రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

Showing posts with label ఎన్నెన్నో అందాలు. Show all posts
Showing posts with label ఎన్నెన్నో అందాలు. Show all posts

తపస్సు చేసిందిక్కడే


ప్రకృతి రమణీయ దృశ్యాలు, భక్తి పారవశ్య ప్రదేశాలు, ఎటుచూసినా అభయారణ్యాలు... కొండలమీద నుంచి జాలువారే జలపాతాలు.. విజ్ఞానం, వినోదం.... ఇవన్నీ వింటుంటే ఏదో దేశంలోనే, రాష్ట్రంలోనో అని అనుకున్నట్లయితే మీరు పప్పులో కాలేసినట్లే..! ఎందుకంటే, ఇవన్నీ ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల ప్రాంతంలోనే ఉన్నాయి కాబట్టి. అందమైన సుందర దృశ్యాలనే కాదు.. తన చెట్ల పొదల మాటున తుపాకీ పట్టుకున్న మావోయిస్టులను, లోకం పోకడ తెలియని అమాయక చెంచు ప్రజలను కూడా దాచుకున్నదీ కీకారణ్యమే...!

నల్లమల తూర్పు కనుమలలో ఒక భాగం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, మహబూబ్ నగర్, గుంటూరు, ప్రకాశం, మరియు కడప జిల్లా జిల్లాలలో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇవి కృష్ణానది మరియు పెన్నానదులకు మధ్యన ఉత్తర-దక్షిణ దిశగా దాదాపు 150 కి.మీ. వరకు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాన్నే "నల్లమల అడవులు"గా వ్యవహరిస్తారు.

నల్లమలలో దర్శనీయ స్థలాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది "ఉమామహేశ్వరం". క్రీస్తు శకం 1232లో కాకతీయులు నిర్మించిన ఈ దేవాలయం హైదరాబాద్ నగరానికి 66 కిలోమీటర్ దూరంలోనూ, మహబూబ్ నగర్‌కు 91, అచ్చంపేటకు 14 కిలోమీటర్ల దూరంలోనూ నెలవై ఉంది. శ్రీశైలం ఉత్తర ముఖ ద్వారంగా, రెండవ శ్రీశైలంగా భాసిల్లుతోన్న ఈ క్షేత్రంలో పూర్వం పార్వతిదేవి శివుడి కోసం తపస్సు చేసిందట.

అలాగే చాలామంది మహర్షులు అనేక వందల సంవత్సరాలపాటు శివుడి కోసం తపస్సు చేసిన ప్రాంతమే ఉమామహేశ్వరమని స్కంద పురాణాల ద్వారా కూడా తెలుస్తోంది. ఇక్కడి కొండపై వెలసిన పిల్లల మామిడి చెట్టు కిందన శివుడు కొలువై ఉన్నాడు. శివుడి కొప్పులో అర్ధచంద్రాకాంర ఉన్నట్లుగా.. కొండ మొత్తం కూడా అర్థ చంద్రాకారంలో ఉంటుంది. దీని పక్కనే ఉన్న పాపనాశిని నుంచి నిరంతరం ఐదు ధారలుగా ఒకేచోట ఏర్పడి నీరు ప్రవహిస్తూ ఉంటుంది.

కొండ కింది ప్రాంతాన్ని "భోగ మహేశ్వరం" అని అంటారు. అమ్మవారికి, స్వామివారికి ఐదు గుడులలో ఐదు లింగాలు ఉంటాయి. పంచలింగాలు, జంట లింగాల దేవాలయాలు కూడా ఉన్నాయి. ప్రతి మకర సంక్రాంతికి ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. పరమపవిత్రమైన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే 600 మెట్లు ఎక్కాల్సిందే...!

నల్లమలలో మరో పర్యాటక ప్రాంతం... "మద్దిమడుగు". ఇక్కడ భక్తులు పిలిస్తే పలికే దైవంగా "మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి" భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. నల్లమల లోతట్టు, అటవీ ప్రాంతంలో స్వామివారు స్వయంగా వెలసినట్లు ప్రతీతి. చైత్ర శుద్ధ పౌర్ణమి, కార్తీక మాసాలలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.

