రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

భక్తులకు అదనంగా ప్రసాదం

 తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అదనంగా పొందడానికి భక్తులు అధిక సంఖ్యలో పోటీపడ్డారు. తిరుమల, తిరుపతి దేవస్థానం ఒక్కో భక్తుడికి అదనంగా నాలుగు లడ్డూలు వంతున విక్రయించే కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించింది. లడ్డూ ప్రసాదం పొందడానికి భక్తులు ఉత్సాహంగా క్యూలైన్లలో రాత్రి వరకు కూడా బారులు తీరి కనిపించారు. ఎలాంటి సిఫార్సు లేకుండా లడ్డూలు పొందగలిగామనే సంతృప్తి వారిలో కనిపించింది. ఇది వరకు లడ్డూ పడి టిక్కెట్లు జారీ చేసే కేంద్రాల నుంచి టిక్కెట్లు ఇస్తున్నారు. టిక్కెట్లు పొందిన భక్తులు లడ్డూ వితరణ కేంద్రంలో ఏ కౌంటరు నుంచైనా ప్రసాదం పొందే అవకాశం కల్పించారు. రాత్రి వరకు 50 వేల వరకు లడ్డూలను యాత్రికులకు విక్రయించారు.

ఉప్పి పిండి

కావలసిన పదార్ధాలు :
బియ్యం పిండి పావు కిలో
ఆరు పచ్చిమిర్చి
ఆవాలు తగినంత
జీల్లకర్ర తగినంత
ఉప్పు తగినంత
సన్నగా తరిగిన ఉల్లిపాయ
సన్నగా తరిగిన ఒక టమాట
ఒక కొత్తిమీర కట్ట
రెండు చెంచాల నూనె
ఒక టేబుల్ స్పూన్ పసుపు

తయారుచేసే విదానం :
ముందుగా ఒక బాణలిలో నూనె వేసి తరువాత ఆవాలు, జీల్లకర్ర, ఉల్లిపాయలు, టమాట, పసుపు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి వేయించాలి. అవి వేగినాక మూడు చిన్న గ్లాసుల నీళ్లు పోసి కొద్దిగా మరగనివ్వాలి. తరువాత ఉప్పు వేసి కలిపి బియ్యంపిండిని వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి (ఇలా చాల సేపు కలుపుతూ ఉండాలి) పిండి ఉడికిన తరువాత పొడి పొడి అయ్యేలాగా వేయించాలి. ఇది చల్లారిన తరువాత పెరుగులో గాని పల్లీల పచ్చడితో గాని నంజుకొని తింటే చాలా బాగుంటుంది.

ఎవరైనా కావచ్చు...


అందరూ కలలుగంటారు. అందరూ కష్టపడతారు. అందరూ సంపాదిస్తారు.కానీ కొందరే, సంపన్నులవుతారు. ఎందుకు? ఆర్థిక విజేతల్లో కనిపించే అరుదైన లక్షణాలే అందుకు కారణమంటున్నారు నిపుణులు. వాటిని ఒంటబట్టించుకుంటే ఎవరైనా కావచ్చు... కరోడ్పతి!
‘ఆయన కోటీశ్వరుడు'
...గౌరవంగా చూస్తాం.
‘ఆ కారు ఖరీదు యాభైలక్షలు'
...రెప్పవాల్చడం కూడా మరచిపోతాం.
‘ఆమెకు ఆన్‌లైన్‌ లాటరీలో కోటిరూపాయలొచ్చాయి'
...కళ్లల్లో నిప్పులు పోసుకుంటాం.
‘అదిగో, వెయ్యి రూపాయల నోటు!'
ఆశగా తలతిప్పుతాం.
అది డబ్బు పవర్‌. కరెన్సీ ప్రభావం. శ్రీమహాలక్ష్మి మహత్యం.
సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు, డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు కాకపోవచ్చు. కానీ, ఏదో ఒక సందర్భంలో ఆర్థిక సంబంధాలు మానవసంబంధాల్ని ప్రభావితం చేస్తాయి. ఎవరైనా ‘నాకు డబ్బు మీద ఆసక్తిలేదు' అన్నారంటే...సంపాదించడం చేతకాదని ఒప్పేసుకున్నారని అర్థం.

మీరు డబ్బును ప్రేమించే వ్యక్తుల జాబితాలో ఉండవచ్చు. ద్వేషించే వ్యక్తుల జాబితాలోనైనా ఉండవచ్చు. ఏ జాబితాలో ఉన్నా, బతికున్నంతకాలం డబ్బు అవసరాన్ని కాదనలేరు. ఇది నిజం. బతకడానికి సరిపడా ఆక్సిజన్‌లా, అవసరాలకు తగినంత కరెన్సీ ఉండితీరాలి. అలా అని, డబ్బున్నంత మాత్రాన సుఖంగా ఉంటామని ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేరు. కానీ డబ్బులేకపోతే కష్టాలపాలవుతామన్నది మాత్రం అక్షర సత్యం. అందుకే, డబ్బంటే అంత ఆరాటం. తరాలకు సరిపడా సంపాదించుకోవాలన్న తహతహ. ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా బొమ్మలు గీసినా పుస్తకాలు రాసినా...అంతా డబ్బు కోసమే. తృప్తి, ఆనందం, కళాభిమానం...ఎవరెన్ని కారణాలు చెప్పినా అన్నీ కరెన్సీ తర్వాతే.
వందకోట్ల జనాభాలో ఓ పదిమంది ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం సంపాదిస్తారు. ఓ వందమంది దేశంలోని శ్రీమంతుల లిస్టులో ఉంటారు. లక్షమందో, పదిలక్షలమందో కోటీశ్వరులని అనిపించుకుంటారు. మిగతావాళ్లంతా మామూలు మనుషులు. ఒకటో తేదీ ఎప్పుడొస్తుందా అని మిగిలిన ఇరవైతొమ్మిది రోజులూ ఎదురుచూసే సగటు జీవులు.
ఎందుకిలా?
కొంతమందే సంపన్నులు కావడం ఏమిటి, మిగతావాళ్లంతా మధ్యతరగతి జీవులుగానో నిరుపేదలుగానో మిగిలిపోవడం ఏమిటి? అసలు, డబ్బు సంపాదించడానికి అర్హతలేమిటి?
తెలివితేటలా, శ్రమా, అదృష్టమా.
తెలివైనవాళ్లు మాత్రమే బాగా డబ్బు సంపాదిస్తారనడానికి ఎలాంటి ఆధారాల్లేవు. సంపన్నులంతా మేధావులు కారు. మేధావులంతా సంపన్నులు కారు.కష్టపడేగుణముంటే, కోటీశ్వరులు కావచ్చనీ బల్లగుద్ది చెప్పలేం. చెమటే కొలమానమైతే, కరెన్సీ మున్ముందుగా శ్రమజీవుల్నే వరించాలి. అలాంటి దాఖలాలేం లేవు. అదృష్టానికీ డబ్బుకూ కూడా ముడిపెట్టలేం. బిల్‌గేట్స్‌, వారెన్‌ బఫెట్‌, నారాయణమూర్తి... వీళ్లెవర్నీ సిరిసంపదలు అయాచితంగా వరించలేదు. రాత్రికిరాత్రే ఎవరూ సంపన్నులైపోలేదు. అంటే...పూర్తిగా తెలివితేటలే కాదు. పూర్తిగా శ్రమే కాదు. పూర్తిగా అదృష్టమూ కాదు. ఇంకేవో లక్షణాలున్నాయి. అవే కుబేరుల్ని తయారుచేస్తాయి. అవి, కన్నవారో గురువులో ఒంటబట్టించినవి కావచ్చు, ఎవరికివారే తీర్చిదిద్దుకున్నవీ కావచ్చు. ఆర్థిక వికాస సాహిత్యాన్ని ఓ మలుపుతిప్పిన రాబర్ట్‌ కియోసాకీ కూడా ఈ మాట నిజమేనంటున్నారు.

బాల్యమే పునాది...
‘నాన్నా! నాకు కంప్యూటర్‌ కావాలి'
‘మనదగ్గర అంత డబ్బు లేదమ్మా. మనం మధ్యతరగతి మనుషులం. పెద్దపెద్ద కోరికలు ఉండకూడదు'...తెలిసోతెలియకో పిల్లల ఆశల్ని బలవంతంగా చిదిమేస్తాం. అలా కాకుండా ఆ కంప్యూటర్‌ ధర ఎంతో, తమ సంపాదన ఎంతో, దాన్ని కొనాలంటే అదనంగా ఇంకెంత సంపాదించాలో వివరంగా చెబితే...పిల్లలు తప్పకుండా అర్థంచేసుకుంటారు. ప్రతి సమస్యనీ ప్రతి అవసరాన్నీ ఆర్థిక కోణం నుంచి చూడటం నేర్చుకుంటారు.
ఆర్థిక అక్షరాస్యత అనేది బాల్యం నుంచే మొదలుకావాలంటారు రాబర్ట్‌ కియోసాకీ తన ‘రిచ్‌డాడ్-పూర్‌డాడ్' పుస్తకంలో. ఆ కథలో ఓ కుర్రాడికి బాగా డబ్బు సంపాదించాలని కోరికగా ఉంటుంది. తండ్రేమో ఎప్పుడూ, ‘కష్టపడి చదువుకో. ర్యాంకు తెచ్చుకో. మంచి కంపెనీలో ఉద్యోగం తెచ్చుకో. అస్సలు రిస్క్‌ తీసుకోవద్దు' అని పోరుతుంటాడు. తండ్రి చెప్పినట్టే నడుచుకుంటే తాను అప్పుల్లో మునిగితేలే మధ్యతరగతి మనిషిగానే మిగిలిపోతానని ఆ కుర్రాడికి అర్థమైపోతుంది. తనకెలాంటి నాన్న కావాలని కోరుకుంటున్నాడో సరిగ్గా అలాంటి లక్షణాలున్న నాన్న, స్నేహితుడి తండ్రిలో కనిపిస్తాడు. అందుకే అతన్ని తండ్రిలా గౌరవిస్తాడు. ‘రిచ్‌డాడ్' అని వ్యవహరిస్తాడు. ఆయన దగ్గర శిష్యరికం చేస్తాడు. డబ్బు సంపాదించే మెలకువలు నేర్చుకుంటాడు. జీవితంలో గొప్ప స్థానానికి చేరుకుంటాడు. ఈ పుస్తకం లక్షల కాపీలు అమ్ముడుపోయింది. దాదాపుగా ప్రపంచ భాషలన్నిట్లోకీ అనువాదమైంది.

