రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

నేను- నా డౌట్స్

ఎప్పటిలాగానే బొజ్జ నిండా తినేసి బజ్జున్నా. మాంచి నిద్రలో ఉండగా కళ్ళ ముందు వెయ్యి ట్యూబు లైట్లు వెలిగించినట్టు తెల్లటి కాంతి, అందులో నుండి ఎవరో పెద్దాయన బయటకి వచ్చారు. హబ్బో, హబ్బో ఎంత బాగున్నాడో ఆయన, పెదవుల మీద చిరు మందహాసం, కళ్ళల్లో తొణికిలాడుతున్న శాంతం.

"ఎవరు స్వామీ నువ్వు??"

"నేనా...నేను దేవుడిని" (గొంతు కూడా భలేగుందే)

"అబ్బ చా, ఏ దేవుడివేటి నువ్వు? ఐనా నిన్ను రమ్మని నేనెప్పుడు అడిగాను?"

"మొన్న కప్ప స్థంబాన్ని కావలించుకుని అడిగావు కదా, దేవుడా నువ్వు ఒక్క సారి కనిపించు నీతో బోల్డు మాట్లాడాలి అని, అందుకే వచ్చేసా"

(అయ్యో, కప్ప స్థంబం కి అంత పవరుందని తెలిస్తే ఏ ప్రధాన మంత్రి పదవో, రాష్ట్రపతి పదవో అడిగుండేదాన్ని కదా ప్చ్")

"ప్రతీ వాళ్ళకి పదవులిచ్చేస్తే ఇంక నేనెందుకు తల్లీ"

(హమ్మో ఈయన గుండెలు తీసిన బంటులా ఉన్నాడే, నా మనసులో అనుకున్నవి ఎలా తెలిసిపోతున్నయబ్బా?)

"నేను గుండెలు తీసిన బంటు ని కాదమ్మా, నీకు ప్రాణాలు పోసిన తండ్రిని"

"ఇదిగో స్వామీ, నువ్విట్లా మనసులో అనుకున్నవన్నీ కనుక్కుంటే నాకు ఇంక ప్రైవసీ ఎక్కడుంటుంది, నేను సీక్రసీ ఎలా మెయింటైన్ చెయ్యాలి?"

"నా నుండి దాచటం నీ వల్ల కాదులే కానీ ఇంకో మాట చెప్పు"

"అబ్బ చా, అలాగైతే రోజూ ప్రతివాడూ ఏదో ఒక సందర్భం లో ఏదో ఒక కుట్ర చెయ్యకుండా ఉండడు. అవన్నీ నీకు తెలిసినా నువ్వెలా ఊరుకుంటున్నావు?" (మాంచి లా పాయింట్ లేపానని తెగ సంబరపడిపోతుంటే)

"ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వారికి రాసిపెట్టింది మాత్రమే దొరుకుతుంది తల్లీ, అది తెలుసుకోకుండా తప్పులు చేసారా అదంతా వారి కుండ వారు నింపుకున్నట్టే"

"ఏమిటీ కర్మ సిద్ధాంతమా? నాకు దీని మీద బోల్డు డౌట్స్ ఉన్నాయి కానీ అలా కూర్చో మాంచి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాము"

వేడి వేడి కాఫీతో వెళ్ళి దేవుడి ముందు కూర్చున్నా.

"ఇప్పుడు చెప్పు తల్లీ, నీకు కర్మ సిద్ధాంతం మీద ఉన్న ప్రశ్నలేమిటో"

"ఇలా కాదు కానీ నిన్ను కొంత మంది దగ్గరికి తీసుకుని వెళ్తాను. వారిని చూడు, వారి గురించి నీ అభిప్రాయాలు చెప్పు, సరే నా?"

"సరే పద"

"ఇదిగో స్వామీ ఈ ఇంటి ఇల్లాలిని చూడు, తెల్లారి లేస్తే నీ వెంటే పడుతూ ఉంటుంది ఆవిడ. పూజలూ, వ్రతాలు, నోములూ, పారాయణాలూ హబ్బో హబ్బో మహ చెడ్డ భక్తిలే ఆవిడకి, లోపలికి తొంగి చూడు ఒక సారి"

ఆ మహా ఇల్లాలు అప్పటికే శుభ్రంగా మడీ దడీ కట్టుకుని పూజ మొదలు పెట్టింది

"ఓం కేశవా" "ఒరేయ్ వెధవా, నిద్ర లేవరా"

"ఓం నారాయణా", "ఒరేయ్ నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకో, సంపాదిస్తోంది కదా అని దానికి పొగరు ఎక్కువ అవుతుందేమో, అస్సలు నీ గుప్పెడ దాటి వెళ్ళనీయకు"

"ఓం మాధవా", "నా మాట వినని వారిని నేను బ్రతకనీయను, వారి అంతు చూస్తాను ఏమనుకుంటున్నారో ఆ"

