ముక్కోటి ఏకాశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సోమవారంనాడు భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 28 కంపార్ట్ మెంటులూ పూర్తిగా భక్తులతో కిక్కిరిసిపోయాయి. మరో మూడు కిలోమీటర్ల మేరకు క్యూ లైన్లు విస్తరించాయి. స్వామివారి దర్శనానికి భక్తులకు సుమారు 16 గంటల సమయం పడుతోంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులను ఉత్తర ద్వారా గుండా పంపిస్తారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే ఇలాంటి సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా రావడం ఆనవాయితీగా వస్తోంది. ముక్కోటి ఏకాదశి రోజున స్వామిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
వైకుంఠ ద్వారా దర్శనం కోసం భక్తులు ఆదివారం సాయంత్రానికే లక్షల సంఖ్యలో తిరుమల గిరులకు చేరుకున్నారు. రద్దీ విపరీతంగా ఉండడంతో వసతి గదులు చాలక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
కాగా, ముక్కోటి ఏకాదశి సందర్భంగా సోమవారం ఉదయం మలయప్పస్వామి స్వర్ణరథంపై ఊరేగారు. సర్వాభరణలను అలంకరించుకుని దేవేరులతో కలసి స్వామి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. భక్తుల గోవిందన నామోచ్ఛారణతో తిరుమల గిరులు మారుమోగుతున్నాయి.