మనలో చాలామంది పెద్దపెద్ద చదువులు చదువుకుని ఉండొచ్చు. కానీ, ఆర్థిక విషయాలకు వచ్చేసరికి తొంభైశాతం మంది నిరక్షరాస్యులే. డబ్బు ఎలా సంపాదించాలో తెలియదు, సంపాదించిన డబ్బును ఎలా రెట్టింపుచేసుకోవాలో తెలియదు. ఎల్‌కేజీ నుంచి పీజీ దాకా ఎక్కడా ‘డబ్బు సంపాదించడం ఎలా' అన్న పాఠం ఉండదు. కన్నవారూ ఆ ప్రయత్నం చేయరు. పిల్లలే చొరవ తీసుకుని ప్రస్తావించినా ‘పసివాడివి, నీకెందుకురా డబ్బు ఆలోచనలు? బాగా చదువుకో' అని మందలిస్తారు. డబ్బు గురించి తెలుసుకోవడం కూడా ఓ చదువే అని గుర్తించరు. ఎవర్నని ఏం లాభం? మన చదువులే అలా ఉన్నాయి. తండ్రులైనా, తండ్రుల తండ్రులైనా అక్షరాలు దిద్దుకుంది ఆ బళ్లోనేగా.
చాలా సందర్భాల్లో పెద్దపెద్ద వ్యాపార సామ్రాజ్యాలు పేకమేడల్లా కూలిపోడానికి కూడా పిల్లల పెంపకంలోని లోపాలే ప్రధాన కారణం. అంతంతమాత్రం చదువులతో అంతంతమాత్రం ఆర్థిక స్థోమతతో డొక్కు సైకిలు మీద జీవితాన్ని ప్రారంభించే తండ్రి..స్కూటరు స్థాయికి, ఆతర్వాత కారు స్థాయికి, ఇంకాపైకెళ్లి చార్టర్డ్‌ ఫెk్లట్‌ స్థాయికి చేరుకుంటాడు. పిల్లల్ని ఖరీదైన బోర్డింగ్ స్కూళ్లలో, పెద్దపెద్ద కాలేజీల్లో చదివిస్తాడు. అక్కడ ఎవరూ డబ్బు గురించి వాస్తవాలు బోధించరు. ఎలా సంపాదించాలో, ఎలా కాపాడుకోవాలిో, ఎలా వృద్ధిచేసుకోవాలో చెప్పరు. కన్నతండ్రి కూడా ఎప్పుడూ ఆ ప్రయత్నం చేయడు. బహుశా, క్యాంపస్‌లోనే తన కొడుకు చాలా విషయాలు నేర్చుకున్నాడన్న భ్రమ కావచ్చు. ఆ పట్టాల్ని నమ్మి వ్యాపారం అప్పగిస్తే, కుప్పకూలిపోవడం ఖాయం. కొన్ని కూలిపోయాయి కూడా. ఆ ప్రమాదం రాకూడదనే, విజ్ఞత ఉన్న వ్యాపారవేత్తలు పిల్లలకు ఒక్కసారిగా మొత్తం బాధ్యతలు అప్పగించరు.ప్రాథమిక స్థాయి నుంచి ఒక్కోమెట్టూ ఎక్కి పైకొచ్చేలా జాగ్రత్త పడతారు. ఉక్కు దిగ్గజం లక్ష్మీనివాస్‌ మిట్టల్‌ తన కొడుకు ఆదిత్యను పెంచిన తీరే అందుకు ఉదాహరణ. ఆదిత్య హైస్కూలు చదువుల దశలోనే శని, ఆదివారాలు తండ్రి స్టీల్‌ప్లాంట్‌లోని ‘మెల్ట్‌ షాప్‌'లో పనిచేసేవాడు. అక్కడ విపరీతమైన వేడి. చెవులు చిట్లిపోయేంత రణగొణ ధ్వనులుంటాయి. సాధారణ కార్మికులు కూడా ఆ విభాగంలిో డ్యూటీ చేయడానికి భయపడతారు. ఆదిత్యకు ఇప్పటికీ ఎయిర్‌ కండిషన్డ్‌ క్యాబిన్‌లో కూర్చోవడం కన్నా, మెల్ట్‌షాప్‌లో గడపడమంటేనే ఇష్టమట. అంటే, మిట్టల్‌ కంపెనీ షేర్‌హోల్డర్లు ఇంకోతరం దాకా ధైర్యంగా ఉండొచ్చన్నమాట.
ఒకప్పటి ప్రపంచ కుబేరుడు, హైదరాబాద్ నిజాం మీర్‌ ఉస్మాన్‌అలీఖాన్‌ వారసుడు ప్రిన్స్‌ ముకరంజా ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకుని, ఆస్ట్రేలియాలో సాధారణ జీవితం గడుపుతున్నాడు. లెక్కలేనంత సంపదను వారసత్వంగా ఇచ్చిన ఉస్మాన్‌ అలీఖాన్‌, దాన్నెలా కాపాడుకోవాలో అతనికెప్పుడూ చెప్పుండకపోవచ్చు. తండ్రో తాతో ఆర్థిక గురువైతే, ఏ బిడ్డకీ ఇలాంటి పరిస్థితి రాదు.

అనుభవాలే పాఠాలు
కుబేరులెప్పుడూ డబ్బు గురించే ఆలోచిస్తూ ఉంటారనీ నిద్రలోనూ శ్రీమహాలక్ష్మిని కలవరిస్తారనీ చాలామంది భావిస్తారు. అది తప్పు. ధీరూభాయ్‌ అంబానీ పెద్దపెద్ద కలలు కన్నాడు. వాటిలో ఎక్కడా డబ్బు ప్రస్తావన లేదు. రతన్‌టాటా వాటాదారుల సమావేశంలో లాభనష్టాల వివరాల్ని ఒకటిరెండు మాటల్లో క్లుప్తంగా చెప్పేసి, మిగిలిన సమయమంతా విలువల గురించి వ్యాపారంలో నైతికత గురించే మాట్లాడతారు.ఈ ఇద్దరే కాదు, కోట్లరూపాయల సంపాదనతో కుబేరులైపోయిన వారెవరూ ‘బాగా డబ్బు సంపాదించాలి' అన్న కోరికతో జీవితాల్ని ప్రారంభించలేదు. వాళ్లంతా లక్ష్యాల గురించి ఆలోచించారు. విజయాల గురించి ఆలోచించారు. సవాళ్ల గురించి ఆలోచించారు. ఆ సవాళ్లు నేర్పించే పాఠాల గురించి ఆలోచించారు. ‘సిరితావచ్చిన వచ్చును...' అన్నట్టు సంపదలు, పేరుప్రతిష్ఠలు, పురస్కారాలు వాటంతట అవే పరిగెత్తుకొచ్చాయి. కియోసాకీ పుస్తకంలో ‘రిచ్‌డాడ్' ఓ గొప్ప మాట చెబుతాడు, ‘జీవితాన్ని మించిన గురువు లేడు. ఆ గురువు ఎప్పుడూ మనతో మాట్లాడడు. నీతులు బోధించడు. కానీ అనుభవాల బెత్తం దెబ్బలు వేస్తుంటాడు. ఆ గాయాల నుంచి మనం కొత్త విషయాలు నేర్చుకోవాలి'. ఆర్థిక విజేతలంతా అలాంటి దెబ్బలుతిని రాటుదేలినవారే.
సింటెక్స్‌' అనగానే నల్లగా నిగనిగలాడే నీటినిల్వ ట్యాంకులే గుర్తుకొస్తాయి. ఏ బ్రాండు ట్యాంకునైనా ‘సింటెక్స్‌ ట్యాంక్‌' అని పిలుచుకునేంతగా అవి ప్రజాదరణ పొందాయి. నిజానికి, ఆ సంస్థ యాజమాన్యం ఇలాంటి ట్యాంకుల్ని ఉత్పత్తి చేయాల్సివస్తుందని ఎప్పుడూ వూహించలేదు. మొదట్లో, పారిశ్రామిక అవసరాల కోసం ప్లాస్టిక్‌ కంటెయినర్లు తయారుచేసే వ్యాపారం వాళ్లది. అందులో తీవ్ర నష్టాలొచ్చాయి. మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లక్షలుపెట్టి కొన్న యంత్రాల్ని ఏం చేసుకోవాలి? అప్పుడే, ఐఐఎమ్‌ నుంచి పట్టాపుచ్చుకుని ఉద్యోగంలో చేరిన డంగాయచ్‌ అనే కుర్రాడు యాజమాన్యానికి నీటి ట్యాంకుల ఆలోచన చెప్పాడు. ఆరోజుల్లో అంతా సిమెంటుతో ట్యాంకులు కట్టించుకునేవారు. ఇంజినీర్లు కూడా వాటినే సిఫార్సుచేసేవారు. ప్రారంభంలో కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. చిల్లులుపడతాయనో, నీళ్లు ఖరాబైపోతాయనో ...ఏవో అపోహలు. పాతికేళ్లలో ఆ పరిస్థితుల్ని అధిగమించి సింటెక్స్‌ నంబర్‌వన్‌ స్థాయికి ఎదిగింది. డంగాయచ్‌ ఇప్పుడు ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి. దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న సీర¬వోల్లో ఆయనా ఒకరు.