"మధుసూదనా", " నేను చెప్పిన మాట వినకుండా నాకు ఎదురు తిరిగితే సర్వనాశనం ఐపోతారు"

"ఇది ఏమి భక్తి? ఇది ఏమి పూజ స్వామీ"

"హమ్మో ఈవిడా...రోజూ ఈమె తిట్టే తిట్లు వినలేక చెవులు మూసుకుంటున్నా కానీ ఇక్కడి నుండి త్వరగా పద తల్లీ నీకు పుణ్యం ఉంటుంది"

"సరిపోయింది, భగవుంతుడివి నువ్వే పారిపోతే ఆమె కుటుంబ సభ్యులు ఏమి కావాలి స్వామీ?"

"మహా పాపాలు చేసిన పాపిష్టోళ్ళే ఇలాంటి వారి బారిన పడేది కానీ నువ్వు త్వరగా పదమ్మా"

"మరి ఆమె పూజలు, భక్తి, పుణ్యం...." నా నోట్లో మాటలు నోటిలోనే ఉండిపోయాయి, స్వామి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నరు

"సరే స్వామీ, ఇప్పుడు ఇంకొక వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్తాను"

"ఉం, సరే పద"

"ఇదిగో అక్కడ కనిపిస్తున్నాడే ఫోన్ మాట్లాడుతూ అతను. ఒక్క ఐదు నిమిషాలు అతను ఏమి మాట్లాడుతున్నాడో విందామా?"

"సరే కానివ్వు"

"ఈ మధ్య కడుపులో ఒకటే మంటగా ఉంటోంది, మా అత్తగారింటికి ద్వారం నైరుతి లో ఉంది దాని వల్లనే అని నా ఫీలింగ్"

"నాకు నాలుగేళ్ళ నుండి ఒక్క ప్రమోషన్ లేదు, నా పక్క టీం లో ఉన్న అమ్మాయికి మాత్రం రెండు ప్రమోషన్ లు వచ్చేసాయి. అంతేనండీ ఆడవాళ్ళు అంటే చొంగ కార్చుకుంటూ ప్రమోషన్ లూ, ఉద్యోగాలూ అన్నీ ఇచ్చేస్తారు, మగ వెధవలకి ఎక్కడండీ. ఇంతా చేసి, శని నీచం లో ఉన్న అమ్మాయిని పెళ్ళి చేసుకున్నా చూడండి అది నేను చేసిన తప్పు. అక్కడికీ మా అమ్మ చెప్తూనే ఉంది వద్దురా ఆ అమ్మాయి జాతకం బాగాలేదు అని. కానీ వినకుండా చేసుకుని ఈ రోజు అనుభవిస్తున్నా"

(స్వామీ ఇతగాడు యేళ్ళ తరబడి బెంచ్ మీద ఉండి ఇళ్ళు కట్టించిన విషయం నాకు తెలుసు, పని చెయ్యకపోయినా అప్పనం గా ప్రమోషన్ లు కావాలట చూడు. పైగా పాపం ఆ అమ్మాయిని కూడ ఏడిపిస్తున్నట్టున్నాడు త్రాష్టుడు)

"ఏమిటో నండీ, నా జాతకంలో చంద్రుడు వక్రించాడు, దానితో మనసు మీద అస్సలు కంట్రోల్ ఉండటం లేదు. కోపం వచ్చేస్తోంది. ప్చ్, చంద్రుడు బాగుంటే ఎంత బాగుండేదో"

(ఇదెక్కడి పైత్యం స్వామీ?? అన్నిటికీ జాతకాలు, గ్రహాలు అనుకునే మాటైతే అసలు మనిషికి మెదడు ఎందుకు పెట్టావు? మమ్మల్ని బుద్ధి జీవులుగా పుట్టించటం ఎందుకు?)

"ఏమిటి స్వామీ, ఏమీ మాట్లాడవు?"

"ఐపోయిందా, ఇంకెక్కడికైనా వెళ్ళాలా?"

"ఇంకొక జీవిని చూపించాలి ఉండు, ఇతగాడికి "నేను" అంటే "నేను-నా పదవి" అని అర్థం, మాంచి కామెడీ కారెక్టర్"

"హెలో నేను రామారావు, ఏ.ఈ, ఎలెక్ట్రిసిటీ బోర్డ్"

"సార్ సార్, ఆ సుబ్బా రావు ఉన్నాడే, అబ్బే వొఠి వేస్ట్ ఫెలో అండీ ఒక్క నిమిషం కూడా సీట్ లో ఉండడు" (బాసుతో)

"ఆ సుబ్బారావు కి పలానా అమ్మాయితో అదేదో ఉందిట విన్నారా" (సహోద్యోగులతో)

"నన్ను కాదని ఆ సుబ్బా రావు ఏమైనా చేస్తే నేనూరుకుంటానా?" (అతను ఎలాగైనా పడెయ్యాలి అనుకుంటున్న వనజాక్షి దగ్గర)

స్వామి మొహంలో కనీకనిపించకుండా బాధా వీచికలు.

