రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

ప్రత్యక్ష దైవానికి మరో విడిది "ద్వారకా తిరుమల"


నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో... తిరుమల శిఖరాలు దిగివచ్చునో... మముగన్న మాయమ్మ అలివేలు మంగ.. పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ.. స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ..." అంటూ భక్త జనావళి స్వామివారి కరుణ తమమీద ఉండేలా చూడాలని అమ్మవారికి విన్నవించుకోవటం మామూలే..! అయితే ఈ అయ్యవారిని ఏడుకొండలూ ఎక్కి చూడలేకపోతేనేం.. స్వయంభువుగా ప్రత్యక్షమైన చిన్న తిరుపతి అయ్యవారి కరుణ తమమీద ఉంటే చాలదా అన్నట్లుగా పరమ పవిత్రమైన "ద్వారకా తిరుమల"ను పశ్చిమగోదావరి వాసులు దర్శించుకుంటుంటారు.

ఏలూరు పట్టణం నుంచి 42 కిలోమీటర్ల దూరంలోనున్న శేషాద్రి కొండపైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు "ద్వారకా తిరుమల"లో కొలువుదీరి ఉన్నారు. స్వయంభువుగా ప్రత్యక్షమైన స్వామివారిని చీమలపుట్ట నుంచి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ఆలయానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చనట్లు పూర్వీకుల కథనం. సుదర్శన క్షేత్రమైన ఈ ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా కూడా ప్రసిద్ధి చెంది.. అశేష భక్త జనావళి నీరాజనాలు అందుకుంటోంది.

"తిరుమల" స్వామివారికి మ్రొక్కిన మ్రొక్కును "చిన్న తిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే చిన్నతిరుపతిలో తీర్చుకునేందుకు మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని భక్తులు, స్థానికులు ప్రగాడంగా నమ్ముతుంటారు. ఇక్కడ స్వామివారిని కలియుగ వైకుంఠ వాసునిగా భావించి సేవిస్తారు. తిరుపతికి వెళ్ళలేని భక్తులు తమ ముడుపులను, తలనీలాలను, మొక్కుబడులను ఇక్కడ సమర్పిస్తే తిరుపతి స్వామివారికి చెందుతాయని భావిస్తారు.
అజమహారాజు స్వయంవరం..!
బ్రహ్మపురాణం ఆధారంగా, శ్రీరామచంద్రుడి తాతగారు అజమహారాజు తన వివాహం కోసం స్వామివారిని సేవించారు. ఆయన ఇందుమతి స్వయంవరానికి వెళుతూ.. మార్గమధ్యంలో ఉన్న ద్వారకా తిరుమలలో ఆగి స్వామివారిని దర్శించుకోకుండానే వెళ్లిపోయారట. ఇందుమతి అజమహారాజును పెళ్లి...

ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. అయితే ఆ మునికి ప్రత్యక్షమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు దక్షిణాభిముఖుడై ఉన్నాడట. అందుకనే.. ఈ ఆలయంలో మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉండటం విశేషంగా చెప్పవచ్చు. అలాగే ఒకే విమాన శిఖరం క్రింద రెండు విగ్రహాలు ఉండటం ఇక్కడి మరో విశేషం. ఒక విగ్రహం సంపూర్ణమైనదిగా, రెండవది స్వామివారి పై భాగం మాత్రమే కనిపించేటట్లుగా ఉండే అర్థవిగ్రహంగా ఉంటుంది.

స్థల పురాణం ప్రకారం చూస్తే... ద్వారకా తిరుమల క్షేత్రం శ్రీరాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదిగా భావిస్తున్నారు. ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాద సేవను కోరారట. దాంతో స్వామివారి పాదములను మాత్రమే పూజించే భాగ్యం అతడికి దక్కింది. అందుకే మనకు నేడు స్వామివారి పై భాగం మాత్రమే దర్శనమిస్తుంది.

అయితే.. విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారనీ... అప్పుడు భక్తులందరి విన్నపాలను స్వీకరించిన ఆయన స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధృవమూర్తికి వెనుకవైపు పీఠంపై.. వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్టించారని చెబుతుంటారు.

అందుకే.. స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే శ్రీ వేంకటేశ్వర ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ.. ఆ తరువాత ప్రతిష్టింపబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్థ కామపురుషార్ధములు సమకూరుతాయనీ భక్తులు నమ్ముతుంటారు.

పురాణ గాథల ప్రకారం ఆలయ చరిత్రను చూసినట్లయితే... బ్రహ్మపురాణం ఆధారంగా, శ్రీరామచంద్రుడి తాతగారు అజమహారాజు తన వివాహం కోసం స్వామివారిని సేవించారు. ఆయన ఇందుమతి స్వయంవరానికి వెళుతూ.. మార్గమధ్యంలో ఉన్న ద్వారకా తిరుమలలో ఆగి స్వామివారిని దర్శించుకోకుండానే వెళ్లిపోయారట. ఇందుమతి అజమహారాజును పెళ్లి చేసుకున్నప్పటికీ.. స్వయంవరానికి వచ్చిన ఇతర రాజులు ఆయనపై దాడి చేస్తారు.

తాను మార్గమధ్యలో స్వామివారిని దర్శించుకోకుండా వెళ్లినందుకే ఇలా జరిగిందని భావించిన అజమహారాజు శ్రీవేంకటేశ్వరుని క్షమించమని ప్రార్థిస్తాడు. అంతటితో ఆ అలజడి ఆగిపోయిందట. అత్యంత ప్రాచీన చరిత్రగల ఈ ఆలయం కృతయుగం నుంచి ఉందనేందుకు ఇదో చక్కని నిదర్శనంగా చెప్పవచ్చు.

ఇక.. ద్వారకా తిరుమలలోని స్వామి వారికి అభిషేకం చేయకపోవటం మరో విశేషంగా చెప్పవచ్చు. ఎందుకంటే.. స్వామివారిపై ఒక చిన్న నీటి బొట్టుపడినా.. అది స్వామివారి విగ్రహం క్రిందనుండే ఎర్రచీమలను కదుల్చుతుందని అభిషేకం చేయరు. గుడి సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ, ఆశ్వయుజ మాసాలలో రెండు కళ్యాణోత్సవాలు జరుపుతుంటారు. ఎందుకంటే.. స్వామివారు స్వయంభువుగా వైశాఖ మాసంలో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజ మాసంలో ప్రతిష్టించిన కారణంగా అలా చేస్తుంటారు.