వారెన్‌ బఫెట్‌- 
సాధారణ కుటుంబంలో పుట్టాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కోట్లకు పడగలెత్తాడు. ఆస్తిలో చాలా భాగాన్ని గేట్స్‌ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చాడు. దీనివల్ల ప్రపంచ కుబేరులి జాబితాలో ఆయన స్థానం కాస్త మారింది. అయినా, మునుపటికంటే సంతృప్తికరమైన జీవితం గడుపుతున్నాడు.

రామలింగరాజు- 
సాధారణ కుటుంబంలో పుట్టాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. సాఫ్ట్‌వేర్‌ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వేల ఎకరాల భూములు సంపాదించాడు. అయినా తృప్తిచెందలేదు. ఇంకా సంపాదించే ప్రయత్నంలో దారితప్పాడు.

డబ్బు అమ్మాయి లాంటిది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేవాళ్లనే ఇష్టపడుతుంది. దొడ్డిదార్లో దగ్గరవ్వాలని ప్రయత్నించేవాళ్లను అసహ్యించుకుంటుంది.

కసితోనో మేడలుకట్టాలన్న కోరికతోనో అడ్డదార్లు తొక్కేవారి బీరువాలోంచి ఎప్పుడు బయటపడతానా అని డబ్బు ఎదురుచూస్తూ ఉంటుంది. అవకాశం దొరగ్గానే, బయటికొచ్చేస్తుంది. సంపదను ఒక బాధ్యతగా, నలుగురి కోసం ఉపయోగపడే సాధనంగా భావించే వ్యక్తుల నట్టింట్లో సిరిదేవి బాసింపట్టు వేసుకుని కూర్చుంటుంది.

డబ్బాట!
పర్వతారోహకుడు ఎవరెస్ట్‌ శిఖరానికి ప్రయాణం కట్టినట్టు, గజ ఈతగాడు సముద్రాన్ని ఈదినట్టు...సంపాదననీ ఓ ఆటలా భావించేవారే ఆర్థికంగా గొప్ప విజయాలు సాధిస్తారని చెబుతుంది ‘బీ రిచ్‌ అండ్ హ్యాపీ' పుస్తకం. ఆటన్నాక గెలుపూ ఓటమీ ఉంటాయి. గెలిచినప్పుడు ఎవరైనా మురిసిపోతారు. ఓడిపోతే? మరో ప్రయత్నంలో అయినా గెలిచితీరాలని పట్టుదలగా ప్రయత్నిస్తారు. టెన్నిస్‌లోనో ఇంకో ఆటలోనో పరాజితుడు విజేతతో కరచాలనం చేసి మైదానం నుంచి బయటికి వస్తాడు చూడండి...అంత హుందాగా వైఫల్యాల్ని ఒప్పుకోవాలి. ఓటమికి దూరంగా ఉన్నామంటే, గెలుపుకూ దూరంగా ఉన్నట్టే!

పదిహేనేళ్ల కాలంలో అమితాబ్‌ బచ్చన్‌ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది! ఏబీసీ (అమితాబ్‌ బచ్చన్‌ కార్పొరేషన్‌) నష్టాలపాలైంది. అప్పులు పెరిగాయి. అవకాశాలు తగ్గిపోయాయి. దాదాపు దివాలా పరిస్థితి. డబ్బు జబ్బే ఉంటే, ఎవరైనా ఆ స్థితిలో కుప్పకూలిపోతారు. ఏ పక్షవాతమో గుండెపోటో మింగేస్తుంది. కానీ అమితాబ్‌ భయపడలేదు. సంపాదనని ఓ ఆటగా తీసుకున్నాడు. మళ్లీ సున్నా స్కోరు నుంచి మొదలుపెట్టాడు. ‘కౌన్‌బనేగా కరోడ్పతి' గేమ్‌షోకు యాంకర్‌గా చేయడానికి అంగీకరించాడు. అదు్భతమైన స్పందన వచ్చింది. మళ్లీ విజయాలు వెతుక్కుంటూ వచ్చాయి. కొడుకూ అందొచ్చాడు. కోడలేమో ప్రపంచ సుందరి. ఇప్పుడు, బచ్చన్‌ కుటుంబం బ్రాండ్విలువ అక్షరాలా వేయికోట్లని అంచనా.

ఆలోచనలే ప్రాణం-
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి వందేళ్ల క్రితమే ఓ గొప్ప వ్యక్తిత్వవికాస రచన చేశారు. ఆ నవల పేరు ‘మార్గదర్శి'. ఇద్దరు స్నేహితులు జాతరకెళ్తారు. ఒకడి జేబులో ఎంతోకొంత చిల్లర ఉంటుంది. దారిపొడుగునా ఆ కుర్రాడు ఆ డబ్బు ఎలా ఖర్చు చేయాలా అనే ఆలోచిస్తుంటాడు. మరో కుర్రాడి దగ్గర చిల్లిగవ్వకూడా ఉండదు. కానీ ఆలోచనంతా డబ్బు సంపాదన మీదే.తిరిగొచ్చేసమయానికి మొదటి కుర్రాడి జేబులు ఖాళీ అయిపోతాయి. రెండోవాడి జేబులు నాణాలతో నిండిపోతాయి.

తేడా ఎక్కడుంది? ఆలోచనలో.

ఏం ఆలోచించాలన్నదీ మనమే నిర్ణయించుకుంటే, చెత్తాచదారమంతా బుర్రలో తిష్టవేసే ప్రమాదమే ఉండదు.చాలా సందర్భాల్లో తాత్కాలిక లక్ష్యాలు, తాత్కాలిక అవసరాలు .. దారితప్పించే ప్రయత్నం చేస్తుంటాయి. ఆ వలలోంచి బయటపడితేనే, దీర్ఘకాలిక లక్ష్యాల్ని నిర్ణయించుకోగలం. సాధించాలనుకున్నది సాధించగలం. రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ అధినేత అంజిరెడ్డి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో...రోజూ ప్రఖ్యాత మందుల కంపెనీ ‘ఫైజర్‌' కార్యాలయం ముందు నుంచి వెళ్లేవారు. ఆ బోర్డువైపు ఆరాధనగా చూస్తూ ‘ఏదో ఒకరోజు నేనూ ఇలాంటి సంస్థను స్థాపిస్తాను' అనుకునేవారు. ఆ ఆలోచనే అయనను దేశంలోనే రెండో అతిపెద్ద ఫార్మా కంపెనీకి అధినేతను చేసింది. ‘ఏదో ఒకరోజు ఈ సంస్థలో ఉద్యోగం చేయాలి' అనుకుని ఉంటే, ఫలితం మరోలా ఉండేది. అంజిరెడ్డి మహాఅయితే ఎగువ మధ్యతరగతి మనిషిగా మిగిలిపోయేవారు.

