రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

ఆదర్శ దాంపత్యం

భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థకు ఒక ప్రధాన స్థానముంది. భార్యాభర్తలుగా ఇద్దరు స్త్రీ, పురుషులు కలసిమెలసి జీవిస్తూ తమ స్వార్థం కోసమేకాక సామాజిక శ్రేయస్సు కోసం పాటుపడాలని ఒక్కోసారి ఎంతటి కష్టాన్నైనా సహించాలని అని అంటోంది. మన వివాహ ధర్మం. ఇదే విషయాన్ని పార్వతీ పరమేశ్వరులపరంగా కూడా భాగవత పురాణం ఎనిమిదో స్కందం వివరించి చెబుతోంది.

దేవదానవులంతా క్షీరసాగరాన్ని మధించే వేళ ముందుగా హాలాహలం పుట్టింది. దాని వేడికి సకల లోకాలూ తల్లడిల్లసాగాయి. అది సర్వత్రా వ్యాపించింది. జింకలా గంతువేసింది, పాములా పాకింది, సింహంలా దూకింది, పక్షిలా ఎగిరింది, ఒక్కోసారి ఏనుగు లాగా కదలకుండా ఒకచోటే నిలిచింది. దాంతో అనేక జీవరాసులు తల్లడిల్లాయి. ఆ పరిస్థితి చూసి దేవతలంతా ఓచోట చేరి సమస్య పరిష్కారానికి శివుడొక్కడే శరణ్యమని నిర్ధరించారు. ఆ వెంటనే అంతా కలిసి కైలాసానికి బయలుదేరి వెళ్ళి పరమశివుడికి హాలాహలం వల్ల కలుగుతున్న ప్రమాదాన్ని గురించి వివరించి చెప్పారు. శివుడు పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. వెంటనే ఆయన తన ఇల్లాలు పార్వతీదేవి వంక చూసి ఇలా అన్నాడు ‘శక్తి కల్గిన ప్రభువు ఇలాంటివారి కష్టాలు తొలగించాలి. అప్పుడే ఆ లోక నాయకుడికి కీర్తి కలుగుతుంది. ప్రాణభయంతో ఆశ్రయించిన ప్రాణులను కాపాడటం ప్రజాపాలకుల కర్తవ్యం. పాలకులు ప్రజల ప్రాణాల రక్షణ విషయంలో వెనకడుగు వేయకూడదు. ప్రాణాలు క్షణభంగురాలని, ఇతరుల ప్రాణరక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించటమే ఉత్తమమని ప్రభువులు భావించాలి. పరులకు సహాయం చేయటం కోసం నడుం బిగించేవారికి ఎప్పటికీ తిరుగుండదు. పరోపకారమే పరమోత్తమ ధర్మం.

అందుకే ఓ పార్వతీ ఈ హాలాహలాన్ని దండించాలనుకొంటున్నాను. తియ్య తియ్యని పండ్ల రసంలాగా దీన్ని ఆరగిస్తాను. లోకాలలోని ప్రాణులన్నిటినీ కాపాడతాను' అని చెప్పి ‘మరి నీవే మంటావ'ని పార్వతిని అడిగాడు పరమశివుడు.

పార్వతి పరమేశ్వరుడికి తగిన ఇల్లాలు... ఆమె జగన్మాత. ఈశ్వరుడు లోకజనుల ప్రాణరక్షణ కోసం వెళతానని అన్నందుకు ఆమె ఏమాత్రమూ బాధపడలేదు. తన స్వార్థాన్ని ఆలోచించలేదు. స్వార్థం కన్నా లోక ప్రజల ప్రాణ రక్షణే మిన్న అని ఆమె కూడా భావించింది. పరమేశ్వరుడిని ‘మీ మనస్సుకు ఎలాతోస్తే అలా చేయమ'ని అంది. శివుడు హాలాహలాన్ని మింగటానికి పూనుకున్నాడు. ‘ఓ లోక ద్రోహీ! ఇక వ్యాపించకు... ఇకరా...' అంటూ హాలాహలాన్ని చేయి చాచి లాగి పట్టుకుని కబళంగా చేసి నేరేడు పండు తిన్నంత సులభంగా విలాసంగా తినేశాడు. ఆ విషాగ్నిని ఆయన ఆహ్వానించేటప్పుడు, దాని కబళంగా చేసేటప్పుడు నోట్లో వేసుకుని తిని మింగేటప్పుడు ఆయన ఏమీ చికాకు పడలేదు. శరీరం మీది సర్పాలు కదల్లేదు. చమటలు పట్టటం కానీ, కళ్ళు ఎర్రబడటం కానీ, సిగలోని చంద్రుడు కందటం కానీ, ముఖం వాడిపోవటం కానీ ఏమీ జరగలేదు. కానీ ఆయన ఉదరంలో సమస్తలోకాలూ ఉన్నందువల్ల ఆ విషాగ్నిని పూర్తిగా నమిలి మింగేస్తే ఆ లోకాలన్నిటికీ ప్రమాదమని తెలిసి దాన్ని తన గొంతులోనే ఉంచుకున్నాడు శివుడు. ఆ స్థితిని చూసి విష్ణువు, బ్రహ్మ, పార్వతి, దేవేంద్రుడు లాంటి వారంతా ఎంతో మెచ్చుకున్నారు.

పార్వతీ పరమేశ్వరులు ఆదర్శ దాంపత్యానికి ఓ చక్కని ఉదాహరణగా ఈ కథా ఘట్టం పేర్కొంటుంది. శివుడు ప్రజలను రక్షించాలని ముందుకెళ్ళేటప్పుడు ఆయన భార్య పార్వతీదేవి తన భర్త నిర్ణయాన్ని తప్పుపట్టలేదు. తన భర్తకు ఏమైనా అవుతుందోమోనని శంకించలేదు. పరోపకారం కోసం ఎంతటి త్యాగానికైనా ప్రభువు ఒడిగట్టటాన్ని ఆమె సమర్థించింది. ఇలాంటి ఆదర్శ దంపతులు ప్రజాపాలకులలో ఉంటే నేటి సమాజంలో అవినీతి, ప్రాణభయం లాంటివి ప్రజలకు లేకుండా పోతాయి. పార్వతికి పరమేశ్వరుడు చెప్పిన మాటల్లోని సారాన్ని భర్తలు,పార్వతి సమర్థన తీరును ఇల్లాళ్ళు అనుసరిస్తే సమాజమంతా పరోపకార బుద్ధి కలిగన వారితో నిండి విశ్వశాంతి వర్ధిల్లుతుంది. ఇది ఈ కథలోని సామాజిక సందేశం. అయితే పురాణపరంగా చూస్తే హాలాహల భక్షణం అనే ఈ కథను సంతోషంగా విన్నా, రాసినా, చదివినా భయానికి గురికారు. పాములు, తేళ్ళు, అగ్నిలాంటి వాటివల్ల కష్టాలు కలగవనేది ఈ కథకు సంబంధించిన ఫలశ్రుతి అని భాగవతం చెబుతోంది.