ఈ సందర్భంగా హనుమద్గాయత్రి యజ్ఞం చేస్తారు. శని, మంగళవారాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. బెల్లం, గోధుమ రొట్టెలతో చేసిన ప్రత్యేక ప్రసాదాన్ని భక్తులు స్వామివారికి నైవేధ్యంగా సమర్పిస్తుంటారు. ఈ ప్రాంతం హైదరాబాదుకు 186, మహబూబ్‌నగర్‌కు 147, అచ్చంపేటకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఉరుకుల పరుగుల జీవితంలో


ఓ వైపు కింద పరవళ్లు తొక్కుతూ ప్రవహించే నదీ ప్రవాహం.. పైన తాళ్లతో వేలాడే చెక్క వంతెన... అడుగులో అడుగు వేసుకుంటూ ఆ వంతెనపై నడుస్తూ నదిని దాటాలంటే ఎవరికైనా గట్స్ ఉండాల్సిందే..! మరోవైపు పెద్ద లోయ.. కిందికి చూస్తే ప్రాణాలు పైపైనే పోతాయన్న భయం.. అలాంటి చోటుకి కొండ పైనుంచి కిందికి తాళ్లతో జారుకుంటూ పోతే... తలచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ...? అలాగే.. గలగలా పారే నదిలో రయ్‌మంటూ దూసుకెళ్లే మరపడవ.. ఆ పడవలో మీరు భలే ఉంటుంది కదా..! ఇలాంటి సాహసాలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ పలు ప్యాకేజీలను నిర్వహిస్తోంది.

సాహసాలు అనేవి మనసుకు థ్రిల్లింగ్‌ను కలిగిస్తాయి. అవి శరీరానికి మంచి వ్యాయామం కూడా.. ఉరుకుల పరుగుల జీవితంలో విసుగెత్తిపోయేవారు ఇలాంటి ప్రదేశాల్లో ఒక రోజంతా సేదతీరవచ్చు. ఇందుకోసం ఏపీ పర్యాటక శాఖ అనేక రకాల పర్యాటక ప్రదేశాలను ఎంపిక చేసి.. అక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. సుదూర ప్రాంతాలతోపాటు హైదరాబాద్ నగరానికి సమీపంలోగల కీసర గుట్టవద్ద ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ లాంటివి నిర్వహిస్తోంది.హార్స్‌లీ హిల్స్‌లో ట్రెక్కింగ్..!
హార్స్‌లీ హిల్స్... రాక్‌ క్లైంబింగ్‌, ట్రెక్కింగ్‌ చేసే వారికి ఎంతో అనువైన ప్రదేశం. ఇక్కడ రోప్‌వే సౌకర్యం కూడా ఉంది. ప్రకృతి సోయగాల మధ్య.. చల్లటి పిల్ల గాలులు శరీరాన్ని అలా తాకుతూ వెళుతుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఈ ప్రాంతానికి కూడా పర్యాటక..

ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, రివర్ క్రాసింగ్, బోట్ రైడింగ్ తదితర సాహసాలకు ఎక్కడో విదేశాలకు లేదా పక్క రాష్ట్రాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలోనే ఇలాంటి పర్యాటక ప్రదేశాలు బోలెడన్ని ఉన్నాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం, యాదగిరి గుట్ట, భద్రాచలం, కుప్పం, బాసర, హార్స్‌లీ హిల్స్ తదితర ప్రాంతాలు.. అలాంటి వాటిలో కొన్ని. ఈ ప్రాంతాల్లో పర్యాటక శాఖ అన్ని అవకాశలను కల్పించటంతోపాటు.. పగలు, రాత్రి వేళల్లో అక్కడే ఉండి గడిపే విధంగా కూడా ప్యాకేజీలను రూపొందించిది. ఇక.. వసతి, భోజన సౌకర్యాలు కూడా ఆ శాఖే చూస్తుంది కాబట్టి.. దిగులేమీ ఉండదు.

ఆ ప్యాకేజీలేంటో ఇప్పుడు చూద్దామా...?!

కీసర గుట్ట...
హైదరాబాద్‌కు సమీపంలో ఉంది. ఇక్కడ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాక్‌ క్లైంబింగ్‌ నిర్వహిస్తున్నారు. గ్రూపుల వారీగా వెళ్లిన వారికి ప్రత్యేక రాయితీలు ఉంటాయి కూడా. అయితే రవాణా సౌకర్యాలను మాత్రం పర్యాటకులే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లైంబింగ్‌కు మాత్రం గ్రూపును బట్టి కొంత రుసుమును వసూలు చేస్తుంటారు.