మార్కెటింగ్ మంత్రం-
మనదేశంలో కూడా పుస్తకాలు అమ్ముకుని కోట్లు సంపాదించుకోవచ్చని ఐఐటీ పూర్వవిద్యార్థి చేతన్‌భగత్‌ నిరూపించాడు. ఆ విజయం వెనుక అదు్భతమైన మార్కెటింగ్ నైపుణ్యం ఉంది. చాలామందికి పుస్తకాలు చదవాలనే ఉంటుంది. కానీ పుస్తకాల దుకాణం దాకా వెళ్లి కొనాలంటే బద్ధకం. అందుకే ఆ ఆలోచనే మానుకుంటారు. టీవీ చూస్తూనో, పేపర్‌ తిరగేస్తూనో కాలక్షేపం చేస్తారు. పుస్తకాల ధర మరో సమస్య. వందలకొద్దీ ఖర్చుచేయడానికి మధ్యతరగతి బడ్జెట్‌ అస్సలు ఒప్పుకోదు. చేతన్‌భగత్‌ ఈ రెండు పరిమితుల్నీ దృష్టిలో పెట్టుకుని మార్కెటింగ్ వ్యూహం తయారుచేశాడు. పుస్తకాల్ని పుస్తకాల షాపుల్లోనే ఎందుకమ్మాలి? సూపర్‌మార్కెట్లో ఏ కాల్గెట్‌ టూత్‌పేస్టు పక్కనో ఎందుకు పెట్టకూడదు? ఆ పుస్తకం ధర వంద రూపాయలలోపే ఉంటే, బడ్జెట్‌ పద్మనాభం సినిమా టికెట్‌తో పోల్చుకుని...సంతోషంగా కొంటాడుగా! ఆలోచన అదిరింది!! చేతన్‌భగత్‌ పుస్తకాలు సగటున నిమిషానికొకటి అమ్ముడుపోతున్నాయని అంచనా! ఇలా అతను రెండు కలల్ని నిజం చేసుకున్నాడు. ఒకటి, తనకిష్టమైన రచనా వ్యాసంగాన్ని వృత్తిగా స్వీకరించడం. రెండు, సొంతగడ్డమీదే ఉంటూ హాంకాంగ్లో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గా సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదించడం. తమ ఐడియాల్ని మార్కెట్‌ చేసుకున్నవారే విజేతలుగా నిలుస్తారనడానికి చేతన్‌భగత్‌ అతిపెద్ద ఉదాహరణ. ఫలానా రంగంలో ఉద్యోగం చేస్తేనే బోలెడంత డబ్బు సంపాదించుకోవచ్చనో, ఫలానా వ్యాపారమైతే బంగారు బాతుగుడ్డనో భ్రమిస్తే పొరపాటే. ఏది అదు్భతంగా అమ్ముడుపోతుంది అన్నది ముఖ్యం కాదు. నువ్వేం అదు్భతంగా తయారు చేయగలవు? అదీ ముఖ్యం. మన ఆర్థిక విజయాన్ని నిర్ణయించేదీ ఆ నైపుణ్యమే.
డబ్బు...మన సౌలభ్యం కోసం మనం సృష్టించుకున్న ఓ మారకం, ఓ అవసరం. ఆ సత్యాన్ని గుర్తించాలి. బాల్యం నుంచే పిల్లలకు ఆర్థిక పాఠాలు చెప్పాలి. పెద్దలు కూడా తమ పరిజ్ఞానాన్ని విస్తృతపరుచుకోవాలి. అలా అని డబ్బే లోకమనుకుంటే పొరపాటు. కోట్లకుకోట్లు కూడబెట్టాలనుకోవడం దురాశ. అడ్డదార్లు తొక్కడం అన్నిటికంటే పెద్దతప్పు. ‘అవసరాలకు మించి మన దగ్గరున్న డబ్బు మనది కాదు. ప్రజలది' అంటూ ఎంత సంపాదించుకోవాలనే విషయంలో మహాత్ముడో లక్ష్మణరేఖ గీశాడు. అపార సంపదల్ని సేవాకార్యక్రమాలకు దానమిచ్చిన ప్రపంచ కుబేరుడు వారెన్‌ బఫెట్‌ ఈ సూత్రాన్నే పాటించాడు. కోటీశ్వరులనీ, నవకోటి నారాయణులనీ దైవత్వాన్ని జోడించి మరీ మన పెద్దలు గౌరవించింది ఇలాంటి మనసున్న కుబేరులనే!

మన జేబులో వేయిరూపాయల నోటుంటే...మల్టీప్లెక్స్‌లో మంచి ఇంగ్లిష్‌ సినిమా చూడొచ్చు. సినిమా అయ్యాక రెస్టారెంట్‌కు వెళ్లొచ్చు. ఇంకో వందో రెండువందలో మిగిలుంటే టాక్సీలో ఇంటికి రావచ్చు. అదే, వేయిరూపాయల నోటుకు బదులుగా చిత్తుకాయితం ఉంటే?
ఎందుకూ పనికిరాదు. ఏమీ కొనుక్కోలేం.
వేయిరూపాయల నోటు అని మనం చెప్పుకునే గులాబీరంగు కాయితానికి మారకపు విలువ ఉంది. ఆ విషయాన్ని ప్రభుత్వం నిర్ధారించింది. ‘మారకం' అంటే మారడం. అవసరమైతే మన దగ్గరున్న డబ్బు, దాని విలువ మేరకు బియ్యంగా మారుతుంది, బిస్కెట్‌ పొట్లంగా మారుతుంది, సినిమా టికెట్టుగా మారుతుంది, బంగారు నెక్లెస్‌గా మారుతుంది. ‘ఏమిటి గ్యారెంటీ' అంటారా? కావాలంటే చూసుకోండి, ఆ నోటు మీద ‘ఐ ప్రామిస్‌ టు పే ద బేరర్‌ సమ్‌ ఆఫ్‌ థౌజండ్ రుపీస్‌' అని మాటిస్తూ రిజర్వు బ్యాంకు గవర్నరు సంతకం చేశారు. మంత్రిగారు హైదరాబాద్లో ఉంటే, ఆయన బామ్మర్ది నియోజకవర్గంలో హల్‌చల్‌ చేసినట్టు...పైపైన కనిపించే హంగామా కాగితం నోటుదే కానీ, అసలు సిసలు అధికారమంతా బంగారానిదే. ప్రభుత్వం ఓ వందకోట్ల విలువైన నోట్లు విడుదల చేయాలనుకుంటే, ఆ మేరకు బంగారం నిల్వల్ని పక్కనపెట్టాలి. అంటే, ఈ పచ్చకాయితాలు ఆ బంగారానికి ప్రతినిధులు. అందుకే వాటికంత పవరు! మొత్తంగా, మార్కెట్లో చలామణిలో ఉన్న నోట్ల విలువ...రిజర్వు బ్యాంకు దగ్గరున్న బంగారం నిలువకు సమానం!

డబ్బేం చెట్లకు కాస్తుందా? అంటుంటారు చాలామంది. హాస్యానికన్నా, వ్యంగ్యానికన్నా ఆ మాట నిజం. నిజంగానే డబ్బు చెట్లకు కాస్తుంది. అసలు డబ్బే ఒక చెట్టు. చెట్టు పెంచాలంటే ఎంత కష్టపడతాం! మొక్క నాటుతాం. నీళ్లుపోస్తాం. కంచెపెడతాం. ఎరువులేస్తాం. పెరిగి పెద్దయ్యేదాకా కంటిపాపలా కాపాడుకుంటాం. డబ్బు చెట్టు విషయంలోనూ అంత జాగ్రత్త అవసరం.
* రాయిరప్పా పెరగదు. ఇల్లు పెరగదు. కుర్చీ పెరగదు. సృష్టిలోని నిర్జీవుల్లో డబ్బుకు మాత్రమే పెరిగే గుణం ఉంది. ఎంత పెరగాలో కూడా మనమే నిర్ణయించుకోవచ్చు!
* మీ జేబులోని పర్సు ఎంత శుభ్రంగా, క్రమబద్ధంగా ఉంటే...మీరంత ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నట్టు. కుటుంబానికి చక్కని ఇల్లు ఎంత అవసరమో, ఇంటి పెద్దకు నాణ్యమైన పర్సూ అంతే అవసరం. నోట్లు పద్ధతిగా ఉన్నప్పుడు, ఏ నోటు బయటికి తీస్తున్నామో మనకు స్పష్టత ఉంటుంది. పొరపాట్లు జరిగే అవకాశం తక్కువ.
* ఇంట్లోంచి బయటికి కాలుపెడుతున్నప్పుడు జేబులో ఎంత డబ్బుందో ఓసారి చూసుకోవడం ఉత్తమం. బ్యాంకు ఖాతాల్లోని నిల్వల గురించి కూడా ఉజ్జాయింపుగా అయినా తెలిసుండాలి.
* ఆత్మీయులతో వడ్డీ ఆశించే ఆర్థిక లావాదేవీలు వద్దు. అత్యవసర పరిస్థితుల్లో చేబదులు ఇచ్చినా ... తిరిగి రాకపోయినా ఇబ్బందిపడమనుకుని ఇవ్వడమే ఉత్తమం. తిరిగొస్తే సంతోషమే. డబ్బు కారణంగా ఆత్మీయతలూ అభిమానాలూ దెబ్బతినకూడదు.

* ఎవరిచేతికైనా డబ్బు ఇస్తున్నప్పుడు గాజువస్తువంత జాగ్రత్తగా, పసిపాపంత ప్రేమగా అందివ్వాలి. అది ఎదుటి మనిషికిస్తున్న గౌరవం కాదు, డబ్బుకిస్తున్న గౌరవం. ఎప్పుడైనా పొరపాటున అగౌరవ పరిస్తే శ్రీమహాలక్ష్మికి ‘సారీ' చెప్పడానికి సంకోచించకండి.
* కాస్త చాదస్తంగా అనిపించవచ్చుకానీ, రోజువారీ ఖర్చుల వివరాలు ఓచోట రాసుకోవడం మంచి అలవాటు. దీనివల్ల అనవసరమైన వ్యయాలు దొరికిపోతాయి. మరుసటిరోజు జాగ్రత్తపడొచ్చు.
* ఏ కుటుంబానికైనా ఈ ఆరూ ముఖ్యం...అనుకోని అవాంతరాలు ఎదురైనప్పుడు ఆదుకోడానికి రిజర్వు మనీ, చిన్నదో పెద్దదో మనకంటూ ఒక ఇల్లు, పిల్లల పెద్దచదువులకు ఎంతోకొంత పొదుపు, ఇంటిల్లిపాదికీ ఆరోగ్య బీమా, మనంలేనప్పుడు కూడా మనలోటు తెలియకుండా గణనీయమైన మొత్తంలో టర్మ్‌పాలసీ, వృద్ధాప్యం సాఫీగా సాగిపోడానికి పింఛను నిధి.
* పొదుపు రెండు రకాలు. ఒకటేమో, ఖర్చుపెట్టగా మిగిలింది పొదుపు చేయడం. రెండు, పొదుపు చేయగా మిగిలింది ఖర్చుపెట్టడం. రెండోదే ఉత్తమ మార్గం.

