రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

ఉగాది



హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది పండుగనాడే నూతన సంవత్సరంగా పరిగణిస్తారు. అయితే సూర్య, చంద్రాదుల సంచారాన్ని ప్రాతిపదికగా తీసుకునే హిందువుల క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది ఈ పండుగ వివిధ రోజుల్లో వస్తుంటుంది. చైత్రమాసంతో కొత్త శకం ప్రారంభవుతుంది. ఆ రోజునే ఉగాదిగా గుర్తించడం జరిగింది.

ఈ పండుగను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే... మహారాష్ట్రలో 'గుడిపాడ్వా' పేరుతో పిలుస్తారు. అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పాలి.

ఉదయాన్నే లేచి శుచీశుభ్రంగా స్నానమాచరించి.. ఇంటిల్లిపాది గుడిలోనో.. లేక ఇంటిలోనో పూజలు వంటివి చేస్తారు. తమ జీవితాలు పది కాలాల పాటు చల్లగా ఉండేలా దీవించమని అశేష శ్రద్ధాభక్తులతో భగవంతునికి సాంప్రదాయబద్దంగా సహస్రనామార్చనలతో ఆరాధిస్తారు. అంతేకాకుండా... సుఖదు:ఖాలు, ఆనంద, విషాదాలకు ప్రతీకగా నిలిచే షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ఆ రోజు ఇంటిల్లిపాది సేవిస్తారు.

ఉగాది పచ్చడి...

ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనంతో తయారుచేసే శ్రేష్టమైన పదార్ధమే ఉగాది పచ్చడి. ఆధ్యాత్మిక పరంగా ఈ పచ్చడికి ఎంత ప్రాముఖ్యత ఉందో... ఆహార, ఆరోగ్యం పరంగాను అంతే ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. ఈ పచ్చడి సేవించడం ద్వారా దివ్యమైన ఆరోగ్యం కలుగుతుందని వైద్యనిపుణులు కూడా సూచిస్తున్నారు.

తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రకాల రుచులు కలపి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. కొత్తసహస్రాబ్ధికి ప్రారంభ శుభ సూచకంగా భావించే ఈ రోజు నుంచి సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను, ఆనందవిషాదాలను సంయమనంతో, సానుకూలంగా స్వీకరించాలన్న సందేశమే ఉగాది పచ్చడిలోని ఆంతర్యం.

ఈ పచ్చడి తయారీ చేయడం కోసం చెరకు, మామిడి పిందెలు, అరటి పళ్ళు, చింతపండు, వేప పువ్వు, బెల్లం, జామకాయలు మొదలగునవి వాడుతుండటం ఆనవాయితీ.

మనకు తెలుగు సంవత్సరాలు 'ప్రభవ'తో మొదలుపెట్టి 'అక్షయ'నామ సంవత్సరము వరకు గల 60సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో,రెండుసార్లో చుస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి 'షష్టిపూర్తి' ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు.

పంచాంగ శ్రవణం
'తిధిర్వారంచనక్షత్రం యోగ: కరణమేవచ పంచాంగమ్‌'
తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం పంచాంగం. ఉగాది నాడు దేవాలయంలోగాని, గ్రామకూడలి ప్రదేశాల్లోగాని, పండితుల, సిద్థాంతుల సమక్షంలో కందాయఫలాలు స్థూలంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు ఉగాది నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడియున్నది.

'పంచాంగస్యఫలం శృణ్వన్‌ గంగాస్నానఫలంఖిలేత్'
ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి.
'పంచాంగం' అంటే అయిదు అంగములు అని అర్ధం. తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనేవి ఆ అయిదు అంగాలు. పాడ్యమి మొదలుకొని 15 తిధులు,7వారాలు, అశ్వని మొదలుకొని రేవతి వరకు 27 నక్షత్రములు, విష్కభం మొదలుకొని వైధృతి వరకు 27 యోగములు, బవ మొదలుకొని కింస్తుఘ్నం వరకు, 11 కరణములు వున్నాయి. వీటన్నిటినీ తెలిపేదే 'పంచాంగం'. పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.