నాగార్జున సాగర్...
ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల నాగార్జున సాగర్..! ఇక్కడి కృష్ణానదిలో బోట్‌ రైడింగ్‌ ఎంతో థ్రిల్లింగ్‌ కలిగిస్తుంది. హైదరాబాద్‌ నుంచి వసతి, భోజనం, రవాణా తదితర సౌకర్యాలతో పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలను కల్పిస్తోంది. అలా కాకుండా ఎవరికివారు వారి సొంత ఖర్చులతో, ప్రైవేటు వాహనాలతో కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.

హర్స్‌లీ హిల్స్...
మదనపల్లికి సమీపంలో ఈ కొండలు ఉన్నాయి. రాక్‌ క్లైంబింగ్‌, ట్రెక్కింగ్‌ చేసే వారికి ఇది ఎంతో అనువైన ప్రదేశం. ఇక్కడ రోప్‌వే సౌకర్యం కూడా ఉంది. ప్రకృతి సోయగాల మధ్య.. చల్లటి పిల్ల గాలులు శరీరాన్ని అలా తాకుతూ వెళుతుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఈ ప్రాంతానికి కూడా పర్యాటక శాఖ అన్ని రకాల సౌకర్యాలతో ప్యాకేజీలను అందిస్తోంది.

శ్రీశైలం...
ట్రెక్కర్లకు ఇదో స్వర్గధామం. మల్లిఖార్జునస్వామి కొలువైన ఈ ప్రాంతంలోని నల్లమల అటవీ అందాలు కనువిందు చేస్తుంటాయి. ఈ అడవుల్లోని జలపాతాలు మరో అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు. రవాణా, లాడ్జింగ్, బోడ్జింగ్ తదితర అన్ని రకాల సౌకర్యాలతో ఏపీ టూరిజం శాఖ ప్యాకేజీలను కల్పిస్తోంది.

భద్రాచలం...
పరవళ్లు తొక్కే గోదావరి ఒడ్డున కొలువైన ప్రదేశం భద్రాచలం. సీతారాములు కొలువైన ఈఆధ్యాత్మిక ప్రదేశంలో రాక్‌ క్లైంబింగ్‌కు అనువైన కొండలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడికి కూడా టూరిజంశాఖ అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచుతోంది.

యాదగిరిగుట్ట...
లక్ష్మీ నరసింహస్వామి కొలువైన ప్రదేశం ఇది. ఇక్కడి ఎత్తైన కొండపైకి రాక్‌ క్లైబ్లింగ్‌ చేస్తే ఆ అనుభూతే వేరు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ఈ క్షేత్రానికి ఉదయం వెళితే సాయంత్రానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడికి ప్రైవేటు వాహనాలలో, సొంత ఖర్చులతోనూ వెళ్లవచ్చు లేదా.. టూరిజం శాఖ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది.

శేషాచలం ట్రెక్కింగ్...


నవ దంపతులకు బెస్ట్ హనీమూన్ స్పాట్‌లలో చెప్పుకోదగ్గది "పట్నీటాప్ హిల్ స్టేషన్". ప్రకృతి రమణీయతకు అద్దంపడుతూ, ఎన్నో ప్రత్యేకాంశాలను తనలో దాచుకున్న ఈ పర్యాటక ప్రాంతం... భారతదేశం సరిహద్దుల్లో ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో నెలకొని ఉంది. ప్రకృతి అందాల నిలయమైన ఈ ప్రదేశం గురించిన వివరాలను తెలుసుకుందామా..?

పట్నీటాప్ హిల్ స్టేషన్‌కు ఎలా వెళ్లాలంటే... జమ్మూ దాకా విమానంలో ప్రయాణించవచ్చు. అదే రైలు ప్రయాణం అయితే... దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి జమ్మూ వరకు రైళ్లు ఉన్నాయి. జమ్మూనుంచి పట్నీటాప్‌కు వెళ్లాలంటే.. ట్యాక్సీలు, బస్సులు ఉంటాయి. ట్యాక్సీలకయితే, పదిహేను వందల నుంచి 18 వందల దాకా ప్రయాణ ఛార్జీలు ఉంటాయి. ట్యాక్సీ ప్రయాణం మూడు గంటలు కాగా, బస్సు ప్రయాణం ఐదు గంటల సమయం పడుతుంది.