పెళ్లిలో వధువు కాలి బొటన వ్రేలు తొక్కిస్తారెందుకు

మన శరీరాలు నరాల పుట్టలు. ఈ నరాల ద్వారా విద్యుత్తు ప్రవహిస్తుంటుంది. ఋణ, ధన విద్యుత్తున్న భాగంతో విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. పాజిటివ్ మరియు నెగిటివ్ విద్యుత్తులు రెండూ కలిస్తేనే విద్యుత్తు పుడుతుంది కదా. అంటే అక్కడితో విద్యుత్ ప్రవాహం ఆగిపోతుందన్నమాట.

వరుడు కుడికాలి బొటనవ్రేలితో వధువు బొటనవ్రేలిని తొక్కిస్తే వారిద్దరిలో ప్రవహించే విద్యుత్తు కలిసి ఇద్దరూ ఒకటవుతారు. ఒకరి తలపై ఒకరు జీలకర్ర పెట్టించడం, ఏడడుగులు నడవడం... ఇత్యాది ప్రక్రియలన్నీ ఇద్దరినీ కలిపి ఒకటిగా చేయడం కోసమే.

అందుకే పైకి వారిద్దరుగా కనబడుతున్నా.... మానసికంగా, ఆలోచనాపరంగా ఒక్కటే. లెక్కల్లో 1+1=2. కానీ భార్యాభర్తల లెక్కల్లో 1+1=1. అప్పుడే ఆదర్శవంతమైన జంటగా ఉంటారు.

మంచి మాట


కష్టాల్లోనూ సుఖాల్లోనూ చలించకుండా ఉన్నవాడే ధీరుడు.
అటువంటి వ్యక్తి మాత్రమే అమృతత్వాన్ని చేరుకోగలడు.
చావుపుట్టుకలు సహజం. ఎవరూ తప్పించుకోలేరు.
వివేకవంతులు వాటి గురించి ఆలోచించరు


లాభాల్లో నష్టాల్లో కష్టాల్లో సుఖాల్లో
నీ మనసును అటూ ఇటూ పరుగెత్తనీకు.
సాధ్యమైనంత ప్రశాంతంగాస్థిరంగా ఉంచు.
ఆ స్థిరమైన మనసుతోనేజీవనసమరంలో అడుగుపెట్టు.


జ్ఞానులూ అజ్ఞానులూ జీవితాన్ని
వేరువేరు దృక్పథాలతో చూస్తారు.
అజ్ఞాని తన సుఖమే ధ్యేయంగా పనిచేస్తాడు.
జ్ఞాని లోకం కోసం కష్టపడతాడు


నీకిష్టమైనవి జరిగినప్పుడు పొంగిపోవద్దు.
నీకిష్టంలేనివి జరిగినప్పుడు కుంగిపోవద్దు.
 అనుకోని విధంగా జరిగినప్పుడుఉద్వేగానికి లోనుకావద్దు.
మాయలో చిక్కుకుపోకుండా స్థిరంగా ఉండు


నీకు నీవే ఆప్తుడివి.నీకు నీవే శత్రువువి.
నీకు నీవే శిక్షణ ఇచ్చుకుంటే,నీకు నీవే అధిపతివి అవుతావు


శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం.
శ్రద్ధలేకపోతే అంతా నాశనమవుతుంది.
మనసు కలుషితం అవుతుంది


కర్మయోగి తన బాధ్యతల్ని
ఇతరులకంటే సమర్థంగా నిర్వర్తిస్తాడు.
అతనికి కర్మయే ఉపాసన.
కర్మను మించిన పూజ లేదని భావిస్తాడు


నీకు అప్పగించిన బాధ్యతల్నిశక్తినంతా ధారపోసిసమర్థంగా నిర్వహించు.
నిన్నెవరూ పర్యవేక్షించాల్సినఅవసరమే రాకూడదు.
ఎవరి పనిని వారునేర్పుగా చేయడమే యోగం


నిజమైన పండితుడుసృష్టిలోని సమస్త జీవులనూ
సమాన దృష్టితో చూస్తాడు.
తరతమ భేదాలుండవు

ఉగాది



హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది పండుగనాడే నూతన సంవత్సరంగా పరిగణిస్తారు. అయితే సూర్య, చంద్రాదుల సంచారాన్ని ప్రాతిపదికగా తీసుకునే హిందువుల క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది ఈ పండుగ వివిధ రోజుల్లో వస్తుంటుంది. చైత్రమాసంతో కొత్త శకం ప్రారంభవుతుంది. ఆ రోజునే ఉగాదిగా గుర్తించడం జరిగింది.

ఈ పండుగను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే... మహారాష్ట్రలో 'గుడిపాడ్వా' పేరుతో పిలుస్తారు. అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పాలి.

ఉదయాన్నే లేచి శుచీశుభ్రంగా స్నానమాచరించి.. ఇంటిల్లిపాది గుడిలోనో.. లేక ఇంటిలోనో పూజలు వంటివి చేస్తారు. తమ జీవితాలు పది కాలాల పాటు చల్లగా ఉండేలా దీవించమని అశేష శ్రద్ధాభక్తులతో భగవంతునికి సాంప్రదాయబద్దంగా సహస్రనామార్చనలతో ఆరాధిస్తారు. అంతేకాకుండా... సుఖదు:ఖాలు, ఆనంద, విషాదాలకు ప్రతీకగా నిలిచే షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ఆ రోజు ఇంటిల్లిపాది సేవిస్తారు.

ఉగాది పచ్చడి...

ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనంతో తయారుచేసే శ్రేష్టమైన పదార్ధమే ఉగాది పచ్చడి. ఆధ్యాత్మిక పరంగా ఈ పచ్చడికి ఎంత ప్రాముఖ్యత ఉందో... ఆహార, ఆరోగ్యం పరంగాను అంతే ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. ఈ పచ్చడి సేవించడం ద్వారా దివ్యమైన ఆరోగ్యం కలుగుతుందని వైద్యనిపుణులు కూడా సూచిస్తున్నారు.

తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రకాల రుచులు కలపి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. కొత్తసహస్రాబ్ధికి ప్రారంభ శుభ సూచకంగా భావించే ఈ రోజు నుంచి సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను, ఆనందవిషాదాలను సంయమనంతో, సానుకూలంగా స్వీకరించాలన్న సందేశమే ఉగాది పచ్చడిలోని ఆంతర్యం.

ఈ పచ్చడి తయారీ చేయడం కోసం చెరకు, మామిడి పిందెలు, అరటి పళ్ళు, చింతపండు, వేప పువ్వు, బెల్లం, జామకాయలు మొదలగునవి వాడుతుండటం ఆనవాయితీ.

మనకు తెలుగు సంవత్సరాలు 'ప్రభవ'తో మొదలుపెట్టి 'అక్షయ'నామ సంవత్సరము వరకు గల 60సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో,రెండుసార్లో చుస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి 'షష్టిపూర్తి' ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు.

పంచాంగ శ్రవణం
'తిధిర్వారంచనక్షత్రం యోగ: కరణమేవచ పంచాంగమ్‌'
తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం పంచాంగం. ఉగాది నాడు దేవాలయంలోగాని, గ్రామకూడలి ప్రదేశాల్లోగాని, పండితుల, సిద్థాంతుల సమక్షంలో కందాయఫలాలు స్థూలంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు ఉగాది నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడియున్నది.

'పంచాంగస్యఫలం శృణ్వన్‌ గంగాస్నానఫలంఖిలేత్'
ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి.
'పంచాంగం' అంటే అయిదు అంగములు అని అర్ధం. తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనేవి ఆ అయిదు అంగాలు. పాడ్యమి మొదలుకొని 15 తిధులు,7వారాలు, అశ్వని మొదలుకొని రేవతి వరకు 27 నక్షత్రములు, విష్కభం మొదలుకొని వైధృతి వరకు 27 యోగములు, బవ మొదలుకొని కింస్తుఘ్నం వరకు, 11 కరణములు వున్నాయి. వీటన్నిటినీ తెలిపేదే 'పంచాంగం'. పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.

"నేను సైతం'' అనే శ్రీశ్రీ గేయానికి పేరడి

నేను సైతం
తెల్లజుట్టుకు
నల్లరంగును కొనుక్కొచ్చాను
నేను సైతం
నల్లరంగును
తెల్ల జుట్టుకి రాసి దువ్వాను
యింత చేసీ
యింత క్రితమే
తిరుపతయ్యకు జుట్టనిచ్చాను

ఆదర్శ దాంపత్యం

భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థకు ఒక ప్రధాన స్థానముంది. భార్యాభర్తలుగా ఇద్దరు స్త్రీ, పురుషులు కలసిమెలసి జీవిస్తూ తమ స్వార్థం కోసమేకాక సామాజిక శ్రేయస్సు కోసం పాటుపడాలని ఒక్కోసారి ఎంతటి కష్టాన్నైనా సహించాలని అని అంటోంది. మన వివాహ ధర్మం. ఇదే విషయాన్ని పార్వతీ పరమేశ్వరులపరంగా కూడా భాగవత పురాణం ఎనిమిదో స్కందం వివరించి చెబుతోంది.

