రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

వరలక్ష్మీ వ్రతము రోజున ఎలా పూజ చేయాలి

శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే "శుక్రవారం" నాడు జరుపుకునే "వరలక్ష్మీ వ్రతము"ను తొలుత పార్వతీ దేవి, పరమేశ్వరునిచే ఉపదేశము పొంది ఈ వ్రత ఫలితంగా సుబ్రహ్మణ్య స్వామిని పొందినట్ల పురాణాలు చెబుతున్నాయి.
అంతేగాకుండా చరిత్రలో ప్రసిద్ధిగాంచిన నందుడు, విక్రమార్కుడు ఈ వ్రతమాచరించి సింహానాధికారము పొందినట్లు గాధలు కలవు. అలాగే ఈ వ్రతమును ఆచరించే స్త్రీలకు అయిదోతనము, సౌభాగ్యము, సంతానప్రాప్తి వంటి సర్వశుభములు కలుగుతాయని పురోహితులు అంటున్నారు.
అట్టి మహిమాన్వితమైన "వరలక్ష్మీ వ్రతము" ఆచరించాలనుకునే స్త్రీలు ఉదయం ఐదింటికే నిద్రలేచి, శుచిగా తలస్నానమాచరించాలి. పూజామందిరమును, ఇంటిని శుభ్రం చేసి గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరమును రంగ వల్లికలతో అలంకరించుకోవాలి.
తెలుపు రంగు దుస్తులు ధరించి పూజకు ఉపయోగపడు పటాలను గంధము, కుంకుమలతో అలంకరించుకోవాలి. శ్రీలక్ష్మీదేవి (ఆకుపచ్చనిచీరతో) ఉన్న ఫోటోనుగానీ లేదా వెండితో తయారు చేసిన శ్రీలక్ష్మీ ప్రతిమనుగాని పూజకు సిద్ధం చేసుకోవాలి. కలశమును సిద్ధం చేసుకుని, దానిపై తెల్లటి వస్త్రమును కప్పాలి. ఎర్రటి అక్షతలు, గులాబి పువ్వులు, పద్మములు, ఎర్ర కలువపూలు వంటి పుష్పాలను పూజకు ఉపయోగించుకోవచ్చు. అలాగే నైవేద్యానికి బొంబాయి రవ్వతో కేసరిబాత్, రవ్వలడ్డులు, జామకాయలు వంటివి సమర్పించుకోవచ్చు.
పూజకు ముందు లక్ష్మీ అష్టోత్తరము, మహాలక్ష్మీ అష్టకము, కనకధారస్తవము, శ్రీలక్ష్మీ సహస్రనామము, వరలక్ష్మీ వ్రత కథ వంటి స్త్రోత్రములతో అమ్మవారిని స్తుతించవచ్చు. లేదా "ఓం మహాలక్ష్మీదేవ్యై నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది.
శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి వరలక్ష్మీ పూజ చేయవచ్చు. దీపారాధనకు రెండు దీపాలు, ఆరు ప్లస్ ఆరు తామర వత్తులతో దీపమెలిగించాలి. దీపారాధనకు కొబ్బరినూనెను వాడటం చాలా మంచిది. నుదుటన ఎర్రటి కుంకుమ ధరించి, ఈశాన్యము దిక్కున తిరిగి పూజచేయాలి. పూజ పూర్తవ్వగానే ఇరుగుపొరుగు స్త్రీలను పిలిపించుకుని మహిళలు తాంబూలముతో పాటు పండ్లు, దుస్తులతో వాయనమివ్వాలని పురోహితులు చెబుతున్నారు.
అలాగే అష్టలక్ష్మీదేవాలయాలు, లక్ష్మీదేవాలయాలను దర్శించుకున్న వారికి సకలసంపదలు చేకూరుతాయని విశ్వాసం. ఇంకా ఆలయాల్లో శ్రీలక్ష్మీ అష్టోత్తరనామపూజ, వరలక్ష్మీవ్రతము, శ్రీలక్ష్మీ కోటికుంకుమార్చన, శ్రీలక్ష్మీ సహస్రనామ పారాయణ, పంచామృతాభిషేకము వంటి పూజాకార్యక్రమాలు చేయించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.