రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

ప్రేమకు కారణాలు ఉండవు


బుజ్జి ....నాలో ఏం చూసి ప్రేమించావు నువ్వు?' గోముగా అడిగింది భారతి.


‘బుజ్జి....' అనేది మాటవరసకు పెట్టిన పేరేగానీ... ఆ స్థానంలో ఉండే ప్రతి ప్రేమికుడికీ ఏదో ఒక దశలో ఎదురయ్యే ప్రశ్నే ఇది. ప్రేమని మాటల్లో వర్ణించడమే కష్టం అనుకుంటే ‘నన్నెందుకు ప్రేమించావు' అని అవతలి వ్యక్తి అడిగితే ఠక్కున సమాధానం చెప్పడం మరీ కష్టం.

కృష్ణశాస్త్రి అంతటివాడే...

సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?

చంద్రికలనేల వెదజల్లు చందమామ?

ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?

ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?

...అంటూ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక చేతులెత్తేశాడు. ఇక, మామూలు మనుషుల సంగతి చెప్పేదేముంది. ప్రేమ ఎప్పుడు ఎవరిమీద ఎందుకు కలుగుతుందో ఎవరూ చెప్పలేరు. అందం, తెలివి, డబ్బు, కులం, హోదా... వేటితోనూ దానికి పని ఉండదు. మనసైన మనిషి కనపడగానే హృదయస్పందన పెరుగుతుంది. ఎదలోతుల్లో ఏదో తీయని భావం అలజడి రేపుతుంది. ఒకరికొకరు సన్నిహితంగా ఉండాలనే తహతహ పెరుగుతుంది. ప్రియురాలిని/ప్రియుడిని విడిచిపెట్టి వెళ్లాలంటే ప్రాణంపోయినంత బాధ కలుగుతుంది.

ఎందుకిలా అవుతుందంటే... ‘అప్పుడు శరీరంలో అనేక రసాయనమార్పులు జరుగుతాయి. అడ్రినలిన్‌, ఆక్సిటోసిన్‌ హార్మోన్లు స్రవిస్తాయి...' అంటూ సైంటిస్టులు రకరకాల కబుర్లు చెప్పొచ్చుగాక! కానీ అవన్నీ ప్రత్యేకంగా ఒకరిని చూసినప్పుడు మాత్రమే ఎందుకు కలుగుతాయి, అందరికీ సాధారణంగా కనిపించే వ్యక్తి ఒకరికి మాత్రమే అంత ప్రత్యేకంగా ఎందుకు కన్పిస్తారూ... అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం ఉండదు. ప్రేమికులు మాత్రం ఇట్టే చెప్పేస్తారు... ‘ప్రేమకు కారణాలు ఉండవు' అని!