దేవదానవులంతా క్షీరసాగరాన్ని మధించే వేళ ముందుగా హాలాహలం పుట్టింది. దాని వేడికి సకల లోకాలూ తల్లడిల్లసాగాయి. అది సర్వత్రా వ్యాపించింది. జింకలా గంతువేసింది, పాములా పాకింది, సింహంలా దూకింది, పక్షిలా ఎగిరింది, ఒక్కోసారి ఏనుగు లాగా కదలకుండా ఒకచోటే నిలిచింది. దాంతో అనేక జీవరాసులు తల్లడిల్లాయి. ఆ పరిస్థితి చూసి దేవతలంతా ఓచోట చేరి సమస్య పరిష్కారానికి శివుడొక్కడే శరణ్యమని నిర్ధరించారు. ఆ వెంటనే అంతా కలిసి కైలాసానికి బయలుదేరి వెళ్ళి పరమశివుడికి హాలాహలం వల్ల కలుగుతున్న ప్రమాదాన్ని గురించి వివరించి చెప్పారు. శివుడు పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. వెంటనే ఆయన తన ఇల్లాలు పార్వతీదేవి వంక చూసి ఇలా అన్నాడు ‘శక్తి కల్గిన ప్రభువు ఇలాంటివారి కష్టాలు తొలగించాలి. అప్పుడే ఆ లోక నాయకుడికి కీర్తి కలుగుతుంది. ప్రాణభయంతో ఆశ్రయించిన ప్రాణులను కాపాడటం ప్రజాపాలకుల కర్తవ్యం. పాలకులు ప్రజల ప్రాణాల రక్షణ విషయంలో వెనకడుగు వేయకూడదు. ప్రాణాలు క్షణభంగురాలని, ఇతరుల ప్రాణరక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించటమే ఉత్తమమని ప్రభువులు భావించాలి. పరులకు సహాయం చేయటం కోసం నడుం బిగించేవారికి ఎప్పటికీ తిరుగుండదు. పరోపకారమే పరమోత్తమ ధర్మం.

అందుకే ఓ పార్వతీ ఈ హాలాహలాన్ని దండించాలనుకొంటున్నాను. తియ్య తియ్యని పండ్ల రసంలాగా దీన్ని ఆరగిస్తాను. లోకాలలోని ప్రాణులన్నిటినీ కాపాడతాను' అని చెప్పి ‘మరి నీవే మంటావ'ని పార్వతిని అడిగాడు పరమశివుడు.

పార్వతి పరమేశ్వరుడికి తగిన ఇల్లాలు... ఆమె జగన్మాత. ఈశ్వరుడు లోకజనుల ప్రాణరక్షణ కోసం వెళతానని అన్నందుకు ఆమె ఏమాత్రమూ బాధపడలేదు. తన స్వార్థాన్ని ఆలోచించలేదు. స్వార్థం కన్నా లోక ప్రజల ప్రాణ రక్షణే మిన్న అని ఆమె కూడా భావించింది. పరమేశ్వరుడిని ‘మీ మనస్సుకు ఎలాతోస్తే అలా చేయమ'ని అంది. శివుడు హాలాహలాన్ని మింగటానికి పూనుకున్నాడు. ‘ఓ లోక ద్రోహీ! ఇక వ్యాపించకు... ఇకరా...' అంటూ హాలాహలాన్ని చేయి చాచి లాగి పట్టుకుని కబళంగా చేసి నేరేడు పండు తిన్నంత సులభంగా విలాసంగా తినేశాడు. ఆ విషాగ్నిని ఆయన ఆహ్వానించేటప్పుడు, దాని కబళంగా చేసేటప్పుడు నోట్లో వేసుకుని తిని మింగేటప్పుడు ఆయన ఏమీ చికాకు పడలేదు. శరీరం మీది సర్పాలు కదల్లేదు. చమటలు పట్టటం కానీ, కళ్ళు ఎర్రబడటం కానీ, సిగలోని చంద్రుడు కందటం కానీ, ముఖం వాడిపోవటం కానీ ఏమీ జరగలేదు. కానీ ఆయన ఉదరంలో సమస్తలోకాలూ ఉన్నందువల్ల ఆ విషాగ్నిని పూర్తిగా నమిలి మింగేస్తే ఆ లోకాలన్నిటికీ ప్రమాదమని తెలిసి దాన్ని తన గొంతులోనే ఉంచుకున్నాడు శివుడు. ఆ స్థితిని చూసి విష్ణువు, బ్రహ్మ, పార్వతి, దేవేంద్రుడు లాంటి వారంతా ఎంతో మెచ్చుకున్నారు.

పార్వతీ పరమేశ్వరులు ఆదర్శ దాంపత్యానికి ఓ చక్కని ఉదాహరణగా ఈ కథా ఘట్టం పేర్కొంటుంది. శివుడు ప్రజలను రక్షించాలని ముందుకెళ్ళేటప్పుడు ఆయన భార్య పార్వతీదేవి తన భర్త నిర్ణయాన్ని తప్పుపట్టలేదు. తన భర్తకు ఏమైనా అవుతుందోమోనని శంకించలేదు. పరోపకారం కోసం ఎంతటి త్యాగానికైనా ప్రభువు ఒడిగట్టటాన్ని ఆమె సమర్థించింది. ఇలాంటి ఆదర్శ దంపతులు ప్రజాపాలకులలో ఉంటే నేటి సమాజంలో అవినీతి, ప్రాణభయం లాంటివి ప్రజలకు లేకుండా పోతాయి. పార్వతికి పరమేశ్వరుడు చెప్పిన మాటల్లోని సారాన్ని భర్తలు,పార్వతి సమర్థన తీరును ఇల్లాళ్ళు అనుసరిస్తే సమాజమంతా పరోపకార బుద్ధి కలిగన వారితో నిండి విశ్వశాంతి వర్ధిల్లుతుంది. ఇది ఈ కథలోని సామాజిక సందేశం. అయితే పురాణపరంగా చూస్తే హాలాహల భక్షణం అనే ఈ కథను సంతోషంగా విన్నా, రాసినా, చదివినా భయానికి గురికారు. పాములు, తేళ్ళు, అగ్నిలాంటి వాటివల్ల కష్టాలు కలగవనేది ఈ కథకు సంబంధించిన ఫలశ్రుతి అని భాగవతం చెబుతోంది.

రతీ మన్మథ పరిణయం

మన్మథుడు లోకాలన్నిటినీ మోహింప చేయగల శక్తి ఉన్నవాడు. అలాంటి మన్మథుడినే మోహింప చేయగల శక్తి ఉన్న అతిలోక సౌందర్య వతి రతీదేవి. ఈ ఇద్దరికీ వివాహం ఎప్పుడు ఎలా అయింది? అనే విషయాన్ని కామ వివాహం అనే పేరున శివపురాణం రుద్ర సంహితలోని మూడు, నాలుగు అధ్యాయాలు వివరిస్తున్నాయి.

మన్మథుడు బ్రహ్మ మనస్సు నుంచి జన్మించిన తర్వాత ఆ బ్రహ్మ దేవుడు తనతో సహా అందరినీ మోహింప చేయగల శక్తిని మన్మథుడికి అనుగ్రహించాడు. ఆ శక్తిని తానొకసారి పరీక్షించి చూసుకోవాలనుకున్నాడు ఆ పుష్పబాణుడు. వెంటనే అక్కడే ఉన్న బ్రహ్మ మానసపుత్రిక అయిన సంధ్య. మరీచి, దక్షుడు లాంటి వారితో సహా బ్రహ్మదేవుడి మీద కూడా తన పూలబాణాలను ప్రయోగించాడు. అందరి మనస్సులూ అల్లకల్లోలం అయ్యాయి. ఎంతో కఠోరమైన ఇంద్రియ నిగ్రహశక్తి కలిగిన వారంతా తమకలా కామ వికారం కలగటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇంతలో అక్కడ శంభుడు ప్రత్యక్షమై ఆ వికారానికి కారణం మన్మథుడని తెలుసుకొని కోపాన్ని వహించాడు. శివుడు కోపాన్ని తట్టుకోలేక పంచబాణుడు పక్కకు తొలిగాడు. ఇంతలో బ్రహ్మ కూడా వాస్తవస్థితి కొచ్చి తనను సైతం వికారానికి గురిచేసిన మన్మథుడు శివుడి మూడో కంటి అగ్ని జ్వాలలకు అంతమవుతాడని శపించాడు.ఆ తర్వాత శివుడు, బ్రహ్మలాంటి వారంతా ఎవరి పనులలో వారు నిమగ్నమయ్యారు. శహవుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడని పూర్తిగా గ్రహించిన మన్మథుడు మెల్లగా బ్రహ్మ దగ్గరకొచ్చి ‘నీవిచ్చిన వరాన్ని నేను పరీక్షించాను.. అంతే కానీ నా వైపు నుంచి మరేతప్పు జరగలేదు. ముక్కంటి కోపాగ్నికి నేను దగ్ధమయ్యేలా నీవు శపించటం సమంజసమా?' అని మన్మథుడు బ్రహ్మను వేడుకొన్నాడు. బ్రహ్మ మన్మథుడికి ధైర్యం చెబుతూ దైవ ప్రేరణతో ఇలా జరిగింది. భవిష్యత్తులో శివుడి మూడోకంటి అగ్ని జ్వాలల్లో నీవు దగ్ధం కావటానికి లోకకల్యాణ కారకమైన కుమార జననం అనే ఓ దివ్య సంఘటన ఇమిడి ఉంది. శివుడి కోపాగ్నికి నీవు దగ్ధమైనా ఆ తర్వాత మళ్ళీ నీకు మేలే జరుగుతుంది అని బ్రహ్మదేవుడు మన్మథుడిని అనునయించాడు. అలా జరిగిన మరికొన్నాళ్ళకు దక్ష ప్రజాపతి మన్మథుడి దగ్గరకొచ్చి తన స్వేదం నుంచి పుట్టిన తన కుమార్తెను వివాహమాడమని కోరాడు. ఆమె పేరు రతీదేవి అని, సర్వలోక సౌందర్యవతి అని చెప్పి రతికి, మన్మథుడికి దక్షప్రజాపతి వివాహం చేశాడు. మన్మథుడు రతి అనే శోభాయుక్తమైన తన భార్యను చూసి అనురాగం నిండిన మనస్సు కలవాడయ్యాడు. ఆ క్షణంలో మన్మథుడి బాణాలు మన్మథుడినే కొట్టాయి. మదనుడు సహితం మోహానికి గురయ్యాడు.