"ఏమిటి స్వామీ అలా మౌనం గా ఐపోయావు? నువ్వు సృష్టించిన మనిషి ప్రవర్తన నీకే అంతు చిక్కకుండా ఉందా?"

""

"ఏమిటి స్వామీ కర్మ సిద్ధాంతం అంటే?"

"సృష్టిలో ప్రతి జీవి తను తెచ్చుకున్న ఫలితాన్ని అనుభవించే తీరాలి తల్లీ"

"బాగుంది. మనిషి నీవల్లనో, ప్రకృతి వైపరీత్యాల వల్లనోకంటే సాటి మనిషి వల్ల ఎక్కువగా బాధ పడాలీ అంటావు, అంతే కదా"

"ఉం, కర్మ ఫలాన్నిబట్టి మనిషి చుట్టూ ఉండే సమూహాన్ని ఏర్పరుస్తాను"

"ఓహో, పీడింపబడేవాడి సంగతి ఓకే, మరి పీడించేవాడి సంగతి ఏమిటి స్వామీ?"

""

"మౌనం ఏలనయా? ఈ పవిత్ర భారతావనిలో పుట్టిన ప్రతి వాడూ కర్మ సిద్ధాంతం అంటాదు. నన్ను ఎవరైనా ఏడిపిస్తూంటే వాడిని ఏమీ అనకుండా ఇది నా కర్మ అని చేతులు కట్టుకుని కూర్చోమంటావా? నీ పూజలు చేస్తూ అవతలి వారిని బూతులు తిట్టే వారిని వారి పాపానికి వారే పోతారు అనుకుని ఊరుకోమంటావా? స్వార్ధం, అహం, అసూయ అన్నీ ఎక్కువైపోయి నేను బాగుంటే చాలు, పక్కవాడిని తొక్కి ఐనా నేను పైకి రావాలి అనుకునే ధూర్తులనీ, తమ జీవితంలో గెలుపైతె తమరి గొప్ప అనీ ఓడిపోతే పక్కవారినో, గ్రహాలనో, జాతకాలనో తప్పు పడుతూ పలాయనవాదం పఠిస్తూండే చవట దద్దమ్మలనీ ఏమనుకుని క్షమించమంటావు?"

""

"అన్నిటినీ మౌనంగా భరించాలి అంటే మాకు బుర్ర బుద్ధీ ఎందుకు పెట్టావు? ఏది తప్పో, ఏది ఒప్పో తెలుసుకునే విచక్షణను నువ్విచ్చినా దాన్ని వినియోగించకుండ తుచ్చమైన కోరికల వెంట పరుగెత్తే అల్ప బుద్ధి నువ్విచ్చావా? మాకు మేమే తెచ్చుకున్నామా? అలా ఉండటం కూడా కర్మ సిద్ధాంతమేనా?"

""

"మనిషి మనిషిగా బ్రతికే రోజు వస్తుందంటావా స్వామీ? తను చేస్తున్నది తప్పో ఒప్పో నిర్ద్వందంగా తెలుసుకునే రోజు వస్తుందా? తమలోని అంతరాత్మని పీక నొక్కి చంపెయ్యకుండా దాని ఘోష వినే రోజు వస్తుందా? జీవిత కాలంలో ఒక్కసారైనా తన లోపలి పొరలను నిష్పాక్షికంగా ప్రశ్నించే రోజు వస్తుందా? మానవ సేవే మాధవ సేవ అని, కర్తవ్యం దైవమాహ్నికం అని మనసా వాచా కర్మేణా నమ్మే రోజు వస్తుందంటావా స్వామీ?"

"ఏమోనమ్మా వస్తుందనే అనుకుందాము"

"అదేంటి స్వామీ అలా వెళ్ళిపోతున్నారు, ఆగండి...హయ్యో హయ్యో....హ్మ్ వెళ్ళిపోయారు"

"కొండలెక్కినా దేవుడా ఆ కొండలలో ఏముంది, నువ్వు చేసిన లోకం చూడు గుండె గుండెకో కథ ఉంది"

ఎక్కడి నుండో లీలగా వినిపిస్తున్న పాటకి మెలకువ వచ్చింది. నా కల ఏమిటో, నా ప్రశ్నలేమిటొ, నా ప్రశ్నలకి పాపం ఆ దేవదేవుడే సమధానాలు చెప్పకుండా వెళ్ళిపోవటం ఏమిటో?

ఇంకెవరు చెప్తారబ్బా నా ప్రశ్నలకి సమాధానాలు?