రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

లాఫర్స్ క్లబ్

'రాత్రింబవళ్ళు వేధించే ఒత్తిళ్ళ మధ్య రోజూ కాసేపైనా నవ్వలేకపోతే నేను ఎప్పుడో మరణించి ఉండేవాణ్ణి ' అన్నారు అబ్రహాం లింకన్. ఇది సత్యం. ఈ సత్యాన్ని వంటపట్టించుకున్న మనిషి డాక్టర్ మదన్ కటారియా. తానే కాదు తన నగర ప్రజలకు... కాదు.. రాష్ట్ర ప్రజలకు... కాదు.. కాదు.. ఈ దేశ ప్రజలకు... ఊహు! కాదు... కాదు... ప్రపంచానికే నవ్వుల టానిక్ ని పంచాడీ డాక్టర్. 1995 మార్చి 13 న తెల్లవారు ఝామునే లేచిన ఆయనకు ఎందుకో నవ్వు వచ్చింది. దాని గురించి ఆలోచిస్తుండగా ఆయనకు అమెరికాకు చెందిన నార్మన్ కజిన్స్ అనే ఆయన రాసిన 'అనాటమీ ఆఫ్ ఏన్ ఇల్ నెస్' అనే పుస్తకం గుర్తుకొచ్చింది. అందులో తన వెన్నుముకకు వచ్చిన వ్యాధి నవ్వుతో ఎలా నయమయిందో కజిన్స్ వివరంగా రాశాడు. కాలిఫోర్నియా లిండా యూనివర్శిటీకి చెందిన డాక్టర్ లీ.ఎస్.బెర్క్ శరీరానికి వత్తిడికి కలిగించే హార్మోన్లను కట్టడిచేసి వ్యాధి నిరోధకశక్తిని పెరగడానికి నవ్వు సరైన మందుగా తన పరిశోధనలలో వెల్లడయిందని పేర్కొంటూ ఒక పరిశోధన గ్రంథం రాశాడు.

ఈ విషయాలన్నీ తన 'మేరా డాక్టర్' అన్న పత్రికలో రాస్తే పాఠకులు నవ్వు గొప్పదనాన్ని తెలుసుకుంటారనిపించింది డాక్టర్ మదన్ కి. కానీ ఆ వెంటనే తన పత్ర్రిక ఎంతమంది చదువుతారు? చదివినా తన వ్యాసం ఎవరు చదువుతారు? చదివినా ఎంతమంది దీన్ని ఆచరణలో పెడతారని... ఇలా చాలా సందేహాలొచ్చాయి. అలా ఆలోచిస్తూనే ఆయన రోజూ వెళ్ళే ఉదయపు వ్యాహ్యాళికి అదేనండి! మార్నింగ్ వాక్ కి బయిలుదేరాడు. అలవాటుగా వెళ్ళే లోఖండ్ వాలా కాంప్లెక్స్ లోని పబ్లిక్ గార్డెన్స్ కి వెళ్ళాడు. అక్కడ ఇంకా ఆయన లాంటి వాళ్ళు చాలామంది చేరారు. వాళ్ళందరినీ పిలిచి తనకొచ్చిన ఆలోచనలన్నీ వివరంగా చెప్పి రోజూ కొంతసేపైనా తనివి తీరా హాయిగా నవ్వుకుంటే ఆరోగ్యం దివ్యంగా ఉంటుందని మందులతో పని ఉండదని చెప్పాడు. ఇదంతా నవ్వులాటగా తీసుకున్న కొందరు వెళ్ళిపోగా, చెప్పేది డాక్టర్ కదా ఇదేమిటో చూద్దాం అని కొంతమందే మిగిలారు.

వాళ్ళకు మదన్ ఒక జోక్ చెప్పాడు. అందరూ హాయిగా వవ్వారు. ఒకటి తర్వాత మరొకటిగా జోకులు పేల్చాడు. అందరికీ నవ్వనే ఔషధం పంచి, ఇక ఇంటికెళ్ళండి. ఈ రోజంతా మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని పిస్క్రిప్షన్ రాసిచ్చినంత ధీమాగా హామీ ఇచ్చేశాడు. అందులోని నిజాన్ని అనుభవించిన వాళ్ళందరూ మర్నాటి నుంచి తాము కూడా జోకులు చెప్పి అందర్నీ నవ్వించడమే పనిగా పెట్టుకున్నారు. ఆరోగ్య ఫలితాలు అనుభవించారు.

అలా ముంబయిలోని అంధేరీ ప్రాంతంలో 1995 మార్చి 13 న లాఫర్స్ క్లబ్ ఏర్పడింది. తరవాత్తరవాత కేవలం జోకులే కాకుండా నవ్వును ఒక యోగ ప్రక్రియలా సాధన చెయ్యడం ప్రారంభించారు. నెమ్మదిగా ఈ క్లబ్ కి ముంబయి నగరమంతా, రాష్ట్రమంతా, దేశమంతా శాఖలు ఏర్పడ్డాయి. మానసిక, శారీరిక రుగ్మతలకు దివ్యౌషధమైన నవ్వు విశిష్టతను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఈ లాఫర్స్ క్లబ్ సభ్యులు. మనం కూడా హాయిగా, మనసారా నవ్వుకుందాం! రోగాలను దూరం చేద్దాం!