బంగారు వన్నె శరీరంతో, లేడికళ్ళ వంటి కళ్ళతో ఓరచూపులు చూస్తూ ఉన్న రతీదేవి తన భర్తకెంతో ఉత్సాహాన్ని కలిగించింది. కందర్పుడు ఆ మోహ విభ్రాంతిలో ఆమె కనుబొమలను చూసి ఇదేమిటి బ్రహ్మదేవుడు నా ధనుస్సును లాక్కొని ఈమె కనుబొమల స్థానాల్లో ఉంచాడా అని అనుకొన్నాడు. వేగవంతమైన ఆమె చూపులను చూసి తన బాణాల కన్నా ఆమె చూపులే వేగవంతంగా ఉన్నాయని ఆశ్చర్యపోయాడు.ఆమె పూర్ణిమనాటి చంద్రుని పోలి ఉంది. చిన్న మచ్చతో శోభించే ఆమె ముఖాన్ని చూసి ఏది చంద్రబింబమో, ఏది రతీదేవి ముఖమో తేల్చుకోలేని స్థితిలో పడ్డాడు. ఇలా ఆ రతీదేవి సర్వావయవ సౌందర్యం మన్మథుడిని సహితం నిశ్చేష్టుడిని చేసింది. మన్మథుడు రతీదేవితో వివాహానంతరం అలా ఆనంద సాగరంలో మునిగి తేలసాగాడు. బ్రహ్మ ఇచ్చిన శాపంలాంటివి ఏవీ అతడికి గుర్తు లేకుండా పోయాయి. రతి కూడా భర్తకు తగ్గ ఇల్లాలుగా నడుచుకొంటూ ఆనందాన్ని అనుభవించసాగింది. దక్షప్రజాపతి తన కుమార్తె, అల్లుడు ఆనందంగా ఉండటంతో ఆయన కూడా ఆనందించసాగాడు. ఒక యోగి ఆత్మ విద్యను తన హృదయంలో ధరించిన విధంగా రతీదేవిని మన్మథుడు తన హృదయంలో నిలుపుకొని ప్రకాశిస్తూ పరవశించ సాగాడు. ఇలా రతీ మన్మథుల వివాహ ఘట్టాన్ని శివపురాణం వివరించి చెబుతోంది.

మీ కోసం

ఒక మనిషి తాను చేయ దల్చుకున్న పని పట్ల నమ్మకం కంటే , దాని వ్యతిరేక శక్తి పట్ల నమ్మకం పెంచుకోవడాన్ని "అధైర్యం "అంటారు . తాను చేయదల్చుకున్న పని పట్ల , తన స్వశక్తి మీద నమ్మకం డామినేట్ చేయటాన్ని "ధైర్యం " అంటారు .జరగబోయే నష్టం కన్నా ,సాధించ బోయే లాభం విలువ ఎక్కువుంటే రిస్క్ తీసుకోవడమే ధైర్యం .గెలుపు అస్పష్టంగా ఉన్నా కూడా ధైర్యం చేయడాన్ని "సాహసం '' అంటారు . పెద్ద కష్టాల్ని ఎదుర్కోవడానికి సాహసం కావాలి . చిన్న కష్టాల్ని ఎదుర్కోవడానికి "ఓర్పు " కావాలి .


 అస్తమిస్తున్న సూర్యుడన్నాడట..
నా పని ఇక ఎవరు చేస్తారని ....
నాకు ఆ పని వదలండి ప్రభూ !
అన్నదట ఆత్మవిశ్వాసం
నిండిన " ప్రమిద "

-రవీంద్ర నాధ్ ఠాగూర్ -

ఓడిపోవాలని కోరుకుంటూనే

యుద్ధం చేస్తున్నా ! నా హృదయంతో .....


తన నిండా నింపుకున్న నీ తలపుల్ని

తుడిచెయ్యాలని.......

యుద్ధం చేస్తున్నా ! నా కళ్ళతో

నాలోని నీ రూపుని కన్నీరుగా

తోసెయ్యాలని .......

యుద్ధం చేస్తున్నా ! నా పెదవుల్తో

పలకొద్దని నీ పేరుని

పదే పదే ......

కానీ ప్రతి సారీ ఓడిపోతున్నా

సర్వాంతర్యామివై నన్ను వేధిస్తున్నావ్

ఐనా నేను గెలవాలని ప్రయత్నిస్తున్నా ....

ఓడిపోవాలని కోరుకుంటూనే .........

స్త్రీ .. పురుషునికి ..లక్షణాలు...

స్త్రీ ......

కార్యేషు దాసీ ,కరణేషు మంత్రీ ,

రూపేచ లక్ష్మీ ,క్షమయా ధరిత్రీ ,

భోజ్యేషు మాతా,శయనేషు రంభా ,

షడ్ధర్మ యుక్తా కుల ధర్మ పత్నీ .


భర్తకు సేవలు చేసేటప్పుడు దాసీ గాను ,గృహ విషయములందు ,ధర్మ కార్యములలోను మంత్రి వలె సలహాదారు గాను ,రూపములో లక్ష్మీ దేవి వలెను ,సహనము చూపుటలో భూదేవి వలెను ,భర్తకు ,అతిధులకు భోజనం పెట్టునపుడు తల్లి వలెను ,భర్తతో శయనించు వేళ రంభ వలెను ........ఈ ఆరు లక్షణములు ఉన్న స్త్రీని ధర్మపత్నిగా చేసుకో దగిన పరిపూర్ణమైన స్త్రీగా వర్ణించారు .

అలాగే పురుషునికి ఉండాల్సిన ఎనిమిది లక్షణాలు .........

అన్న మదము , అర్ధ మదము ,

స్త్రీ మదము , విద్యా మదము ,

కుల మదము , రూప మదము ,

ఉద్యోగ మదము ,యౌవన మదము .

ఈ అష్ట మదములూ కలిగిన వాడు పరిపూర్ణ పురుషుడని పెద్దలు చెప్తారు .

వీటితో పాటూ ....చతుర్విధ పురుషార్ధములలోనూ ,ధర్మ ప్రవర్తన కలిగి ,ఈర్ష్యా స్వభావము లేక ,దయ ,కరుణ, ఓర్పు కలిగి ,మధుర మైన వాక్కునూ ,సత్ప్రవర్తనను కలిగి ఉండవలెను .శ్రమ పడుటకు వెనుదీయక ,ధైర్య సాహసములు కలిగి కీర్తి ,సంపదలు సంపాదించుటకు ఎల్లప్పుడూ ప్రయత్నము చేయువాడు ఉత్తమ పురుషుడు .

పేరు గుర్తు లేదు ఎప్పుడో చదివిన పుస్తకం నుండి ........

పెళ్లి అనేది ....

చాలా సంవత్సరాలై ఉంటుంది రంగ నాయకమ్మగారి "అంధకారంలో "అనే నవల చదివాను .దానిలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలు మీతో పంచుకోవాలని .........


సంగీతాలూ ,చిత్రలేఖనాలూ మాత్రమే కలలనుకుంటాం .కాని హాయిగా జీవించడం కూడా గొప్ప కళే .ఆ కళలో మనం నిష్ణాతులం కావాలంటే జీవితాన్ని గౌరవించి ,ప్రేమించడమే దానికి మార్గం .

పెళ్లి అనేది సాంఘిక బంధమూ ,శారీరక బంధమే కానీ అది మానసిక బంధం కాదు .భార్యని శాశ్వతంగా భర్తతో ఐక్యం చేయగలిగేంత బలీయమైన మధుర స్మృతులు ఏవీ లేకపొతే దాంపత్యం విఫలమౌతుంది . సంసారంలోని మధురిమనూ అనుభవించలేరు .

వివాహం రెండు వ్యక్తిత్వాల కలయిక ,రెండు మనస్తత్వాల కలయిక ,రెండు సంస్కారాల కలయిక .పెళ్ళవగానే సుఖాలూ ,ఆనందాలూ తరుముకుంటూ రావు .భాగస్వామిలో ఏదో నచ్చుతుంది ,మరేదో నచ్చదు .ఎదుట వ్యక్తికోసం తను కొంత మారాలి ,తన కోసం ఎదుటి వ్యక్తిని కొంత మార్చుకోవాలి .సామరస్యంతో ,బాధ్యతతో ......ఇద్దరిదీ ఒకే జీవితంగా చేసుకోవాలి .అప్పుడే దాంపత్యం సాఫల్యం చెందుతుంది .

భార్యా భర్తల మధ్య అనురాగం సంధ్యా రాగం అంత అందంగా .....మల్లెపువ్వంత పరిమళంగా .....పాల వెన్నెలంతా స్వచ్చంగా ఉండాలి .

