ్చని ఐఐటీ పూర్వవిద్యార్థి చేతన్‌భగత్ నిరూపించాడు. ఆ విజయం వెనుక అదు్భతమైన మార్కెటింగ్ నైపుణ్యం ఉంది. చాలామందికి పుస్తకాలు చదవాలనే ఉంటుంది. కానీ పుస్తకాల దుకాణం దాకా వెళ్లి కొనాలంటే బద్ధకం. అందుకే ఆ ఆలోచనే మానుకుంటారు. టీవీ చూస్తూనో, పేపర్ తిరగేస్తూనో కాలక్షేపం చేస్తారు. పుస్తకాల ధర మరో సమస్య. వందలకొద్దీ ఖర్చుచేయడానికి మధ్యతరగతి బడ్జెట్ అస్సలు ఒప్పుకోదు. చేతన్‌భగత్ ఈ రెండు పరిమితుల్నీ దృష్టిలో పెట్టుకుని మార్కెటింగ్ వ్యూహం తయారుచేశాడు. పుస్తకాల్ని పుస్తకాల షాపుల్లోనే ఎందుకమ్మాలి? సూపర్‌మార్కెట్లో ఏ కాల్గెట్ టూత్‌పేస్టు పక్కనో ఎందుకు పెట్టకూడదు? ఆ పుస్తకం ధర వంద రూపాయలలోపే ఉంటే, బడ్జెట్ పద్మనాభం సినిమా టికెట్‌తో పోల్చుకుని...సంతోషంగా కొంటాడుగా! ఆలోచన అదిరింది!! చేతన్‌భగత్ పుస్తకాలు సగటున నిమిషానికొకటి అమ్ముడుపోతున్నాయని అంచనా! ఇలా అతను రెండు కలల్ని నిజం చేసుకున్నాడు. ఒకటి, తనకిష్టమైన రచనా వ్యాసంగాన్ని వృత్తిగా స్వీకరించడం. రెండు, సొంతగడ్డమీదే ఉంటూ హాంకాంగ్లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదించడం. తమ ఐడియాల్ని మార్కెట్ చేసుకున్నవారే విజేతలుగా నిలుస్తారనడానికి చేతన్‌భగత్ అతిపెద్ద ఉదాహరణ. ఫలానా రంగంలో ఉద్యోగం చేస్తేనే బోలెడంత డబ్బు సంపాదించుకోవచ్చనో, ఫలానా వ్యాపారమైతే బంగారు బాతుగుడ్డనో భ్రమిస్తే పొరపాటే. ఏది అదు్భతంగా అమ్ముడుపోతుంది అన్నది ముఖ్యం కాదు. నువ్వేం అదు్భతంగా తయారు చేయగలవు? అదీ ముఖ్యం. మన ఆర్థిక విజయాన్ని నిర్ణయించేదీ ఆ నైపుణ్యమే.
డబ్బు...మన సౌలభ్యం కోసం మనం సృష్టించుకున్న ఓ మారకం, ఓ అవసరం. ఆ సత్యాన్ని గుర్తించాలి. బాల్యం నుంచే పిల్లలకు ఆర్థిక పాఠాలు చెప్పాలి. పెద్దలు కూడా తమ పరిజ్ఞానాన్ని విస్తృతపరుచుకోవాలి. అలా అని డబ్బే లోకమనుకుంటే పొరపాటు. కోట్లకుకోట్లు కూడబెట్టాలనుకోవడం దురాశ. అడ్డదార్లు తొక్కడం అన్నిటికంటే పెద్దతప్పు. ‘అవసరాలకు మించి మన దగ్గరున్న డబ్బు మనది కాదు. ప్రజలది' అంటూ ఎంత సంపాదించుకోవాలనే విషయంలో మహాత్ముడో లక్ష్మణరేఖ గీశాడు. అపార సంపదల్ని సేవాకార్యక్రమాలకు దానమిచ్చిన ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ ఈ సూత్రాన్నే పాటించాడు. కోటీశ్వరులనీ, నవకోటి నారాయణులనీ దైవత్వాన్ని జోడించి మరీ మన పెద్దలు గౌరవించింది ఇలాంటి మనసున్న కుబేరులనే!
మన జేబులో వేయిరూపాయల నోటుంటే...మల్టీప్లెక్స్‌లో మంచి ఇంగ్లిష్ సినిమా చూడొచ్చు. సినిమా అయ్యాక రెస్టారెంట్‌కు వెళ్లొచ్చు. ఇంకో వందో రెండువందలో మిగిలుంటే టాక్సీలో ఇంటికి రావచ్చు. అదే, వేయిరూపాయల నోటుకు బదులుగా చిత్తుకాయితం ఉంటే?
ఎందుకూ పనికిరాదు. ఏమీ కొనుక్కోలేం.
