ఇక్కడ చాలామంది విజ్ఞులున్నారు .వారికి తెలిసే వుంటుంది .అలా తెలియని వారి కోసం పెళ్ళిలోని కొన్ని ముఖ్య ఘట్టాలను నాకు తెలిసినంతలో వివరిస్తాను .ఇది నాకు తెలిసిన పరిధి కాబట్టి తప్పులుంటే , క్షమించగలరని మనవి.
పెళ్ళిలో ముందుగా వరుడి చేత గణపతి పూజ చేయించి గణపతిని oఆహ్వానిస్తారు .కలశ పూజ చేసి లక్ష్మి సమేతుడైన మహా విష్ణువును ఆహ్వానిస్తే ,ఆయన వివాహం అయ్యేవరకు కలశమందు ఉండి వధూవరులనాశీర్వదిస్తాడు .విష్ణువుతో ,గరుడుడూ ,మరియు సప్త ఋషులు ,అష్టదిక్పాలకులు మొదలగు rదేవతలంతా ఆయన వెన్నంటి ఉండి వధూవరులను ఆశీర్వదిస్తారు .
ఇరువైపులా తల్లితండ్రు లుండి పట్టుచీరతో ,పూలజడతో ,బంగారు ఆభరణాలతో ,బాసికంతో (భ్రూమధ్యం పై అందరి దృష్టి పడకుండా నుదుట కట్టేది ) అలంకరించిన వధువును పీటల మీదికి తీసుకొస్తారు .సుముహూర్తం వరకూ వధూవరులిరువురి మధ్యా తెరనుంచుతారు .వధువును లక్ష్మీ స్వరూపంగానూ ,వరుని సాక్షాత్ విష్ణు స్వరూపంగా భావించి కాళ్ళు కడిగి ,బంగారము వంటి మనసు కలదీ ,బంగారు ఆభరణాలతో అలంకరించ బడినదీ ఐన ఈ కన్యను పంచ భూతముల సాక్షిగా ,బ్రహ్మాదులూ మున్నగు దేవతల సాక్షిగా నీకు దానం చేయుచున్నాను అని వరుని చేతిలో అమ్మాయి చేతినుంచి దోసిలిలో కొబ్బరి బొండాం ఉంచి పాలు పోస్తూ తల్లి తండ్రులు కన్యాదానం చేస్తారు .
వరునిచేత ధర్మ ,అర్ధ ,కామములందు cఈమెను విడిచి జీవనము సాగించనని ,ప్రమాణం చేయిస్తారు .నాతి చరామి అంటూ వరుడు ప్రమాణం స్వీకరిస్తాడు .అలాగే ధర్మ ,అర్ధ ,కామములందు ,సంతానోత్పత్తి ప్రక్రియ లందునూ నిన్ననుసరించి మసలుకుంటానని వదువుచేత ప్రమాణము చేయించి సుముహూర్తములో వధూవరుల చేత ఒకరి తలపై మరొకరు నూరిన జీలకర్ర ,బెల్లము ముద్దను పెట్టిస్తారు .నూరిన జీలకర్ర ,బెల్లము విడిపోకుండా ఉన్నట్లే ఇరువురూ అన్యోన్యంగా జీవించాలని భావము .తర్వాత తెర తొలగించి ఒకరినొకరు చూసుకుంటారు .
మాంగల్య దేవతను ఆహ్వానించి గౌరీ దేవిని ,మంగళ సూత్రాలను పూజించి ,ముత్తైదువులచె మాంగల్యాన్ని ఆశీర్వదింప చేసి ,వరునిచే మాంగల్య ధారణ చేయిస్తారు . నా జీవన గమనానికి హేతువైన మంగళ సూత్రము నీకు కడుతున్నాను .నూరేళ్ళు మనము కలిసే జీవించేదము గాక !అని కోరుకుంటూ వరుడు సూత్ర ధారణ చేస్తాడు .
తలంబ్రాలు !పెళ్ళిలో వదూవరులకే కాకుండా చూసేవారికి కూడా ఉత్సాహాన్నిచ్చే ఘట్టం .కోరిన సంతానము సమృద్ధిగా లభించును గాక అంటూ .వధువు పోస్తే , ఆనందమూ ,కోరికను , సత్యమును కలిసి అనుభవింతుము .సంపదలను,వంశాన్ని వృద్ధి చేసుకోనేదము గాక అంటూ వరుడు పోస్తాడు .ఇరువురూ ఉత్సాహంగా తలంబ్రాలు పోసుకుంటారు .కలిసిన
బంధానికి గుర్తుగా బ్రహ్మ ముడి వేస్తారు .కొంతమంది ఉంగరాలు తీయిస్తారు . బంగారు ఉంగరమూ,వెండి చుట్టూ వేసి . ..తీయమంటారు .ఇది స్పర్శ తాలూకు సాన్నిహిత్యం వల్ల వధూవరుల మధ్య బిడియాన్ని పోగొట్టి ప్రేమను చిగురింప చేయుట కొరకు ఉద్దేశించబడినది అయివుండొచ్చు .
మట్టెలు తొడిగించి వధువు చిటికెన వేలు పట్టుకుని ఏడడుగులు నడుస్తారు. ఏడడుగులునడిచి స్నీహితురాలివయ్యావ్ ,అట్లే ఎడబాటు లేకుండా పరస్పరం ప్రేమతో అనుకూల దాంపత్యాన్ని కలిగిఉందాము అని వరుడు అంటాడు .
ఏడడుగులు..ఒకటి అన్న సమృద్ధి కొరకు ,రెండవది బలము కొరకు ,మూడవది వ్రత ఫలము కొరకు ,నాల్గవది వ్రతాది కారము కొరకు , ఐదవది పశుసమృద్ది కొరకు , ఆరవది వంశాభివృద్ధి కొరకు ,ఏడవది ఋత్విజాదుల నిచ్చుటకు విష్ణువును ప్రార్ధిస్తూ ఏడడుగులు నడుస్తారు.
అరుంధతి నక్షత్ర దర్శనం పెళ్ళి వేడుక పూర్తయ్యాక వధూవరులిరువురి చేత అరుంధతి దర్శనం చేయిస్తారు.అరుంధతిని ఆధారంగా చేసుకొని మిగతా నక్షత్ర గమనం ఉంటుంది.అట్లే నాపతి ఇంటిలో నేను స్థిరముగా ఉండి నీవలెనే కీర్తి పొందునట్లు ఆశీర్వదించమని కోరుకొని నమస్కరిస్తారు . అంతటితో వివాహం లోని ముఖ్య ఘట్టాలు పూర్తయినట్లే .
అసలు పూర్వం వివాహం పదహారు రోజులు దాదాపు ముప్ఫై అంశాలతో కూడుకున్నదై ఉండేదట.తర్వాత ఐదు రోజులు,.....మూడు రోజులు ............ ఇప్పుడు దాన్ని మరీ కుదించి జరుపుతున్నారు. ఇది కూడా కాదనుకుంటే మన ముందు తరాలకు ఎటువంటి అనుభూతిని మిగల్చగలం ?వివాహం ఓ అందమైన వేడుక .ఆ మధురమైన అనుభూతిని సాంప్రదాయాన్ని,పదిలంగా ముందు తరాలకు అందిద్దాం .