గున్నమామిడి - బాలమిత్రుల కధ

గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది
ఒక గూటిలోన కోయిలుంది
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
పొద్దున చిలకను చూడందే
ముద్దుగ ముచ్చటలాడందే
పొద్దున చిలకను చూడందే
ముద్దు ముద్దుగ ముచ్చటలాడందే
చివురులు ముట్టదు చిన్నారి కోయిల
చిలక ఊగదు కొమ్మ ఊయల //గున్న మామిడీ //

ఒక పలుకే పలుకుతాయి
ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
ఒక పలుకే పలుకుతాయి
ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
రంగూ రూపు వేరైనా
జాతి రీతి ఏదైనా
రంగూ రూపు వేరైనా
తమ జాతి రీతి ఏదైనా
చిలకా కోయిల చేసిన చెలిమి
ముందు తరాలకు తరగని కలిమి //గున్న మామిడీ//

నిన్నెలా సంభోదించను?

నా ఆరోప్రాణమా అందామంటే

నా పంచ ప్రాణాలూ నువ్వైపోయావు

నీలాకాశామా అందామంటే

ఎప్పటికీ అందవేమోననే భయం

మధుర స్వప్నమా అందామంటే

కళ్లు తెరిస్తే కరిగి పోతావేమో

నా ఆశా దీపమా అందామంటే

నాకు చీకటి మిగిల్చి వెళ్లిపోయావ్

మరి నువ్వెవరు ?

చిరు గాలివా ? చందమామవా ?

సెలఏరువా ? హరివిల్లువా ?

కాదు ....ఇవేవీ కాదు .....

నువ్వొక శిలవి ......

వరమివ్వని వట్టి శిలవి

కాని .......

నేను శిల్పిని

నా అక్షరాలే వులిగా ,నిన్ను

శిల్పంగా మలుచుకుంటా ,

వరమిచ్చే వేలుపుగా కొలుచుకుంటా....

భయం

చాలా నచ్చి వ్రాసుకున్నది .మీ కోసం .....

భోగములలో - వ్యాధి కలుగునన్న భయం
ఉన్నత జన్మలో - జాతి పోవునన్న భయం
సంపదలో - దొంగల భయం
కీర్తి ప్రతిష్టలలో - అవి పోవుననే భయం
బలములో - శత్రువుల భయం
అందములో - వృద్ధాప్యపు భయం
జ్ఞానములో - అపజయ భయం
మంచి గుణములో - అపనిందల భయం
శరీరంలో - మృత్యు భయం
మనిషి జీవితమంతా భయముల మయమే
వైరాగ్యం ఒక్కటే నిర్భయమైనది .

పెళ్ళంటే......

ఇక్కడ చాలామంది విజ్ఞులున్నారు .వారికి తెలిసే వుంటుంది .అలా తెలియని వారి కోసం పెళ్ళిలోని కొన్ని ముఖ్య ఘట్టాలను నాకు తెలిసినంతలో వివరిస్తాను .ఇది నాకు తెలిసిన పరిధి కాబట్టి తప్పులుంటే , క్షమించగలరని మనవి.


పెళ్ళిలో ముందుగా వరుడి చేత గణపతి పూజ చేయించి గణపతిని oఆహ్వానిస్తారు .కలశ పూజ చేసి లక్ష్మి సమేతుడైన మహా విష్ణువును ఆహ్వానిస్తే ,ఆయన వివాహం అయ్యేవరకు కలశమందు ఉండి వధూవరులనాశీర్వదిస్తాడు .విష్ణువుతో ,గరుడుడూ ,మరియు సప్త ఋషులు ,అష్టదిక్పాలకులు మొదలగు rదేవతలంతా ఆయన వెన్నంటి ఉండి వధూవరులను ఆశీర్వదిస్తారు .

ఇరువైపులా తల్లితండ్రు లుండి పట్టుచీరతో ,పూలజడతో ,బంగారు ఆభరణాలతో ,బాసికంతో (భ్రూమధ్యం పై అందరి దృష్టి పడకుండా నుదుట కట్టేది ) అలంకరించిన వధువును పీటల మీదికి తీసుకొస్తారు .సుముహూర్తం వరకూ వధూవరులిరువురి మధ్యా తెరనుంచుతారు .వధువును లక్ష్మీ స్వరూపంగానూ ,వరుని సాక్షాత్ విష్ణు స్వరూపంగా భావించి కాళ్ళు కడిగి ,బంగారము వంటి మనసు కలదీ ,బంగారు ఆభరణాలతో అలంకరించ బడినదీ ఐన ఈ కన్యను పంచ భూతముల సాక్షిగా ,బ్రహ్మాదులూ మున్నగు దేవతల సాక్షిగా నీకు దానం చేయుచున్నాను అని వరుని చేతిలో అమ్మాయి చేతినుంచి దోసిలిలో కొబ్బరి బొండాం ఉంచి పాలు పోస్తూ తల్లి తండ్రులు కన్యాదానం చేస్తారు .

వరునిచేత ధర్మ ,అర్ధ ,కామములందు cఈమెను విడిచి జీవనము సాగించనని ,ప్రమాణం చేయిస్తారు .నాతి చరామి అంటూ వరుడు ప్రమాణం స్వీకరిస్తాడు .అలాగే ధర్మ ,అర్ధ ,కామములందు ,సంతానోత్పత్తి ప్రక్రియ లందునూ నిన్ననుసరించి మసలుకుంటానని వదువుచేత ప్రమాణము చేయించి సుముహూర్తములో వధూవరుల చేత ఒకరి తలపై మరొకరు నూరిన జీలకర్ర ,బెల్లము ముద్దను పెట్టిస్తారు .నూరిన జీలకర్ర ,బెల్లము విడిపోకుండా ఉన్నట్లే ఇరువురూ అన్యోన్యంగా జీవించాలని భావము .తర్వాత తెర తొలగించి ఒకరినొకరు చూసుకుంటారు .

మాంగల్య దేవతను ఆహ్వానించి గౌరీ దేవిని ,మంగళ సూత్రాలను పూజించి ,ముత్తైదువులచె మాంగల్యాన్ని ఆశీర్వదింప చేసి ,వరునిచే మాంగల్య ధారణ చేయిస్తారు . నా జీవన గమనానికి హేతువైన మంగళ సూత్రము నీకు కడుతున్నాను .నూరేళ్ళు మనము కలిసే జీవించేదము గాక !అని కోరుకుంటూ వరుడు సూత్ర ధారణ చేస్తాడు .

తలంబ్రాలు !పెళ్ళిలో వదూవరులకే కాకుండా చూసేవారికి కూడా ఉత్సాహాన్నిచ్చే ఘట్టం .కోరిన సంతానము సమృద్ధిగా లభించును గాక అంటూ .వధువు పోస్తే , ఆనందమూ ,కోరికను , సత్యమును కలిసి అనుభవింతుము .సంపదలను,వంశాన్ని వృద్ధి చేసుకోనేదము గాక అంటూ వరుడు పోస్తాడు .ఇరువురూ ఉత్సాహంగా తలంబ్రాలు పోసుకుంటారు .కలిసిన

బంధానికి గుర్తుగా బ్రహ్మ ముడి వేస్తారు .కొంతమంది ఉంగరాలు తీయిస్తారు . బంగారు ఉంగరమూ,వెండి చుట్టూ వేసి . ..తీయమంటారు .ఇది స్పర్శ తాలూకు సాన్నిహిత్యం వల్ల వధూవరుల మధ్య బిడియాన్ని పోగొట్టి ప్రేమను చిగురింప చేయుట కొరకు ఉద్దేశించబడినది అయివుండొచ్చు .

మట్టెలు తొడిగించి వధువు చిటికెన వేలు పట్టుకుని ఏడడుగులు నడుస్తారు. ఏడడుగులునడిచి స్నీహితురాలివయ్యావ్ ,అట్లే ఎడబాటు లేకుండా పరస్పరం ప్రేమతో అనుకూల దాంపత్యాన్ని కలిగిఉందాము అని వరుడు అంటాడు .

ఏడడుగులు..ఒకటి అన్న సమృద్ధి కొరకు ,రెండవది బలము కొరకు ,మూడవది వ్రత ఫలము కొరకు ,నాల్గవది వ్రతాది కారము కొరకు , ఐదవది పశుసమృద్ది కొరకు , ఆరవది వంశాభివృద్ధి కొరకు ,ఏడవది ఋత్విజాదుల నిచ్చుటకు విష్ణువును ప్రార్ధిస్తూ ఏడడుగులు నడుస్తారు.

అరుంధతి నక్షత్ర దర్శనం పెళ్ళి వేడుక పూర్తయ్యాక వధూవరులిరువురి చేత అరుంధతి దర్శనం చేయిస్తారు.అరుంధతిని ఆధారంగా చేసుకొని మిగతా నక్షత్ర గమనం ఉంటుంది.అట్లే నాపతి ఇంటిలో నేను స్థిరముగా ఉండి నీవలెనే కీర్తి పొందునట్లు ఆశీర్వదించమని కోరుకొని నమస్కరిస్తారు . అంతటితో వివాహం లోని ముఖ్య ఘట్టాలు పూర్తయినట్లే .

అసలు పూర్వం వివాహం పదహారు రోజులు దాదాపు ముప్ఫై అంశాలతో కూడుకున్నదై ఉండేదట.తర్వాత ఐదు రోజులు,.....మూడు రోజులు ............ ఇప్పుడు దాన్ని మరీ కుదించి జరుపుతున్నారు. ఇది కూడా కాదనుకుంటే మన ముందు తరాలకు ఎటువంటి అనుభూతిని మిగల్చగలం ?వివాహం ఓ అందమైన వేడుక .ఆ మధురమైన అనుభూతిని సాంప్రదాయాన్ని,పదిలంగా ముందు తరాలకు అందిద్దాం .