పట్నీటాప్‌ హిల్‌స్టేషన్‌కు ఏ కాలంలోనయినా వెళ్లవచ్చు. అయితే మే నుంచి జూన్ అలాగే సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్‌ మధ్యకాలంలో అయితే ఆ ప్రాంతం చాలా బాగుంటుంది. మంచుతో ఆడుకుందామని అనుకునేవారు మాత్రం డిసెంబర్‌ నుంచి మార్చి నెలల్లోపు వెళ్తే మంచిది.

వసతికి సంబంధించి చూసినట్లయిచే... జమ్మూ, కాశ్మీర్‌ పర్యాటక విభాగం ఆధ్వర్యంలో అనేక టూరిస్ట్ బంగ్లాలు, కాటేజీలు ఉన్నాయి. డ్రాయింగ్‌, డైనింగ్‌ రూములు, అన్ని సౌకర్యాలతో కిచెన్‌, ఎల్‌పిజి గ్యాస్‌ సిలిండర్‌లతో సహా ఇవి ఉంటాయి. వేసవిలో రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక ముందుగానే బంగ్లాని రిజర్వు చేయించుకోవాల్సి ఉంటుంది.

చలికాలం వచ్చిందంటే చాలు... పట్నీటాప్ హిల్‌ స్టేషన్‌లో సాహసాలు చేసేందుకు ఇష్టపడేవారితోనూ... కొత్తగా పెళ్లయినవారితోనూ కళకళలాడుతూ ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి నెలలో స్కైయింగ్ క్యాంపులు, వేసవిలో ట్రెక్కింగ్ క్యాంపులతో ఈ ప్రాంతమంతా చాలా హడావిడిగా ఉంటుంది. ఇటీవలనే ఈ పట్నీటాప్‌లో పారాగ్లయిడింగ్ ప్రారంభమయ్యింది. త్వరలోనే పారాసెయిలింగ్, హాట్ ఎయిర్ బెలూనింగ్‌లను కూడా పర్యాటకశాఖ ప్రవేశపెట్టనుంది.

ఇదిలా ఉంటే... దేవాలయాల నగరమైన జమ్మూలోని ఆకర్షణల విషయానికి వస్తే... అక్కడి రాజప్రసాదాలు, కోటలు, అందమైన అడవులతో పాటు జమ్మూవాసులు ఎంతో భక్తిగా కొలుచుకునే బహుమాత ఆలయం ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అలాగే, పీర్‌బుధాన్ అలీ షా దర్గాను కూడా జమ్మూ ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు.

అలాగే త్రికూట కొండలపై నెలకొన్న వైష్ణోదేవి... తవినది ఎడమ ఒడ్డున కొండమీద ఉంటే కోటలోని బహుఫోర్ట్ ఆలయం, కొండ శిఖరాలనే కాకుండా కొండ కింద ఉండే బుద్ధ అమర్‌నాథ్ ఆలయం, జమ్మూకు పశ్చిమంగా 32 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రేమకథకు నిలయాలైన అక్నూర్, సోహ్ని, మహీవాల్‌లు... కోన్ ఆకారంలో ఉండే పచ్చటి మైదాన ప్రాంతం సన్సార్, కిష్టర్ మైదానం, ముబారక్ మండి పాలెస్, రఘునాథ్ ఆలయం, శుధ్‌ మహదేవ్‌ పుణ్యక్షేత్రం తదితర ప్రాంతాలను వీక్షించవచ్చు.

శివరాత్రి పండగ సమయంలో జమ్మూ వెళ్లినట్లయితే... ఎక్కడ చూసినా ఉత్సవాలు కనిపిస్తాయి. స్థానిక చేతివృత్తులు, వంటలకు సంబంధించి మూడు రోజుల పాటు జరిగే "మన్సార్‌ ఫుడ్‌ అండ్‌ క్రాఫ్ట్" మేళాలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎందరో పాల్గొంటారు. వసంతం ఆగమనాన్ని సూచిస్తూ "లోహ్రి ఉత్సవం" జరుగుతుంది. ఈ ఉత్సవం నాడు మొత్తం జమ్మూ అంతా పండగ వాతావరణం నెలకొంటుంది. ప్రతి ఏడాది వైశాఖ మాసం మొదటి రోజున వైశాఖి పూర్ణిమను జమ్మూ ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.