దిట్టాన్ని అనుకరిస్తే చర్యలు తప్పవు
ఆ పేరూ వాడకూడదు
తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి భక్తులకు ప్రసాదంగా ఇచ్చే తిరుపతి లడ్డూకు భౌగోళిక అనుకరణ హక్కు (జియోగ్రాఫికల్ కాపీరైట్) లభించింది. వేరెవరు కూడా తిరుపతి లడ్డూ పేరును ఉపయోగించుకోకుండా, ఆ పేరుతో మిఠాయిని మార్కెట్ చేయకుండా జీఐ నిషేధిస్తుంది. ఓ ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ.. భక్తులకు అందించే ప్రసాదాన్ని భౌగోళిక సూచిక నమోదు కేంద్రం (జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ-జీఐఆర్)లో నమోదు చేసుకోవడం ఇదే మొదటిసారి. శ్రీవారి లడ్డూకు ఉన్న ప్రత్యేకత ఎనలేనిది. తిరుమల వెళ్లిన భక్తులను లడ్డూలు తెచ్చారా అని ప్రతి ఒక్కరూ ఆత్రుతగా అడిగి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అంతటి రుచి, ప్రాముఖ్యం ఉన్న దృష్ట్యా చాలాకాలంగా దీనిపై హక్కులు తీసుకోవాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. చెన్నైలోని భౌగోళిక సూచిక నమోదు కేంద్రం (జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజస్ట్రీ-జీఐ)లో రెండేళ్ల క్రితం ఈ హక్కు కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తరఫున అప్పటి ఈవో రమణాచారి దరఖాస్తు చేశారు.మంగళవారం ఢిల్లీలోని ప్రధాన కేంద్రం నుంచి జాబితాలో చేర్చినట్లు సమాచారం అందింది. ‘‘తిరుపతి లడ్డూను గుర్తిస్తూ జీఐ ధ్రువీకరణ పత్రాన్ని తితిదేకు మంజూరు చేస్తున్నాం. ఇప్పటి నుంచి ఈ లడ్డూకు చట్టం రక్షణ ఇస్తుంది. దీన్నెవరూ అనుకరించలేరు'' అని ట్రేడ్‌మార్క్స్, జీఐ సహాయ రిజిస్ట్రార్ వర్మ వెల్లడించారు. పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్‌మార్కుల కంట్రోలర్-జనరల్ పి.హెచ్.కురియన్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ విశేషంపై తితిదే పాలకమండలి అధ్యక్షుడు ఆదికేశవులు, ఈవో కృష్ణారావు ఆనందం వ్యక్తం చేశారు.
ఇకపై తితిదే అనుసరించే ‘దిట్టం' ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ ఆధ్యాత్మిక, ఇతర సంస్థలు, వ్యక్తులు లడ్డూలను తయారు చేయరాదు. ఈ నమూనాను కూడా ఇతరులు అనుకరించే వీలు లేదు. 51 వేల లడ్డూలను ‘దిట్టం'గా పరిగణిస్తారు. ‘దిట్టం' కింద శనగపిండి-2 వేల కిలోలు, చక్కెర-4 వేల కిలోలు, నెయ్యి-1850 కిలోలు, గోడంబి-350 కిలోలు, ద్రాక్ష-87.5 కిలోలు, యాలకులు-50 కిలోలు, కలకండ-50 కిలోలు లడ్డూ తయారీకి వినియోగిస్తారు. లడ్డు తయారీ, నమూనా, దిట్టం, ఆకారాలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తప్పవు.
జీఐ ప్రకారం.. ఒక ఉత్పత్తిని విక్రయించుకునే హక్కు సంబంధిత భౌగోళిక ప్రాంతంతో ముడిపడి ఉంటుంది. ఆ హక్కు లభించిన ఉత్పత్తులు అదే ప్రాంతంలో తయారు కావాలి. ఒక ప్రాంతంలో దీర్ఘకాలికంగా విశిష్టత సాధించిన బ్రాండ్‌నేమ్‌ను మరెవరూ సొమ్ము చేసుకోకుండా ఈ హక్కు సంరక్షిస్తుంది. హక్కును ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలకు అవకాశం కల్పిస్తుంది. భౌగోళిక అనుకరణ హక్కు.. మేధో సంపత్తి హక్కుల్లో భాగం.