వేయిరూపాయల నోటు అని మనం చెప్పుకునే గులాబీరంగు కాయితానికి మారకపు విలువ ఉంది. ఆ విషయాన్ని ప్రభుత్వం నిర్ధారించింది. ‘మారకం' అంటే మారడం. అవసరమైతే మన దగ్గరున్న డబ్బు, దాని విలువ మేరకు బియ్యంగా మారుతుంది, బిస్కెట్ పొట్లంగా మారుతుంది, సినిమా టికెట్టుగా మారుతుంది, బంగారు నెక్లెస్‌గా మారుతుంది. ‘ఏమిటి గ్యారెంటీ' అంటారా? కావాలంటే చూసుకోండి, ఆ నోటు మీద ‘ఐ ప్రామిస్ టు పే ద బేరర్ సమ్ ఆఫ్ థౌజండ్ రుపీస్' అని మాటిస్తూ రిజర్వు బ్యాంకు గవర్నరు సంతకం చేశారు. మంత్రిగారు హైదరాబాద్లో ఉంటే, ఆయన బామ్మర్ది నియోజకవర్గంలో హల్‌చల్ చేసినట్టు...పైపైన కనిపించే హంగామా కాగితం నోటుదే కానీ, అసలు సిసలు అధికారమంతా బంగారానిదే. ప్రభుత్వం ఓ వందకోట్ల విలువైన నోట్లు విడుదల చేయాలనుకుంటే, ఆ మేరకు బంగారం నిల్వల్ని పక్కనపెట్టాలి. అంటే, ఈ పచ్చకాయితాలు ఆ బంగారానికి ప్రతినిధులు. అందుకే వాటికంత పవరు! మొత్తంగా, మార్కెట్లో చలామణిలో ఉన్న నోట్ల విలువ...రిజర్వు బ్యాంకు దగ్గరున్న బంగారం నిలువకు సమానం!
డబ్బేం చెట్లకు కాస్తుందా? అంటుంటారు చాలామంది. హాస్యానికన్నా, వ్యంగ్యానికన్నా ఆ మాట నిజం. నిజంగానే డబ్బు చెట్లకు కాస్తుంది. అసలు డబ్బే ఒక చెట్టు. చెట్టు పెంచాలంటే ఎంత కష్టపడతాం! మొక్క నాటుతాం. నీళ్లుపోస్తాం. కంచెపెడతాం. ఎరువులేస్తాం. పెరిగి పెద్దయ్యేదాకా కంటిపాపలా కాపాడుకుంటాం. డబ్బు చెట్టు విషయంలోనూ అంత జాగ్రత్త అవసరం.
* రాయిరప్పా పెరగదు. ఇల్లు పెరగదు. కుర్చీ పెరగదు. సృష్టిలోని నిర్జీవుల్లో డబ్బుకు మాత్రమే పెరిగే గుణం ఉంది. ఎంత పెరగాలో కూడా మనమే నిర్ణయించుకోవచ్చు!
* మీ జేబులోని పర్సు ఎంత శుభ్రంగా, క్రమబద్ధంగా ఉంటే...మీరంత ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నట్టు. కుటుంబానికి చక్కని ఇల్లు ఎంత అవసరమో, ఇంటి పెద్దకు నాణ్యమైన పర్సూ అంతే అవసరం. నోట్లు పద్ధతిగా ఉన్నప్పుడు, ఏ నోటు బయటికి తీస్తున్నామో మనకు స్పష్టత ఉంటుంది. పొరపాట్లు జరిగే అవకాశం తక్కువ.
* ఇంట్లోంచి బయటికి కాలుపెడుతున్నప్పుడు జేబులో ఎంత డబ్బుందో ఓసారి చూసుకోవడం ఉత్తమం. బ్యాంకు ఖాతాల్లోని నిల్వల గురించి కూడా ఉజ్జాయింపుగా అయినా తెలిసుండాలి.
* ఆత్మీయులతో వడ్డీ ఆశించే ఆర్థిక లావాదేవీలు వద్దు. అత్యవసర పరిస్థితుల్లో చేబదులు ఇచ్చినా ... తిరిగి రాకపోయినా ఇబ్బందిపడమనుకుని ఇవ్వడమే ఉత్తమం. తిరిగొస్తే సంతోషమే. డబ్బు కారణంగా ఆత్మీయతలూ అభిమానాలూ దెబ్బతినకూడదు.
* ఎవరిచేతికైనా డబ్బు ఇస్తున్నప్పుడు గాజువస్తువంత జాగ్రత్తగా, పసిపాపంత ప్రేమగా అందివ్వాలి. అది ఎదుటి మనిషికిస్తున్న గౌరవం కాదు, డబ్బుకిస్తున్న గౌరవం. ఎప్పుడైనా పొరపాటున అగౌరవ పరిస్తే శ్రీమహాలక్ష్మికి ‘సారీ' చెప్పడానికి సంకోచించకండి.
* కాస్త చాదస్తంగా అనిపించవచ్చుకానీ, రోజువారీ ఖర్చుల వివరాలు ఓచోట రాసుకోవడం మంచి అలవాటు. దీనివల్ల అనవసరమైన వ్యయాలు దొరికిపోతాయి. మరుసటిరోజు జాగ్రత్తపడొచ్చు.
* ఏ కుటుంబానికైనా ఈ ఆరూ ముఖ్యం...అనుకోని అవాంతరాలు ఎదురైనప్పుడు ఆదుకోడానికి రిజర్వు మనీ, చిన్నదో పెద్దదో మనకంటూ ఒక ఇల్లు, పిల్లల పెద్దచదువులకు ఎంతోకొంత పొదుపు, ఇంటిల్లిపాదికీ ఆరోగ్య బీమా, మనంలేనప్పుడు కూడా మనలోటు తెలియకుండా గణనీయమైన మొత్తంలో టర్మ్‌పాలసీ, వృద్ధాప్యం సాఫీగా సాగిపోడానికి పింఛను నిధి.
* పొదుపు రెండు రకాలు. ఒకటేమో, ఖర్చుపెట్టగా మిగిలింది పొదుపు చేయడం. రెండు, పొదుపు చేయగా మిగిలింది ఖర్చుపెట్టడం. రెండోదే ఉత్తమ మార్గం.